Telangana: హైకోర్టుకు చేరిన 'స్థానికత' వివాదం, మెడికల్ సీట్ల రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
KNRUHS: వరంగల్‌లోని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ మెడికల్ సీట్ల భర్తీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ గడువును పొడిగించింది. అభ్యర్థులు ఆగస్టు 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
KNRUHS MBBS, BDS Counselling Registration Extended: తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ (కాంపీటెంట్) కోటా కింద 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ తొలి విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను ఆగస్టు 3న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 4న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకాగా.. నుంచి ఆగస్టు 13తో గడువు ముగియాల్సి ఉంది. అయితే ఈ గడువును మరో రెండు రోజులు పెంచుతున్నట్లు కాళోజీ వర్సిటీ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు. నీట్ యూజీ రాష్ట్రస్థాయి ర్యాంకులకు ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 15న సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేసుకోవచ్చు.
హైకోర్టుకు చేరిన మెడికల్ సీట్ల 'స్థానిక' వివాదం..
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లకు స్థానికత వివాదం మళ్లీ హైకోర్టుకు చేరింది. నిబంధనలను సవరిస్తూ రూల్-3ఎను చేర్చిన ప్రభుత్వం.. జులై 19న జీవో నెంబరు 33ను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. మరికొందరు అత్యవసరంగా లంచ్ మోషన్‌లో విచారణ చేపట్టాలని కోరారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. గతేడాది హైకోర్టు వెలువరించిన తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం నిబంధనలను సవరిస్తూ జీవో తీసుకువచ్చిందని కోర్టుకు తెలిపారు. ప్రస్తుత నిబంధన ప్రకారం మెడికల్ సీట్ల ప్రవేశాలకు ముందు వరుసగా నాలుగేళ్లు తెలంగాణలో చదివి ఉండాలని నిబంధన తీసుకువచ్చారన్నారు. సవరణ వల్ల స్థానికులకే తీవ్ర నష్టం వాటిల్లుతుందని వాదించారు. మెడికల్, డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్ల నిమిత్తం దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 13 చివరి తేదీ అని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు.
వాదనలను విన్న ధర్మాసనం ప్రతివాదుల వాదన వినకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. ప్రతివాదులైన వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ, ఎన్‌టీఏలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను 14కు వాయిదా వేసింది. జీవో 33పై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ గడువును కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఆగస్టు 15 వరకు పొడిగించింది.
ఎంబీబీఎస్ వెబ్‌కౌన్సెలింగ్‌లకు సంబంధించి కాళోజీ వర్సిటీ విడుదల చేసిన అభ్యర్థుల మెరిట్ జాబితాలో ఎంపికైనవారు మాత్రమే వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. మెరిట్ జాబితాకు ఎంపికైన అభ్యర్థులందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తెలంగాణలోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ రాష్ట్ర స్థాయి ర్యాంకులను ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 49,143 మంది ర్యాంకులను ప్రకటించింది.
వివరాలు..
* ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలు
నీట్ యూజీ - కటాఫ్ మార్కులు: జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50 పర్సంటైల్-162 మార్కులు, ఎస్సీ-ఎస్టీ-బీసీ-పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 40 పర్సంటైల్-127 మార్కులు, ఓసీ (పీడబ్ల్యూడీ) అభ్యర్థులకు 45 పర్సంటైల్-144 మార్కులుగా నిర్ణయించారు.
వయోపరిమితి: 31.12.2024 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ (బైపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు, ఓసీ(పీడబ్ల్యూడీ) అభ్యర్థులకు సైన్స్ సబ్జెక్టులలో 45 శాతం మార్కులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు సైన్స్ సబ్జెక్టులలో 45 శాతం మార్కులు ఉండాలి. నీట్ యూజీ 2024 ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు: భ్యర్థులు రిజిస్ట్రేషన్ & ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.3500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2900 చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఫీజులకు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు అదనం. డెబిట్/క్రెడిట్, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. సీట్లు పొందిన విద్యార్థులు యూనివర్సిటీ ఫీజు కింద రూ.12,000 చెల్లించి సీటు కేటాయింపునకు సంబంధించిన 'అలాట్‌మెంట్ లెటర్' పొందాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారానే ఫీజు చెల్లించాలి. ఇక ట్యూషన్ ఫీజులను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేయనుంది.
రిజర్వేషన్లు: మొత్తం సీట్లలో కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 29 శాతం, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 శాతం సీట్లను కేటాయించారు. ఇక సమాంతర రిజర్వేషన్ల కింద మహిళలకు మొత్తం సీట్లలో 33 శాతం రిజర్వేషన్ కోటాను అమలుచేయనున్నారు.
దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్లు..
➥ నీట్ యూజీ 2024 ర్యాంకు కార్డు
➥ పుట్టిన తేదీ ధ్రవీకరణ కోసం పదోతరగతి మార్కుల మెమో
➥ ఇంటర్ మార్కుల మెమో
➥ 9, 10వ తరగతులకు సంబంధించిన స్టడీ సర్టిఫికేట్లు
➥ ఇంటర్ రెండు సంవత్సరాల స్టడీ సర్టిఫికేట్లు
➥ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (TC)
➥ తాజాగా తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ (అవసరమైన కేటగిరీలకు)
➥ మైనార్టీ సర్టిఫికేట్ (ముస్లింలకు)
➥ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ (2024-25)
➥ తల్లిదండ్రులకు సంబంధించిన ఇన్‌కమ్ సర్టిఫికేట్
➥ NCC, CAP, PMC, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్
➥ రెసిడెన్స్ సర్టిఫికేట్ - ఏ విద్యాసంస్థలో చదవనివారికి (గడచిన నాలుగేళ్ల కాలానికి సంబంధించిన)
➥ ఆధార్ కార్డు
➥ అభ్యర్థుల పాస్ పోర్ట్ సైజు ఫొటోలు
➥ అభ్యర్థుల సంతకం
సందేహాల పరిష్కారానికి హెల్ప్‌లైన్ సేవలు..
➥ వెబ్‌కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులకు ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే 9392685856, 7842542216, 9059672216 ఫోన్ నెంబర్లలో, లేదా ఈమెయిల్: tsmedadm2024@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.
➥ నిబంధలనలకు సంబంధించి ఏమైనా సందేహాలుంటే 7901098840 ఫోన్ నెంబర్లలో, లేదా ఈమెయిల్: knrugadmission@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.
➥ ఫీజు చెల్లింపు సమయంలో సమస్యలు ఎదురైతే 9618240276 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.
➥ నిర్దేశిత తేదీల్లో ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు మాత్రమే హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయి.