TG TET 2024: తెలంగాణ టెట్-2024 నవంబరు నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
TGTET: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నవంబరు 2024 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థులు నవంబరు 5 నుంచి 20 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని విద్యాశాఖ సూచించింది.
TGTET 2024 Notification: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET) నవంబరు - 2024 నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ నవంబరు 4న విడుదల చేసింది. అభ్యర్థులు నవంబరు 5 నుంచి 20 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని విద్యాశాఖ సూచించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
టెట్-2024లో అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులకు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటును ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా టెట్-2024లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటును రేవంత్ సర్కార్ కల్పించింది .
టీఎస్ టెట్ నవంబరు- 2024 షెడ్యూలు..
➥ టెట్- 2024 నోటిఫికేషన్ వెల్లడి: 04.11.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.11.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.11.2024.
➥ టెట్-2024 పరీక్ష నిర్వహణ: 01.01.2025 - 20.01.2025.
టెట్ అర్హతలకు సంబంధించి.. పేపర్-1కు డీఎడ్, పేపర్-2కు బీఎడ్ పూర్తయి ఉండాలి. వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. దీంతోపాటు స్కూల్ అసిస్టెంట్‌గా ప్రమోషన్లకు సైతం టెట్ అర్హతను ప్రామాణికంగా నిర్ణయించడంతో.. వేలాది మంది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా పరీక్షకు హాజరుకానున్నారు. టెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు తొమ్మిది సార్లు పరీక్షలు నిర్వహించగా...జనవరిలో పదోసారి నిర్వహించనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత మే పరీక్షతో కలుపుకొని ఆరుసార్లు పరీక్షలు జరిపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండోసారి టెట్‌ను నిర్వహిస్తుండటం విశేషం.
టెట్-2024కు సంబంధించి మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13% అర్హత నమోదుకాగా.. పేపర్-2లో 34.18 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. టెట్-2023 ఫలితాలతో పోల్చితే పేపర్-1లో 30.24 శాతం, పేపర్-2లో 18.88 శాతం అర్హత పెరగడం గమనార్హం.
ALSO READ: ఏపీ టెట్-2024 జులై ఫలితాలు విడుదల, 50.79 శాతం అర్హత