TS LAWCET: టీఎస్ లాసెట్ -2024 షెడ్యూల్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని న్యాయకళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా డిగ్రీతో పాటు పీజీ లా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌లాసెట్, పీజీఎల్‌సెట్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి 9న విడుదల చేసింది.
TS LAWCET 2024 Schedule: తెలంగాణలోని న్యాయకళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా డిగ్రీ(ఎల్‌ఎల్‌బీ)తో పాటు పీజీ లా (ఎల్‌ఎల్‌ఎం) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌లాసెట్, పీజీఎల్‌సెట్ షెడ్యూలును ఉన్నత విద్యామండలి ఫిబ్రవరి 9న విడుదల చేసింది. ప్రాథమిక సమాచారం మేరకు ఫిబ్రవరి 28న లాసెట్/పీజీఎల్‌సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుంతో మే 25 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
రాష్ట్ర ఉన్నతవిద్యామండలి ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. 'టీఎస్ లాసెట్/పీజీఎల్‌సెట్-2024 పరీక్షను జూన్ 3న కంప్యూటర్ ఆధారిత విధానంలో లాసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. అదే విధంగా పీజీ లా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ టెస్టును కూడా అదేరోజు నిర్వహించనున్నారు. మూడేళ్ల ఎల్ఎల్‌బీ కోర్సుకు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు; ఐదేళ్ల ఎల్ఎల్‌బీ, రెండేళ్ల ఎల్ఎల్ఎం కోర్సులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రాతపరీక్ష నిర్వహించనున్నారు. లాసెట్, పీజీ ఎల్‌సెట్‌లను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది.
కోర్సుల వివరాలు..
1) మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు
- ఎల్‌ఎల్‌బీ
- ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్)
అర్హత: 45 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. డిగ్రీ చివరిసంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.
2) ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు
- బీఏ ఎల్‌ఎల్‌బీ
- బీకామ్ ఎల్‌ఎల్‌బీ
- బీబీఏ ఎల్‌ఎల్‌బీ
అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఇంటర్ సెకండియర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులు. ఓబీసీలకు 42 శాతం, ఎస్సీ-ఎస్టీలకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: ఎలాంటి వయోపరిమితి లేదు.
3) రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సు
అర్హత: ఎల్‌ఎల్‌బీ/బీఎల్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లా డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు..
➥ టీఎస్ లాసెట్/ టీఎస్‌పీజీ ఎల్‌సెట్ నోటిఫికేషన్: 28.02.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.03.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.04.2023.
➥ ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేది: 25-05-2024.
➥ లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్ష తేది: 03.06.2024.
ఈఏపీసెట్ షెడ్యూలు విడుదల..
తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించనున్న 'టీఎస్ ఈఏపీసెట్ షెడ్యూలు ఫిబ్రవరి 6న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 21న ఈఏపీసెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఫిబ్రవరి 26 నుంచి ఏప్రిల్ 6 వరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 9 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మే 9 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ కోర్సులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అలాగే మే 12న అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఉన్నత విద్యామండలి ఇటీవలే ఎంసెట్ పేరును ఈఏపీసెట్‌గా మార్చిన సంగతి తెలిసిందే. జేఎన్టీయూ హైదరాబాద్ పరీక్షలు నిర్వహించనుంది.
ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూలు ఇలా..
➥ బీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఉద్దేశించిన టీఎస్ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష మే 23న జరగనుంది. నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహించనుంది.
➥ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్దేశించిన 'టీఎస్ ఐసెట్' ప్రవేశ పరీక్షను జూన్ 4, 5 తేదీల్లో నిర్వహించనున్నారు. కాకతీయ యూనివర్సిటీ నిర్వహణలో ఈ కామన్ ఎంట్రెన్స్ టెస్టు జరగనుంది.
➥ బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'టీఎస్ పీఈసెట్' పరీక్షను జూన్ 10 నుంచి 13 మధ్య నిర్వహించనున్నారు. శాతవాహన యూనివర్సిటీ పరీక్ష నిర్వహణ బాధ్యతలు చేపట్టింది.
➥ ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం ఉద్దేశించిన టీఎస్ పీజీఈసెట్ పరీక్ష జూన్ 6 నుంచి 8 వరకు నిర్వహించనున్నారు. హైదరాబాద్ జేఎన్టీయూ పరీక్ష నిర్వహించనుంది.