MBBS: జీవో 72ను రద్దు చేయండి, ఎంబీబీఎస్ సీట్లపై హైకోర్టులో పిటిషన్!
ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లను ఏపీకి చెందిన స్టూడెంట్లకు ఇవ్వరాదనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లను ఏపీకి చెందిన స్టూడెంట్లకు ఇవ్వరాదనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పష్టత ఇచ్చేందుకు గడువు కావాలని హైకోర్టును ప్రభుత్వ తరఫు అదనపు ఏజీ కోరగా, విచారణను బుధవారం (జులై 12) చేపడతామని కోర్టు తెలిపింది. తెలంగాణ నిర్ణయంతో ఏపీ స్టూడెంట్లు నష్టపోతారని పేర్కొంటూ, తమ పిటిషన్ను విచారణ చేయాలని ఏపీకి చెందిన స్టూడెంట్ మంగళవారం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను కోర్టు విచారించింది. వెద్య కళాశాలల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని వంద శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ వైద్యారోగ్యశాఖ ఇచ్చిన జీవో 72ను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు.
రాష్ట్రంలో 2014 జూన్ తర్వాత ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని వంద శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ జీవో 72 జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవోను సవాలు చేస్తూ హైకోర్టులో జూన్ 11న విజయవాడకు చెందిన పి.సాయి సిరి లోచన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వ వివరణ తెలుసుకోవాల్సి ఉందని, గడువు కావాలని అదనపు ఏజీ కోరడంతో విచారణను జులై 12కి వాయిదా వేసింది.
తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో కొత్తగా పెట్టిన వైద్య కళాశాలల్లోని సీట్లలో అన్‌రిజర్వ్‌డ్ కోటాను ఎత్తివేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజనకు ముందుకు ఉన్న కళాశాలల సీట్లకు మాత్రమే అన్ రిజర్వ్‌డ్ కోటా పరిమితం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, ఆర్టికల్ 371డి నిబంధనలకు లోబడి తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ నిబంధనల్లో ప్రభుత్వం సవరణ చేసింది. ఇందుకు సంబంధించిన జీవోను వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ ఇటీవల జారీ చేశారు. దీని ప్రకారం 2014 జూన్ 2 తర్వాత రాష్ట్రంలో ఏర్పాటైన ప్రభుత్వ/ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని కాంపిటేటివ్ అథారిటీ (కన్వీనర్) కోటాలోని సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే చెందుతాయి. ఇన్నాళ్లూ ఈ కాలేజీల్లోని 85శాతం సీట్లే స్థానిక విద్యార్థులకు ఉండగా మిగిలిన 15శాతం అన్ రిజర్వ్‌డ్ కేటగిరీలో ఉండేవి. వీటికి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పోటీపడేవారు. తాజా సవరణతో కన్వీనర్ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే దక్కనున్నాయి.
ఏపీలోనూ స్థానికులకే..
రాష్ట్ర విభజన జరిగిన (2014 జూన్ 2) తర్వాత ఏపీలో ఏర్పడ్డ ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో అన్-రిజర్వుడ్(స్థానికేతర) సీట్లను ఏపీ విద్యార్థులతోనే భర్తీచేసే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఏసీఆర్, పద్మావతి, గాయత్రీ, నిమ్రా, బాలాజీ, విశ్వభారతి, అపోలో కళాశాలల్లో, ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా వచ్చిన మచిలీపట్నం, విజయనగరం, నంద్యాల, రాజమహేంద్రవరం, ఏలూరు ప్రభుత్వ బోధనాసుపత్రుల్లోని అన్ని సీట్లను రాష్ట్ర విద్యార్థులతో భర్తీచేసేలా ఉత్తర్వులు రానున్నాయి. దీనివల్ల సుమారు 200 ఎంబీబీఎస్ సీట్లు స్థానిక కోటాలో అదనంగా వస్తాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం విభజన తర్వాత ఏర్పాటైన వైద్య కళాశాలల్లోని అన్ని సీట్లను తమ రాష్ట్ర విద్యార్థులకే కేటాయిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. 2023-24 విద్యా సంవత్సరం నుంచే ఈ నిర్ణయం అమల్లోనికి వస్తుందని కూడా వెల్లడించింది. దీంతో ఏపీ విద్యార్థులు తెలంగాణలో అన్ రిజర్వుడ్ కోటాలో సీట్లు పొందే అవకాశాన్ని కోల్పోయారు.
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial