ICET 2023: త్వరలో మరో విడత ఐసెట్ కౌన్సెలింగ్, 'సెల్ఫ్ ఫైనాన్స్' విధానం అమలు
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి సంబంధించి మరోవిడత ఐసెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి సంబంధించి మరోవిడత ఐసెట్ కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఈసారి రాష్ట్రంలో తొలిసారిగా సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నారు. ఇందులో మంజూరైన సీట్లకు సర్కారు నుంచి బోధనా రుసుములు వర్తించవు. తాజాగా 37 కళాశాలల్లో 3,060 ఎంబీఏ, 25 కళాశాలల్లో 2,700 ఎంసీఏ సీట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. త్వరలో వాటి భర్తీకి ప్రత్యేకంగా ఐసెట్ కౌన్సెలింగ్ జరపనున్నారు. 70 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేయనున్నారు. అయితే అలా చేరిన విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ వర్తించదు.
వాస్తవానికి సెల్ఫ్ ఫైనాన్స్ విధానం కింద ప్రస్తుత విద్యా సంవత్సరంలో బీటెక్ సీట్లను మంజూరు చేయాలని సాంకేతిక విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఎన్నికల సమయం కావడం, విద్యార్థులకు బోధనా రుసుములు ఎత్తివేస్తున్నారనే విమర్శలు వస్తాయనే భావనతో వెనకడుగు వేసింది. రాష్ట్రంలోని కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు రూ.40 వేల నుంచి రూ. లక్ష వరకు వార్షిక ఫీజు ఉంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పూర్తిగా.. మిగిలిన వారికి రూ.35 వేల వరకు ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇస్తున్నారు. కొత్తగా మంజూరైన సీట్లకు మాత్రం ఫీజు మొత్తాన్ని విద్యార్థులే భరించాలి.
విచారణ ఉండగానే..
ఎంబీఏ, ఎంసీఏ సీట్లు పెంచుకునేందుకు ఏఐసీటీఈ కొద్ది నెలల క్రితమే అనుమతిచ్చింది. ప్రభుత్వం వాటికి ఆమోదం తెలపకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. సీట్లపై నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. అక్టోబరు 9న మళ్లీ విచారణ ఉండగా.. ఈలోపే కొత్త సీట్లకు అనుమతిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. వాటికి జేఎన్‌టీయూహెచ్, ఓయూ తదితర వర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇవ్వగానే మరో విడత ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఐసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ముగిసి 10 రోజులవుతోంది. కొత్త సీట్లు మంజూరైన నేపథ్యంలో ఇటీవల కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారితోపాటు ఐసెట్‌లో ఉత్తీర్ణులైన వారూ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.
ఎంబీఏకు డిమాండ్..
సంప్రదాయ డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరిన వారి కంటే ప్రొఫెషనల్ కోర్సులైన బీటెక్, ఎంబీఏ, ఎంఫార్మసీ తదితర వాటిని పూర్తి చేసిన వారికి త్వరగా కొలువులు దక్కుతాయనే భావన ఉంది. సాఫ్ట్‌వేర్, ఐటీ కంపెనీలు ఇంజినీర్లనే కాకుండా అడ్మినిస్ట్రేషన్, హెచ్‌ఆర్ తదితర పలు విభాగాల్లో ఎంబీఏ విద్యార్థులను నియమించుకుంటున్నాయి. బీటెక్ విద్యార్థులు సైతం ఎంబీఏకు పెద్దసంఖ్యలో పోటీపడుతున్నారని నిపుణులు పేర్కొంటున్నారు.
ALSO READ:
GATE - 2024 దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో పీజీ, డాక్టోరల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్)-2024 దరఖాస్తు గడువును ఐఐఎస్సీ-బెంగళూరు మరోసారి పొడిగించింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఎలాంటి ఆలస్యరుసుము లేకుండా అక్టోబర్ 12 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే ఎక్స్‌టెండెడ్ పీరియడ్‌తో రూ.500 ఆలస్యరుసుముతో అక్టోబరు 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో గేట్ పరీక్షలను నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో పరీక్ష నిర్వహించనున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..