TMREIS: మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా!
తెలంగాణలోని మైనార్టీ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం ప్రవేశాల కోసం రాష్ట్ర మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నోటిఫికేన్ విడుదల చేసింది.
TMREIS Admission Notification: తెలంగాణలోని మైనార్టీ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం ప్రవేశాల కోసం రాష్ట్ర మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్) నోటిఫికేన్ విడుదల చేసింది. దీనిద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనార్టీ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, సీవోఈ (సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్) కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పాఠశాలల్లో 5, 6, 7, 8 తరగతులతోపాటు ఇంటర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు జనవరి 18 నుంచి ఫిబ్రవరి 6 వరకు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించవచ్చు.
రాష్ట్రంలోని 204 పాఠశాలల్లోని 5వ తరగతి ప్రవేశాలకు ముస్లిం, క్రిస్టియన్, పార్శీ, జైన్, సిక్కులతో పాటు మైనార్టీయేతర ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో 107 బాలుర పాఠశాలలు ఉండగా, 97 బాలికల పాఠశాలలు ఉన్నాయి. మైనార్టీలకు మొదట వచ్చిన వారికి మొదటి సీటు ప్రాతిపదికన, మిగతా వారికి లక్కీడ్రా ద్వారా సీట్లు కేటాయించనున్నారు. 6వ తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లకు మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కళాశాలల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఇంటర్‌తోపాటు ఐఐటీ/జేఈఈ, నీట్, ఎంసెట్, సీఏ, సీపీటీ, క్లాట్, యూపీఎస్సీ, ఎన్డీఏ, లాసెట్ తదితర ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తారు.
ఇక రాష్ట్రంలోని 194 జూనియర్ కాలేజీలు, 10 సీవోఈ కాలేజీల్లో ఇంటర్ మొదటి ఏడాదికి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. పదోతరగతి జీపీఏ ఆధారంగా జూనియర్ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. సీవోఈ కాలేజీల్లో ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నట్టు కార్యదర్శి తెలిపారు. ప్రవేశాలు కోరువారు అధికారిక వెబ్‌సైట్ లేదా గూగుల్ ప్లేస్టోర్‌లోని TMREIS మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఏమైనా సందేహాలుంటే మైనార్టీ గురుకులాల ప్రధానోపాధ్యాయులు లేదా వెబ్‌సైట్‌తో పాటు 040-23437909 హెల్ప్ లైన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.
వివరాలు..
* మైనార్టీ గురుకులాల్లో ప్రవేశాలు (2024-25 విద్యాసంవత్సరం)
1) మైనార్టీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాలు. (6వ తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లలో బ్యాక్‌లాగ్ ప్రవేశాలు)
అర్హత: 2023-24 విద్యాసంవత్సరానికిగాను 4, 5, 6, 7 తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి:
➥ 5వ తరగతిలో ప్రవేశాలకు 01.09.2012 - 31.08.2015 మధ్య జన్మించి ఉండాలి.
➥ 6వ తరగతిలో ప్రవేశాలకు 01.09.2011 - 31.08.2014 మధ్య జన్మించి ఉండాలి.
➥ 7వ తరగతిలో ప్రవేశాలకు 01.09.2010 - 31.08.2013 మధ్య జన్మించి ఉండాలి.
➥ 8వ తరగతిలో ప్రవేశాలకు 01.09.2009 - 31.08.2012 మధ్య జన్మించి ఉండాలి.
2) మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు (జనరల్ & ఒకేషనల్).
3) మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు (సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్).
అర్హత: ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలు కోరువారు 2024 పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. కనీసం 6 సీజీపీఏ ఉండాలి.
వయోపరిమితి: ఇంటర్ ప్రవేశాలకు 31-08-2024 నాటికి 18 సంవత్సరాలకు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎలాంటి ఫీజు ఉండదు.
ఎంపిక విధానం: మొదట వచ్చినవారికి మొదటగా ప్రవేశాలు కల్పిస్తారు. నాన్-మైనారిటీ అభ్యర్థులకు లక్కీడిప్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
కుటుంబ వార్షికాదాయం: గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.2 లక్షలకు మించకూడదు. దివ్యాంగులకు, ఎక్స్-సర్వీస్‌మెన్ పిల్లలకు ఎలాంటి పరిమితి లేదు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.01.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.02.2024.
➥ అభ్యర్థుల ఎంపిక, సర్టిఫికేట్ వెరిఫికేషన్:
5-8వ తరగతులకు 24.04.2024 - 30.04.2024,
ఇంటర్ విద్యార్థులకు 01.05.2024 - 10.05.2024.
➥ స్క్రీనింగ్ పరీక్ష తేది (COE ప్రవేశాలకు): 25.02.2024