(Source: ECI/ABP News/ABP Majha)
NIT: వరంగల్ 'నిట్'లో కొత్త కోర్సులు, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రవేశాలు
వరంగల్‌లోని నిట్‌లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి మరిన్ని కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుత ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్ డిగ్రీ(B.Tech)లో మరో నాలుగు కొత్త కోర్సులను ప్రవేశపెట్టనుంది.
NIT WARANGAL COURSES: వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Warangal NIT)లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి మరిన్ని కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుత ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా ఇంజినీరింగ్ డిగ్రీ(B.Tech)లో మరో నాలుగు కొత్త కోర్సులను ప్రవేశపెట్టనుంది. ఇదివరకు బీటెక్‌లో ఎనిమిది కోర్సులు ఉండగా.. ఈసారి కొత్తగా మ్యాథమెటిక్స్ & కంప్యూటింగ్ ఇంజినీరింగ్ కోర్సులు ప్రవేశపెట్లారు. ఈ కోర్సులకు తోడు వచ్చేవిద్యా సంవత్సరం నుంచి మరో నాలుగు కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని నిట్ నిర్ణయించింది. వీటిలో టెక్స్‌టైల్ ఇంజినీరింగ్, రైల్వే, అగ్రి ఇంజినీరింగ్, బీఆర్క్ కోర్సులు ఉన్నాయి.
పరిశోధన, ప్రాంగణ నియామకాలపై ఫోకస్..
నిట్ వరంగల్ కొన్నేళ్లుగా పరిశోధన, ప్రాంగణ నియామకాలపై దృష్టి పెట్టింది. ఇప్పటికి వందకు పైగా పేటెంట్లు నిట్‌కు దక్కడం విశేషం. ఏటా కనీసం 5 నుంచి 10 ఆవిష్కరణలకు మేధోహక్కులు వచ్చేలా పరిశోధన స్థాయిని పెంచారు. వరంగల్‌లో దేశంలోనే పెద్దదైన 'కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు' నిర్మాణంలో ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం 'పీఎం మిత్ర' పథకాన్ని మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో వరంగల్ నిట్‌లో టెక్స్‌టైల్ ఇంజినీరింగ్ కోర్సు వస్తే విద్యార్థులకు మెరుగైన ఉద్యోగావకాశాలు ఉంటాయని అక్కడి ప్రొఫెసర్లు భావిస్తున్నారు. కాజీపేటలో రూ.500 కోట్లతో రైల్వే శాఖ నెలకొల్పుతున్న పీవోహెచ్ పరిశ్రమకు గతేడాది ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. దీనికి అనుసంధానంగా ఉండేలా రైల్వే ఇంజినీరింగ్ కోర్సు, వరి, పత్తి, మొక్కజొన్న పంటల్ని ఉమ్మడి వరంగల్‌లో గణనీయంగా సాగు చేస్తున్న క్రమంలో అగ్రి ఇంజినీరింగ్ కోర్సులతో పాటు, బీటెక్ ఆర్కిటెక్చర్‌ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
క్యాంపస్ విస్తరణకు స్థలం కొరత..
ప్రస్తుతం నిట్ క్యాంపస్ 247 ఎకరాల్లో విస్తరించి ఉంది. పెరుగుతున్న పరిశోధనల స్థాయి, కొత్త కోర్సుల భవనాల నిర్మాణం కోసం నిట్ క్యాంపస్‌లో స్థలం కొరత సమస్య అధికంగా ఉంది. క్యాంపస్ విస్తరణకు మరో వంద ఎకరాల భూమి కావాలని, వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి 163 పక్కన తమకు స్థలం కేటాయించాలని కోరుతూ నిట్ ఆచార్యుల బృందం ఇటీవల హనుమకొండ కలెక్టర్ సిక్తాపట్నాయక్‌కు లేఖ అందజేసింది. నిట్ రూర్కెలా క్యాంపస్ 640, నిట్ తిరుచ్చి 800 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. వాటికన్నా ముందు ప్రారంభమైన వరంగల్ నిట్‌కు మాత్రం ప్రస్తుతం ఉన్న స్థలం సరిపోవడం లేదని డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుద్ధి తెలిపారు.
ALSO READ:
పేద విద్యార్థులకు వరం, ఎల్‌ఐసీ ఉపకారం- 'గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్' నోటిఫికేషన్ విడుదల
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) 2023 సంవత్సరానికి సంబంధించి గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం అందిస్తారు. అర్హులైన విద్యార్థులు జనవరి 14 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. కనీస అర్హతగా పేర్కొన్న టెన్త్ లేదా ఇంటర్‌లో పొందిన మార్కుల మెరిట్, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా అభ్యర్థులను స్కాలర్ షిష్‌నకు ఎంపిక చేస్తారు.
స్కాలర్‌షిప్ వివరాల కోసం క్లిక్ చేయండి..