Medical Seats: తెలంగాణలో భారీగా పెరిగిన మెడికల్ సీట్లు, దేశంలో ఆరో స్థానం!
ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను కొత్తగా నెలకొల్పడం, మెడికల్ సీట్ల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించడంతో అత్యధిక ఎంబీబీఎస్ సీట్లున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది.
తెలంగాణ ప్రభుత్వం వైద్య విద్యకు ప్రాధాన్యమివ్వడంతో గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను కొత్తగా నెలకొల్పడం, మెడికల్ సీట్ల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించడంతో అత్యధిక ఎంబీబీఎస్ సీట్లున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. సీట్ల సంఖ్య 6,040 కి చేరింది. తెలంగాణకు ముందు తమిళనాడు (10,825), కర్ణాటక (10,745), మహారాష్ట్ర (9,995), ఉత్తర్ ప్రదేశ్ (9,053), గుజరాత్ (6,200) రాష్ట్రాలు మొదటి అయిదు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5,485 ఎంబీబీఎస్ సీట్లతో ఏడో స్థానంలో నిలిచింది.
ఇక అతి తక్కువ వైద్యసీట్లున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో త్రిపుర (225), గోవా(180), చండీగఢ్ (150), సిక్కిం (150), దాద్రా నగర్ హవేలీ (150), అండమాన్ నికోబార్ దీవులు (100), మిజోరం (100), మేఘాలయ (50), అరుణాచల్ ప్రదేశ్(50) ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సీట్ల వివరాలతో కూడిన నివేదికను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తాజాగా విడుదల చేసింది.
ఆ విభాగంలో ఢిల్లీదే అగ్రస్థానం..
సూపర్ స్పెషాలిటీ సీట్ల జాబితాలో ముందు వరుసలో ఢిల్లీ(703), తమిళనాడు (671), ఉత్తరాఖండ్(581), కర్ణాటక (461), మహారాష్ట్ర (380) తొలి అయిదు స్థానాల్లో నిలిచాయి. ఇక పీజీ స్పెషాలిటీ సీట్లలో తొలి అయిదు స్థానాల్లో కర్ణాటక (5,523), మహారాష్ట్ర (5,297), తమిళనాడు (4,159), ఉత్తర్ ప్రదేశ్ (3,509), ఆంధ్రప్రదేశ్ (2,650) రాష్ట్రాలున్నాయి. ఇక తెలంగాణ విషయానికొస్తే.. పీజీ స్పెషాలిటీ సీట్ల విభాగంలో 2,477 సీట్లతో తెలంగాణ ఏడో స్థానంలో, 175 సూపర్ స్పెషాలిటీ సీట్లతో పదో స్థానంలో నిలిచింది.
దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి.. ఎక్కువ వైద్య కళాశాలలున్న రాష్ట్రాల జాబితాలో తమిళనాడు (71) ముందుండగా.. తర్వాత స్థానాల్లో వరుసగా కర్ణాటక (67), ఉత్తర్‌ప్రదేశ్(67), మహారాష్ట్ర (63), తెలంగాణ (41), గుజరాత్(36) రాష్ట్రాలు నిలిచాయి.
అప్పుడు 5.. ఇప్పుడు 17.. రెండేళ్లలో 34కు..
తెలంగాణ ఏర్పడకముందు ప్రభుత్వ వైద్య కళాశాలలు అయిదు మాత్రమే ఉండేవి. రాష్ట్రం ఆవిర్భవించాక.. తొలి దశలో 4 కళాశాలలు, రెండో దశలో ఈ ఏడాది (2022-23) నుంచి మరో 8 కళాశాలలను ప్రారంభించారు. వీటి ద్వారా 1,150 ఎంబీబీఎస్ సీట్లు విద్యార్థులకు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. దీంతో గత ఎనిమిదేళ్లలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 17కు పెరిగింది. వచ్చే ఏడాది మరో 9, ఆ పై ఏడాది మరో 8 వైద్య కళాశాలలను నెలకొల్పాలని ప్రభుత్వం సంకల్పించడంతో వాటి సంఖ్య 34కు పెరగనుందని వైద్యవర్గాలు తెలిపాయి. తద్వారా ఎంబీబీఎస్ సీట్లు కూడా పెరగనున్నాయి. వీటిల్లో రానున్న రోజుల్లో పీజీ వైద్య సీట్లు కూడా అందుబాటలులోకి రానున్నాయి.
Also Read:
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ప్రవేశాలు, కోర్సుల వివరాలు ఇలా!
టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) వివిధ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. టిస్ సంస్థ ముంబయి, హైదరాబాద్, తుల్జాపూర్, గువాహటి క్యాంపస్‌లలో మొత్తం 60 కోర్సులను అందిస్తోంది. వీటిలో 57 పీజీ, 3 పీజీ డిప్లొమా కోర్సులు ఉన్నాయి. టిస్ ముంబయి క్యాంపస్‌లో 38, హైదరాబాద్‌లో 10, తుల్జాపూర్‌లో 4, గువాహటిలో 8 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 2023 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సులు!
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని డా.వైఎస్సాఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ 2022-23 విద్యా సంవత్సరానికి పలు విభాగాల్లో ఎంఎస్సీ, పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. డిసెంబరు 28, 29 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..
వైఎస్సార్ హెల్త్ వర్సిటీలో ఎంపీటీ కోర్సు, వివరాలు ఇలా!
విజయవాడలోని డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనుబంధ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఎంపీటీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అకడమిక్ మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజు కింద రూ.5,900 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.4,956 చెల్లిస్తే సరిపోతుంది.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..