ISRO Online Courses: 'ఇస్రో'లో ఏఐ, మెషిన్ లెర్నింగ్, పైథాన్ ఆన్‌లైన్ కోర్సులు - సర్టిఫికేట్ పొందే ఛాన్స్
IIRS: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఆధ్వర్యంలో ఏఐ, ఎంఎల్, డీప్ లెర్నింగ్, తదితర కోర్సుల్లో ఉచిత ఆన్‌లైన్ తరగతులకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆగస్టు 19 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు.
ISRO AI, ML free Course with certificate: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), మెషిన్ లెర్నింగ్ (ML) అంశాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఆగస్టు 19 నుంచి 23 వరకు ఐదు రోజుల ఉచిత ఆన్‌లైన్ కోర్సును నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఐదురోజులపాటు సాగే శిక్షణలో కనీసం 70 శాతం హాజరు ఉన్నవారికి కోర్సు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అందజేస్తారు. విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇస్రో ఈ కార్యక్రమానికి 2007లో శ్రీకారం చుట్టింది. ప్రారంభంలో కేవలం 12 యూనివర్సిటీలు, విద్యాసంస్థలు మాత్రమే ఈ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 3500కి చేరింది.
ఎవరు అర్హులు..?
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (IIRS) ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో భాగంగా అంతరిక్ష రంగంలో ఆవిష్కరణలను పెంచడమే లక్ష్యంగా ఈ కోర్సులు నిర్వహించనున్నారు. ఏఐ, ఎంఎల్, డీప్ లెర్నింగ్, డేటా ప్రాసెసింగ్ టెక్నిక్‌లతోపాటు జియోస్పేషియల్ డేటా ప్రాసెసింగ్‌కి సంబంధించిన అంశాలపై లోతైన అవగాహన కల్పించనున్నారు. ఆయా కోర్సులకు సంబంధించిన అప్లికేషన్‌లలో సాంకేతికతను ఉపయోగించడానికి ఇష్టపడే నిపుణులు, విద్యార్థులు, పరిశోధకులకు ఈ కోర్సు ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, డేటా అనలిటిక్స్, జియో-ఇన్‌ఫర్మాటిక్స్, జియోమెటిక్స్ రంగాలపై ఆసక్తి ఉన్న వారికి ఉద్దేశించినది. ఈ కోర్సులు పూర్తిగా ఉచితం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఉచిత శిక్షణలో భాగంగా ఏఐ, ఎంఎల్, డీప్ లెర్నింగ్ అంశాలకు సంబంధించిన పరిచయం, CNN, RNN, R-CNN, ఫాస్టర్ RCNN, SSD, YOLO అంశాల్లో లోతైన అభ్యాస భావనలను, వాటి అనువర్తనాలు, స్పేస్‌బోర్న్ లిడార్ సిస్టమ్స్, Google Earth ఇంజిన్ మరియు పైథాన్ ద్వారా మెషిన్ లెర్నింగ్ వంటివి ఉంటాయి. విద్యార్థులకు ఇచ్చే స్టడీ మెటీరియల్‌లో లెక్చర్ స్లైడ్‌లు, లెక్చర్‌ల వీడియో రికార్డింగ్‌లు, ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ మరియు డెమోన్‌స్ట్రేషన్ హ్యాండ్‌అవుట్‌లు కూడా IRS-ISRO యొక్క ఇ-క్లాస్ ప్లాట్‌ఫారమ్ ద్వారా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా, వీడియో లెక్చర్‌లు కూడా ఇ-క్లాస్‌కి అప్‌లోడ్ చేసి ఉండటంతో మనం ఎప్పుడైనా వాటిని చూసుకోవచ్చు.
ఆన్‌లైన్ కోర్సుల వివరాలు..
తేదీ | అంశం | స్పీకర్ | సమయం |
ఆగస్టు 19 | ఏఐ, ఎంఎల్, డీప్ లెర్నింగ్ ఇంట్రడక్షన్ | డాక్టర్ పూనం సేత్ తివారి | సా. 4 గంటల - 5.30 గం. వరకు |
ఆగస్టు 20 | మెథడ్స్ ఇన్ మెషిన్ లెర్నింగ్: సూపర్‌వైస్డ్, అన్-సూపర్‌వైస్డ్, రీన్‌ఫోర్స్‌మెంట్ | డాక్టర్ హీనా పాండే | సా. 4 గంటల - 5.30 గం. వరకు |
ఆగస్టు 21 | డీప్ లెర్నింగ్ కాన్సెప్టులు: CNN, RNN, R-CNN, ఫాస్టర్ RCNN, SSD, YOLO మొదలైనవి, వాటి అనువర్తనాలు(అప్లికేషన్స్). | డాక్టర్ పూనం సేత్ తివారి | సా. 4 గంటల - 5.30 గం. వరకు |
ఆగస్టు 22 | గూగుల్ ఎర్త్ ఇంజిన్ ద్వారా మెషిన్ లెర్నింగ్ | డాక్టర్ పూనం సేత్ తివారి | సా. 4 గంటల - 5.30 గం. వరకు |
ఆగస్టు 23 | పైతాన్ ఫర్ మెషిన్/డీప్ లెర్నింగ్ మోడల్స్ | రవి భండారి | సా. 4 గంటల - 5.30 గం. వరకు |