TS: జేఏలుగా వీఆర్‌ఏల నియామకంపై కోర్టుకెక్కిన ఆఫీస్ సబార్డినేట్‌లు, కారణం ఏంటంటే?
తెలంగాణలో వీఆర్‌ఏలను జూనియర్ అసిస్టెంట్లుగా నియమించాలన్న ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ నియామాకాలను అడ్డుకోవాలని ఆఫీస్ సబార్డినేట్‌లు హైకోర్టును ఆశ్రయించారు.
తెలంగాణలో వీఆర్‌ఏలను జూనియర్ అసిస్టెంట్లుగా నియమించాలన్న ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఆ నియామాకాలను అడ్డుకోవాలని రెవెన్యూ విభాగానికి చెందిన పలువురు ఆఫీస్ సబార్డినేట్‌లు హైకోర్టును ఆశ్రయించారు. జూనియర్ అసిస్టెంట్లుగా వీఆర్‌ఏల నియామకాన్ని ఆపాలని, దీనికి సంబంధించిన జీవో 81, 85లతో పాటు ఆగస్టు 5న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ 30 మందికి పైగా ఆఫీస్ సబార్డినేట్‌లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
రాష్ట్రంలోని వీఆర్ఏలకు పోస్టులను ఇవ్వడంపై తమకు అభ్యంతరంలేదని, అయితే తమకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో ప్రతివాదులుగా సీఎస్, ఆర్థికశాఖ, రెవెన్యూ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, సీసీఎల్ఏలతోపాటు ముఖ్యమంత్రిని, ఎన్నికల సంఘాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా సృష్టించిన పోస్టుల్లో తమకు పదోన్నతులు కల్పించకుండా వీఆర్ఏలను నియమించడం తెలంగాణ సర్వీసు నిబంధనలకు విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ALSO READ:
జేపీఎస్‌లకు గుడ్ న్యూస్, పంచాయతీ కార్యదర్శులుగా నియమిస్తూ ఉత్తర్వులు
తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శు(జేపీఎస్)లను గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం (ఆగస్టు 8) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నిర్దేశించిన అంశాల్లో 70 శాతం స్కోర్ సాధించిన జేపీఎస్‌లకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు పంచాయతీరాజ్ శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీనికి అనుగుణంగా కలెక్టర్లు తమ జిల్లాల పరిధిలో అర్హులకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని సూచించింది. 70 శాతం మార్కులు రాని వారికి మరో ఆరు నెలలు అవకాశమిచ్చి, మళ్లీ ఆరు నెలల వరకు వారి పనితీరును పరిశీలించాక నియామకాలపై నిర్ణయం తీసుకోవాలంది.
తక్కువ స్కోర్ చేసిన వారి పనితీరును 6 నెలల పాటు పరిశీలించాలని ప్రభుత్వం సూచించింది. ఇక జేపీఎస్‌ల పనితీరు, ఇతర వివరాలను యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించింది. నియామక ఉత్తర్వులను కూడా నమోదు చేయాలని పేర్కొంది. రాష్ట్రంలో 9,355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులుండగా... వారిలో 5,435 మందే నాలుగేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారికి మరో ఆరు నెలల తర్వాత నాలుగేళ్ల సర్వీసు పూర్తవుతుంది. జేపీఎస్‌ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం వారి పనితీరుపై అధ్యయనానికి జిల్లాల్లో అదనపు కలెక్టర్ల నేతృత్వంలో మదింపు కమిటీలను ఏర్పాటు చేసింది. జులై నుంచి వారు గ్రామాల్లో పర్యటించి కార్యదర్శుల పనితీరును పరిశీలిస్తున్నారు. ఈ కమిటీలు నివేదికలు ఇచ్చాక 70 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారికే పంచాయతీ కార్యదర్శులుగా అవకాశం లభిస్తుంది.
జేపీఎస్‌లలో అసంతృప్తి..
తమను గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై జేపీఎస్‌లు ఆనందపడినా... నిబంధనలను చూసి తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. నాలుగేళ్లుగా సేవలందిస్తున్న తమను నేరుగా క్రమబద్ధీకరించకుండా... జిల్లాస్థాయి మదింపు కమిటీలను ఏర్పాటు చేసి, పాఠశాల విద్యార్థుల మాదిరిగా మార్కులు వేయిస్తోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఉన్నత విద్యావంతులమైన తాము మెరిట్ ద్వారా ఉద్యోగాలు సంపాదించినట్లు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు మదింపులో 70 శాతం మార్కులు రావాలని నిబంధన పెట్టడం సరికాదంటున్నారు. మార్కులు రానివారి పనితీరును మరో ఏడాదిపాటు పరిశీలిస్తామని చెప్పడమూ అన్యాయమేనని వాపోతున్నారు. ప్రభుత్వ సేవా నిబంధనల ప్రకారం తమకు రెండేళ్ల శిక్షణ(ప్రొబేషనరీ) మాత్రమే అవసరమైనా... నాలుగేళ్లపాటు శిక్షణలోనే ఉంచిందని, ఆ కాలాన్ని పరిగణనలోనికి తీసుకోకుండానే నియామకపు ఉత్తర్వులు ఇవ్వడంతో తాము రెండేళ్ల సర్వీసును నష్టపోయినట్లేనని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉత్తర్వుల కోసం క్లిక్ చేయండి..