AP Elections 2024: కర్నూలు జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు వీళ్లే
Assembly seats in Kurnool district : ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా స్థానాలకు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి.
Kurnool District Assembly Seats : ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా స్థానాలకు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడానికి ఇటు అధికార వైసీపీ(YSRCP), అటు కూటమిలోని పార్టీలు వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. అభ్యర్థిత్వం ఖరారు కావడంతో నేతలు జోరుగా ప్రజల్లోకి వెళుతున్నారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు మీకోసం.
పోటీ చేస్తున్న అభ్యర్థులు వీరే
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా దారా సుధీర్ పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి గిత్తా జయసూర్య బరిలోకి దిగుతున్నారు. కోడుమూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆదిమూలపు సతీష్ పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి బొగ్గుల దస్తగిరి బరిలోకి దిగుతున్నారు. ఆళ్లగడ్డ నుంచి వైసీపీ అభ్యర్థిగా గంగుల బ్రిజేంద్రరెడ్డి పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి భూమా అఖిలప్రియ పోటీ చేస్తున్నారు. శ్రీశైలం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డి పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి బరిలో ఉన్నారు. బనగానపల్లె నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి బీసీ జనార్థనరెడ్డి పోటీ చేస్తున్నారు. పాణ్యం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామ్‌భూపాల్‌రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి గౌరు చరితారెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఆలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా బి విరూపాక్షి పోటీ చేస్తున్నారు. కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి వీరభద్రగౌడ్ బరిలోకి దిగుతున్నారు.
బుట్టా రేణుక వర్సెస్ జయనాగేశ్వరరెడ్డి
ఎమ్మిగనూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా బుట్టా రేణుక పోటీ చేస్తుండగా, టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా జయనాగేశ్వరరెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఆదోని నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా వై సాయిప్రసాద్ రెడ్డి, కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి పార్థసారధి పోటీ చేస్తున్నారు. కర్నూలు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎండీ ఇంతియాజ్ పోటీ చేస్తుండగా, టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా టీజీ భరత్ బరిలో ఉన్నారు. నంద్యాల నుంచి వైసీపీ అభ్యర్థిగా శిల్పా రవి చంద్రకిషోర్ రెడ్డి పోటీ చేస్తుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఎన్‌ఎండీ ఫరూక్ పోటీ చేస్తున్నారు. పత్తికొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా కంగాటి శ్రీదేవి పోటీ చేస్తుండగా, టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా కేఈ శ్యాంబాబు బరిలో ఉన్నారు.
డోన్ నుంచి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరోసారి వైసీపీ నుంచి బరిలోకి దిగుతుండగా, కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మంత్రాలయం నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి బరిలోకి ఉన్నారు. టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా రాఘవేంద్రరెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో పోటీ అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది. గడిచిన ఎన్నికల్లో వైసీపీ ఈ జిల్లాలోని మొత్తం స్థానాల్లో విజయం సాధించి క్లీన్ స్వీప్ చేసింది. మరోసారి అదే తరహా ఫలితాలను సాధించాలని వైసీపీ పట్టుదలగా ఉండగా, పదికిపైగా స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కూటమి అడుగులు వేస్తోంది.