Anantapur TDP : రాజీపడ్డారు లేకపోతే పార్టీ మారిపోయారు - అనంతపురం జిల్లా టీడీపీలో సర్దుకున్న అసంతృప్తి !
Andhra Politics : అనంతపురం జిల్లా తెలుగుదేశంలో అసంతృప్తి సద్దుమణిగింది. కొంత మంది నేతలు రాజీ పడ్డారు.. కొంత మంది నేతలు పార్టీ వీడి వెళ్లారు.
Anantapur Telugu Desam Party is on track : టిక్కెట్ల ప్రకటన తర్వాత అనంతపురం తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి మంటలు ఎగసిపడ్డాయి. కార్యాలయాలను కూడా తగులబెట్టారు. ఇప్పుడు పరిస్థితి సద్దుమణిగింది. ప్రధానంగా అనంతపురం, గుంతకల్లు నియోజకవర్గాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్ చౌదది, జితేందర్ గౌడ్‌లు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. వీరిద్దరికీ టిక్కెట్టు ఖరారవలేదన్న విషయం తెలిసిన వెంటనే రెండు నియోజకవర్గాలల్లో టీడీపీ కార్యాలయాలపై దాడి చేసి ఫర్నీచర్లు ధ్వంసం చేశారు. స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తామని ప్రకటించారు.
అసంతృప్త నేతల్ని పిలిచి బుజ్జగించిన చంద్రబాబు
వీరిని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలిపించుకుని మాట్లాడారు. దీంతో వారు కొంత మెత్తబడినట్టు తెలుస్తోంది. వారిద్దరికీ పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రభాకర్ చౌదరికి రాయలసీమ బాధ్యతలు , జితేందర్ గౌడ్‌కు అనంతపురం జిల్లా బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. ఇద్దరు సీనియర్ నాయకులే కావడంతో వారి నియోజవర్గాల్లో మంచి పట్టున్న నేతలు కూడా. వీరు అభ్యర్థులతో కలిసి పనిచేస్తే పార్టీని సానుకూల పరిస్థితులే ఉంటాయని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అనంతపురం సిటీలో వైకుంఠం ప్రభాకర్ చౌదరి సమీప బంధువు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కు అవకాశం కల్పించారు. గుంతకల్లులో టీడీపీలో చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు అవకాశం ఇచ్చారు.
మడకశిరలో అభ్యర్థిని వ్యతిరేకిస్తున్న కొంత మంది నేతలు
శింగనమల నియోజకవర్గంలో అభ్యర్థిపై అసంతృప్తితో ఉన్న నేతలతో ఇది వరకే చంద్రబాబు మాట్లాడారు. ఆలం నరసానాయుడు, కేశవరెడ్డిలు ఇప్పుడు మౌనంగా పనిచేసుకునిపోతున్నారు. దీంతో అసమ్మతి కనిపించడం లేదు. ఇక మడకశిరలో మాత్రం ఇంకా కొంత అసంతృప్తి కనిపిస్తోంది. అభ్యర్థి సునీల్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామికి మధ్య పడటం లేదు. అభ్యర్థిని మార్చాలని పట్టుబడుతున్నారు. అక్కడ కూడా పార్టీ నేతలు సర్ది చెబితే.. అనంతపురంలో ఎలాంటి సమస్యలు లేకుండా పోయినట్లవుతుంది.
పార్టీ వీడిపోయిన ఉమామహేశ్వరనాయుడు, చాంద్ భాషా
అసంతృప్తి తీవ్రంగా ఉన్న కళ్యాణదుర్గం, కదిరిల్లో ఇప్పటికే అసమ్మతి నేతలు పార్టీని వీడిపోయారు. కల్యాణదుర్గంలో గత ఎన్నికల్లో పోటీ చేసిన ఉమామహేశ్వర నాయుడు వైసీపీలో చేరిపోయారు. కదిరిలో మాజీ ఎమ్మెల్యే చాంద్ భాషా కూడా వైసీపీలో చేరిపోయారు. వారు బయటకు పోవడంతో తక్కిన వారు పార్టీ కోసం పనిచేసే వారు ఉండిపోయారు. అనంతపురం, గుంతకల్లు అదినేత హామీతో సద్దుమణిగినట్టయింది. తక్కిన నియోజకవర్గాల్లో ఎక్కడా పెద్దగా అసంతృప్తులు ఇక కనిపించడం లేదు. కలసి కట్టుగా పని చేస్తే ఈ సారి ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని టీడీపీ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి.