HarishRao : వారంలో 28వేల పోస్టులకు నోటిఫికేషన్స్ - గ్రూప్ 4 కూడా ! తెలంగాణ నిరుద్యోగులకు ప్రిపరేషన్ టైం
వారంలో 28వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు.
HarishRao : రాబోయే వారం రోజుల్లో 28వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నట్లుగా తెలంగాణ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. రాబోయే రెండు మూడు రోజుల్లో గ్రూప్-4 నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందన్నారు. గ్రూప్ 4 ఉద్యోగాలు దాదాపుగా 9000 వరకూ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మిగతా ఉద్యోగాలు టీచర్ రిక్రూట్ మెంట్. ఇప్పటికే 50 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు. 80 వేల ఉద్యోగ ఖాళీలను నేరుగా భర్తీ చేస్తున్నట్లుగా గతంలో కేసీఆర్ ప్రకటించారు. హోం, ఎడ్యుకేషన్, హెల్త్ విభాగాల్లో దాదాపు 50 వేలకు పైగా ఖాళీలను భర్తీ చే్తున్నారు.
జోరుగా సాగుతున్న ఉద్యోగాల నియామక ప్రక్రియ
పోలీసు, టీచర్ ఉద్యోగాలకు పెద్ద ఎత్తున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాల పరీక్షల ప్రక్రియ జరుగుతోంది. పోలీసు శాఖలో 18,334 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎడ్యుకేషన్ విభాగంలో.. సెకండరీ ఎడ్యుకేషన్‌లో 13,086, హాయ్యర్ ఎడ్యుకేషన్‌లో 7,878 ఖాళీలు ఉన్నాయి. ఇందులో టీచర్ పోస్టులు ఎన్ని అనే దానిపై ఇప్పటి వరకూ కసరత్తు చేశారు. ప్రాథమిక విద్యలో 10 వేలు, ఉన్నత విద్యలో 2 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. మొత్తంగా 12 వేల వరకు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ వెలువడనుంది.
పెద్ద ఎత్తున భర్తీ కానున్న టీచర్ పోస్టులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(టీఆర్‌టీ) ద్వారా 8,792 టీచర్ పోస్టులను టీఎస్‌పీఎస్సీ భర్తీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి 2017లో నోటిఫికేషన్ వెలువడింది. అయితే అప్పట్లో మొత్తం 13,500 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపినప్పటికీ 8,792 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలు చేపట్టింది. కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసిన తర్వాత.. ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇచ్చినప్పటికీ నోటిఫికేషన్ల విడుదలలో జాప్యం జరుగుతోంది.దీనిపై ఆర్థిక మంత్రి హరీష్ రావు ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తున్నారు. ఎందుకు ఆలస్యం అవుతోందని ప్రశ్నిస్తున్నారు. అన్ని రకాల అంశాలను పరిశీలించుకుని నోటిఫికేషన్లు ఇవ్వాలని, అవసరమైతే.. సర్వీసు నిబంధనలు సహా ఇతర అంశాలకు సంబంధించిన సవరణలు చేయాలని ఆదేశించారు.
గ్రూప్ 2, 3 పోస్టులకూ ఆర్థిక శాఖ నుంచి అనుమతి
నిరుద్యోగులు ఎక్కువగా ఎదురు చూసే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చింది. వీటికి త్వరలోనే నోటిఫికేషన్లను వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు టీఎస్ పీఎస్సీ కసరత్తు మొదలు పెట్టింది. ఇక ఇతర ఉద్యోగాలతో పోల్చితే గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు అత్యధిక పోటీ ఉంటుంది. వందల సంఖ్యలో ఖాళీలకు లక్షల్లో అభ్యర్థులు పోటీ పడుతూ ఉంటారు. గ్రూప్ 2లో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు ఉంటాయి. అబ్జెక్టివ్ విధానంలో ఈ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. తెలంగాణ యువత మొత్తం ఉద్యోగాల పరీక్షల్లో బిజీగా ఉండనున్నారు.