JNTU: బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఎంటెక్ లేకుండానే 'పీహెచ్‌డీ'లోకి!
గతంలో బీటెక్ విద్యార్థులు పీహెచ్‌డీ చేయాలంటే.. ఎంటెక్ తప్పనిసరి. ఇప్పుడా అవసరంలేదు. వర్సిటీ నిర్ణయంతో అనేక మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ వెసులుబాటు కల్పించనుంది.
పీజీ లేకున్నా పీహెచ్‌డీల్లో ప్రవేశాలకు ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో.. బీటెక్ విద్యార్థులు కూడా రిసెర్చ్ వైపు వెళ్లేలా జేఎన్టీయూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బీటెక్ నుంచే పీహెచ్‌డీలోకి ప్రవేశాలు పొందేలా అవకాశం కల్పించింది. అదికూడా ఆనర్స్ బీటెక్ డిగ్రీ పూర్తిచేసిన వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించాలని వర్సిటీ నిర్ణయించింది.
గతంలో బీటెక్ విద్యార్థులు పీహెచ్‌డీ చేయాలంటే.. ఎంటెక్ తప్పనిసరి. ఇప్పుడు వర్సిటీ నిర్ణయంతో అనేక మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ వెసులుబాటు కల్పించి, పీహెచ్‌డీ ప్రవేశాలు చేపట్టాలని నిర్ణయించింది. విద్యార్థులు 160 క్రెడిట్స్‌తో బీటెక్, మరో 18 క్రెడిట్స్‌ను పూర్తిచేస్తే ఆనర్స్ డిగ్రీని జారీ చేస్తారు. ఈ ఆనర్స్ డిగ్రీ పొందిన వారు ఎంటెక్, ఎంఫిల్ వంటి వాటితో సంబంధం లేకుండానే నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తారు.
బీటెక్ పూర్తికాగానే అత్యధికులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలవైపు వెళ్తున్నారు. రిసెర్చ్ వైపు వచ్చే వారి సంఖ్య అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పీహెచ్‌డీ చేసే వారి సంఖ్యను పెంచాలని.. వారిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ నర్సింహారెడ్డి తెలిపారు.
ప్రైవేట్ కాలేజీల్లోనూ పీహెచ్‌డీ
పీహెచ్‌డీ అడ్మిషన్ల కోసం వర్సిటీపై పడుతున్న ఒత్తిడిని తగ్గించడంలో భాగంగా వర్సిటీ అధికారులు మరో నిర్ణయం తీసుకున్నారు. అటానమస్, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లోనూ పీహెచ్‌డీ చేసే అవకాశాన్నిస్తున్నారు. సంబంధిత కాలేజీలో రిసెర్చ్ సెంటర్ ఏర్పాటై ఉండాలి. ఆయా కాలేజీలోనే ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసి, రాత పరీక్ష నిర్వహిస్తారు. సెలెక్షన్ కమిటీలో జేఎన్టీయూ విషయ నిపుణులు, ప్రొఫెసర్లుంటారు. విద్యార్థి ప్రొఫెసర్ పర్యవేక్షణలో పరిశోధన చేయాలి. వైవా, థీసిస్‌ను సమర్పిస్తే అంతా సవ్యంగా ఉంటే పీహెచ్‌డీ పట్టా జారీ చేస్తారు. ఒక్కో ప్రొఫెసర్ 8 మంది విద్యార్థులకు మాత్రమే గైడ్‌గా ఉండాలని జేఎన్టీయూ నిర్ణయించింది.
రెండేళ్ల క్రితమే ఆనర్స్..
బీటెక్‌లో ఆనర్స్, మైనర్ డిగ్రీల పేరుతో ఒకేసారి రెండు డిగ్రీలు పూర్తిచేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ రెండేళ్ల క్రితం జేఎన్టీయూ-హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సీటు వచ్చిన బ్రాంచిలో మేజర్ డిగ్రీతోపాటు నచ్చిన మరో కోర్సులో మైనర్ డిగ్రీని చదివే అవకాశం కల్పించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే యూనివర్సిటీ పరిధిలో డ్యూయల్ డిగ్రీ విధానాన్ని అమలుచేయనున్నట్లు ప్రకటించింది. ప్రధాన డిగ్రీని బీటెక్ ఆనర్స్‌గా, అదనపు డిగ్రీని మైనర్ డిగ్రీగా ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఐఐటీలలో అమల్లో ఉన్న ఈ డ్యూయల్ డిగ్రీ విధానాన్ని అధ్యయనం చేసిన జేఎన్టీయూ అధికారులు.. వర్సిటీ పరిధిలో అనుమతిచ్చారు. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సైతం గతంలో డ్యూయల్ డిగ్రీ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనిద్వారా విద్యార్థులు కొన్నింటిపై సమగ్ర పరిజ్ఞానం, మరికొన్నింటిపై కొంత మేర విషయ పరిజ్ఞానం నేర్చుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ విధానంలో విద్యార్థి తాను చదువుతున్న బ్రాంచియే కాకుండా మరో డిపార్ట్‌మెంట్‌లోని నచ్చిన కోర్సులో చేరవచ్చు. ఇలా ఆనర్స్ డిగ్రీకి తోడుగా 18- 20 క్రెడిట్లను మైనర్ డిగ్రీ ద్వారా పొందవచ్చు.
డ్యూయల్ డిగ్రీ విధివిధానాలు జారీ..
ఇంజినీరింగ్ కళాశాలల్లో డ్యూయల్ డిగ్రీ కోర్సులకు జేఎన్‌టీయూ(JNTU) అనుమతి ఇచ్చింది. ఈ మేరకు విధివిధానాలను యూనివర్సిటీ జారీ చేసింది. 2022-23 విద్యాసంవత్సరం నుంచి నిర్వహించాలని నిర్ణయించింది. దీనిప్రకారం ఒక్కో కాలేజీకి 60 సీట్లు కేటాయించింది. అయితే కనీసం 30 శాతం మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకొని ఉంటేనే కళాశాలకు అనుమతి లభిస్తుంది. ఇంజినీరింగ్ 2,3,4 ఏడాది చదువుతున్న విద్యార్థులు మాత్రమే రిజిస్టర్ చేసుకోవడానికి అర్హులు. వీరందరూ బీటెక్‌తోపాటే బీబీఏ(డేటా అనలిటిక్స్) కోర్సు కూడా చదువుకోవచ్చు. వారంలో రెండురోజులు అంటే శని, ఆదివారాల్లో ప్రత్యక్ష బోధన, మిగతా రోజుల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
Also Read:
జేఈఈ మెయిన్స్ సెషన్-2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్స్ సెషన్-2 పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 15న ప్రారంభమైంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 7న ప్రారంభం కావాల్సిన దరఖాస్తు ప్రక్రియ.. వారం రోజుల ఆలస్యంగా ఫిబ్రవరి 15 నుంచి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కొత్త అభ్యర్దులతోపాటు మొదటి సెషన్ రాసిన అభ్యర్ధుులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..