(Source: ECI/ABP News/ABP Majha)
PEN Number: 'పది' మార్కుల మెమోలపై 'పెన్' నెంబరు - ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు
Telangana SSC Exam News: తెలంగాణలో ఈ విద్యా సంవత్సరం(2023-24) నుంచి పదోతరగతి హాల్‌టికెట్లతోపాటు మార్కుల మెమోలపై 'శాశ్వత విద్యా సంఖ్య (PEN - పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబరు)'ను ముద్రించనున్నారు.
Permanent Education No In Telangna SSC : తెలంగాణలోఈ విద్యా సంవత్సరం(2023-24) నుంచి పదోతరగతి హాల్‌టికెట్లతోపాటు మార్కుల మెమోలపై 'శాశ్వత విద్యా సంఖ్య (PEN- Permanent Education No) (పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబరు)'ను ముద్రించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి పాఠశాలల్లో చదివే ప్రీ-ప్రైమరీ విద్యార్థుల నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు ప్రవేశ రిజిస్టర్, హాజరు రిజిస్టర్, రికార్డ్ షీట్/టీసీ తదితర వాటిపై ఈ నెంబరును రాయడం, ముద్రించడం ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి తప్పనిసరి చేశారు. దీనివల్ల ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు దీని గురించి తెలుసుకొని ఉండాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది.
యూడైస్‌లో ఉన్న వారికే అవకాశం..
ప్రతి విద్యార్థి పేరు జిల్లా పాఠశాల విద్యా సమాచారం (యూడైస్ ఫ్లస్) పోర్టల్‌లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని, వివరాలను అప్‌డేట్ చేయాలని పాఠశాల విద్యాశాఖను విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆదేశించారు. యూడైస్‌లో ఉన్న వారికి మాత్రమే సాఫ్ట్‌వేర్ ద్వారా శాశ్వత సంఖ్య కేటాయిస్తారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
విద్యార్థులకు 'స్పెషల్' తరగతులు..
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పదోతరగతి వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో నవంబర్ 6 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ గంటపాటు తరగతులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటు మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, జనరల్ గురుకులాల్లోనూ ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు రోజూ ఒక సబ్జెక్టును చదివిస్తారు. రోజూ ఆ సబ్జెక్టు ఉపాధ్యాయుడే హాజరై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడంతోపాటు సమాధానాలను సాధన చేయిస్తారు. ఇందుకు సంబంధించిన టైమ్‌టేబుల్‌ను విద్యాశాఖ జారీ చేసింది.
జనవరి నుంచి వార్షిక పరీక్షల వరకు సాయంత్రం బడి వేళలు ముగిసిన తర్వాత మరో గంట ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. అయితే సీఎం అల్పాహారం పథకం అమలవుతున్న పాఠశాలల్లో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు ఆకలి సమస్య లేనప్పటికీ మిగిలిన చోట్ల ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 2.50 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారు.
ఫీజు చెల్లించడానికి నవంబరు 17 వరకు అవకాశం..
తెలంగాణలో పదోతరగతి పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూలు నవంబరు 2న విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం విద్యార్థులు నవంబర్ 17 వరకు విద్యార్థులు ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే రూ.50 ఆలస్యరుసుముతో డిసెంబరు 1 వరకు, రూ.200 ఆలస్యరుసుముతో డిసెంబరు 11 వరకు, రూ.500 ఆలస్యరుసుముతో డిసెంబరు 20 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దీనిపై దృష్టి సారించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగింపు ఉండదని ప్రకటలో స్పష్టం చేశారు. పరీక్ష ఫీజు చెల్లించే విద్యార్థుల వయసు 14 సంవత్సరాలు నిండి ఉండాలి. కుంటంబ వార్షిక ఆదాయం ఏడాదికి పట్టణాల్లో రూ.24 వేలకు మించకూడదు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.20 వేలకు మించకూడదు (లేదా) 2.5 ఎకరాల సాగు భూమి, 5 ఎకరాల బంజరు భూమి ఉన్నవారికి ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
ఫీజు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..