EAMCET: ఇంజినీరింగ్ తుది విడత సీట్ల కేటాయింపు పూర్తి, కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన 13,139 సీట్లు
లంగాణలో ఎంసెట్ 2023 కౌన్సెలింగ్‌లో భాగంగా నిర్వహించిన తుది విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. తుది విడత కౌన్సెలింగ్ పూర్తయ్యాక కన్వీనర్ కోటాలో 13,139 సీట్లు మిగిలిపోయాయి.
తెలంగాణలో ఎంసెట్ 2023 కౌన్సెలింగ్‌లో భాగంగా నిర్వహించిన తుది విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. తుది విడత సీట్ల కేటాయింపు తర్వాత ఇప్పటి వరకు ఇంజినీరింగ్ కన్వీనర్ కోటాలో 70,627 సీట్లను భర్తీ చేశారు. తుది విడత కౌన్సెలింగ్ పూర్తయ్యాక కన్వీనర్ కోటాలో 13,139 సీట్లు మిగిలిపోయాయి. సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 11 లోపు సంబంధిత కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
కన్వీనర్ కోటాలో రాష్ట్రంలో 83,766 ఇంజనీరింగ్ సీట్లు ఉండగా, వాటిలో సెకండ్ ఫేజ్ వరకూ 62,738 మంది విద్యార్థులు ఆయా కళాశాలల్లో చేరారు. అయితే తుది విడతలో 21,028 సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించగా అందులో 7889 సీట్లు భర్తీకాగా ఇంకా 13,139 సీట్లు మిగిలాయి. మొత్తంగా 174 ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 83,766 సీట్లలో 70,627 (84.31శాతం) సీట్లు కేటాయించగా ఇంకా 13,139 సీట్లు మిగిలాయి. ఈ మిగిలిన సీట్లను ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించి విద్యార్థులకు కేటాయిస్తారు.
గతేడాది కంటే ఈసారి భర్తీ అయిన సీట్ల సంఖ్య కాస్త పెరిగింది. 3 యూనివర్సిటీలు, 27 ప్రైవేట్ కాలేజీల్లో వందకు వంద శాతం సీట్లు నిండాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఇప్పటి వరకు 5480 మందికి సీట్లు కేటాయించారు. కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత ఇంజనీరింగ్ కోర్సుల్లో అత్యధికంగా 93.35 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 9 నుంచి 11వ తేదీలోపు ఆయా కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది.
కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్ల భర్తీకి ఆగస్టు 17 నుంచి ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఇప్పటికే కన్వీనర్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా మరో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆగస్టు 17న స్లాట్ బుకింగ్, 18న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఆగస్టు 17 నుంచి 19 వరకు తుది విడత వెబ్ ఆప్షన్లు స్వీకరించి.. ఆగస్టు 23న సీట్లు కేటాయిస్తారు. స్పాట్ ప్రవేశాల కోసం ఆగస్టు 23న రోజున మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.
తెలంగాణలో ఇటీవల 14,565 ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపిన సంగతి తెలిసిందే. కోర్ గ్రూపుల్లో సీట్లు వెనక్కి ఇస్తామని పేర్కొంటూ ఇంజినీరింగ్ కాలేజీలు కంప్యూటర్ కోర్సుల్లో సీట్లకు అనుమతి కోరాయి. దీంతో 6,930 సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే కొత్తగా 7,635 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఖరారు చేసింది. ఫలితంగా అదనపు సీట్లతో ఏటా సర్కారుపై రూ. 27.39 కోట్ల భారం పడనుంది. ఇటీవల 86,106 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, తాజాగా అనుమతిచ్చిన వాటితో కలిపి రాష్ట్రంలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య 1,00,671కి చేరింది.
స్పెషల్ కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..
➥ ఆగస్టు 17: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించి తేదీ, సమయం ఎంచుకోవాల్సి ఉంటుంది(ఫస్ట్, సెకండ్ ఫేజ్‌లో ఈ వివరాలు నింపని విద్యార్థులు మాత్రమే).
➥ ఆగస్టు 18: స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్.
➥ ఆగస్టు 17 - ఆగస్టు 19 వరకు: సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు కోర్సులు, కాలేజీల ఆప్షన్స్ ఎంచుకోవాల్సి ఉంటుంది.
➥ ఆగస్టు 23: సీట్ల కేటాయింపు.
➥ ఆగస్టు 23 – ఆగస్టు 25 వరకు: సీట్లు పొందిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
స్పాట్ ప్రవేశాలు...
స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన వివరాలను ఆగస్టు 23 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
ALSO READ:
టీఎస్ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫార్మసీ, బయెటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 2, 3 తేదీల్లో ఎంసెట్ బైపీసీ అభ్యర్థులు నిర్ణీత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబరు 4, 5 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన చేయనున్నారు. సెప్టెంబరు 4 నుంచి 7 వరకు ఎంసెట్ బైపీసీ అభ్యర్థుల వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. సెప్టెంబరు 11న బీఫార్మసీ, ఫార్మ్‌డీ తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 17 నుంచి ఎంసెట్ బైపీసీ తుది విడత కౌన్సెలింగ్ ఉండనుంది. సెప్టెంబరు 23న ఫార్మా, బయోటెక్నాలజీ కోర్సుల తుది విడత సీట్ల కేటాయింపు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబరు 24న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదలవుతాయి.