JEE Advanced 2023: జేఈఈ అడ్వాన్స్‌డ్-2023 ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
ఐఐటీలు సహా ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు ఆదివారం(జూన్ 18న) విడుదలయ్యాయి. ఉదయం 10 గంటలకు ఫలితాలను ఐఐటీ గువాహటి విడుదల చేసింది.
ఐఐటీలు సహా ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు ఆదివారం(జూన్ 18న) విడుదలయ్యాయి. ఉదయం 10 గంటలకు ఫలితాలను ఐఐటీ గువాహటి విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ రోల్ నెంబరు, పుట్టినతేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలతోపాటు ఫైనల్ కీలను కూడా విడుదల చేశారు. వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
జూన్ 4న రెండు సెషన్లల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 1,80,226 మంది హాజరయ్యారు. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల కాగా, జూన్ 18న ఫైనల్ కీతోపాటు ఫలితాలను ప్రకటించింది. ఈ ఏడాది 43 వేలకు పైగా విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో అర్హత సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 30 వేల మంది రాశారు. పరీక్షలో కటాఫ్ మార్కులు నిర్ణయించి సుమారు 45 వేల మందిని జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) కౌన్సెలింగ్‌కు అర్హత కల్పిస్తారు. విద్యార్థులు జూన్ 19 నుంచి మొదలయ్యే జోసా కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గతేడాది 23 ఐఐటీల్లో మొత్తం 16,598 సీట్లు అందుబాటులో ఉండగా.. ఈసారి మరికొన్ని పెరిగే అవకాశం ఉంది.
ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..
బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) రిజిస్ట్రేషన ప్రక్రియ ప్రారంభమైంది. వారణాసి, ఖరగ్‌పూర్, రూర్కీల్లోని ఐఐటీల్లో బీఆర్క్ (ఆర్కిటెక్చర్)కోర్సులను నిర్వహిస్తున్నారు. జూన్ 18,19 తేదీల్లో జేఈఈ అడ్వాన్స్‌డ్ వెబ్‌సైట్ ద్వారా ఏఏటీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 21న ఏఏటీ పరీక్ష నిర్వహించి, జూన్ 24న ఫలితాలను ప్రకటించనున్నారు.