Ap High Court: ఏపీలో సంక్షేమ పథకాల నగదు జమ - హైకోర్టు కీలక ఆదేశాలు
Andhra pradesh News: సంక్షేమ పథకాల నిధుల విడుదలకు సంబంధించి ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలే కొనసాగుతాయని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 14వ తేదీనే నిధులు విడుదల చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
Ap High Court Orders On Welfare Schemes Funds Release: రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బుల జమపై ఏపీ హైకోర్టు (AP High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం (Election Commission) చెప్పిన విధంగానే పోలింగ్ తర్వాతే నగదు జమ చేసుకోవాలని తెలిపింది. లబ్ధిదారుల ఖాతాల్లో నగదును ఈ నెల 14న జమ చేసుకోవచ్చని గతంలో ఈసీ ఇచ్చిన ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. కాగా, శుక్రవారం ఒక్కరోజు నగదు బదిలీ చేసేందుకు హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై.. డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేయగా.. విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 13న పోలింగ్ ప్రక్రియ జరగనుండగా.. ఆ తర్వాత రోజు నుంచి డీబీటీ ద్వారా నగదు బదిలీ చేసుకోవాలన్న ఈసీ ఆదేశాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది.
ప్రభుత్వం ఏం చెప్పిందంటే.?
కాగా, శుక్రవారం ఒక్కరోజు డీబీటీ ద్వారా నగదు జమ చేయడానికి హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇవ్వగా.. దీనిపై డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో ప్రభుత్వ తరఫు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తన వాదనలు వినిపించారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చిలోనే లబ్ధిదారుల ఎంపిక జరిగిందని.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కొత్తగా లబ్ధిదారుల ఎంపిక జరగలేదని హైకోర్టుకు తెలిపారు. ఇవన్నీ పాత పథకాలే తప్ప కొత్తవి కాదని.. వాటికి సంబంధించిన నగదునే ఇప్పుడు లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయాలని చూస్తున్నామని వెల్లడించారు. దీనిపై సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చినా ఇప్పటివరకూ ఈసీ క్లారిటీ ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇంకా తాము నిధులు విడుదల చేయలేదని చెప్పారు. గతంలో 2019లో పసుపు కుంకుమ కోసం పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, సుదీర్ఘ విచారణ అనంతరం ఈసీ ఆదేశాలనే సమర్థిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో, ఈ నెల 14నే సంక్షేమ పథకాల నిధులు విడుదల కానున్నాయి.
ఈసీ ప్రశ్నల వర్షం
అంతకు ముందు శుక్రవారం ఒక్కరోజు నగదు విడుదల చేసుకోవచ్చని హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలివ్వగా.. దీనిపై ఈసీ ప్రభుత్వానికి మరో లేఖ రాసింది. జనవరిలో ప్రారంభించిన పథకాలకే ఇప్పటివరకూ నగదు ఇవ్వని మీకు.. ఇప్పుడు ఒకేసారి ఇంత నగదు ఎలా వచ్చిందని లేఖలో ప్రశ్నించింది. 'బటన్ నొక్కి చాలా రోజులైనా.. ఇప్పటివరకూ లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు ఎందుకు జమ చేయలేకపోయారు.?. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకూ డీబీటీలకు నిధులు ఎందుకు ఇవ్వలేదు.?. ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నం ఎన్నికల పోలింగ్ తేదీకి దగ్గరగా డబ్బులు పంపిణీ కాదని ఎలా చెప్తారు?. ఇలా సొమ్ములు పంపిణీ చేయడం వల్ల ఇతర అభ్యర్థులకు అన్యాయం జరగదా.? లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెబ్బతినదా..?. గత ఐదేళ్లుగా సంక్షేమ పథకాలకు నిధుల బటన్ నొక్కిన నాటి నుంచి ఎన్ని రోజుల్లో పడ్డాయి ఆ వివరాలు ఇవ్వండి. ఇప్పుడు మాత్రమే ఎందుకు ఆలస్యమైంది..?. పోలింగ్ తేదీకి దగ్గరగా ఈ సొమ్ములు ఎందుకు వేయాలనుకుంటున్నారా వివరణ ఇవ్వండి..? ఈ రోజే లబ్ధిదారులకు సొమ్ము చెల్లించకపోతే జరిగే ప్రమాదం ఏంటి.?. సంక్షేమ పథకాలు నిధులు ఇస్తామని చెప్పి వారాలు, నెలలు గడిచిపోయాయి. ఏప్రిల్, మే నెలలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ముందుగా తెలియదా?. పోలింగ్ తేదీకి ఒకరోజు ముందు అంత తొందర ఏం వచ్చింది..?. ముందుగానే పంపిణీ తేదీని నిర్ణయించి ఉంటే ఆ వివరాలను కూడా డాక్యుమెంట్ రూపంలో అందించండి.'ఎన్నికల సంఘం ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొంది.
Also Read: Sharmila : తల్లికిచ్చిన మాటను కూడా తప్పారు - జగన్ మానసిక స్థితిపై ఆందోళన - షర్మిల సంచలన వ్యాఖ్యలు