France Student Visa: ప్రాన్స్ లో చదవాలనుకునే వాళ్లకు గుడ్ న్యూస్ - 30 వేల మంది విద్యార్థులకు ఆహ్వానం
France Student Visa: ఫ్రాన్స్ లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2030 నాటికి 30 వేల మంది విద్యార్థులను ఆహ్వానించనున్నట్లు ప్రకటించింది.
France Student Visa: భారతదేశం నుంచి అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రతీ ఏటా వేలాది మంది విద్యార్థులు అనేక దేశాలకు వెళ్తుంటారు. అమెరికా, జపాన్, ఫ్రాన్స్, చైనా, ఆస్ట్రేలియా.. ఇలా ఆయా దేశాలకు వెళ్తుంటారు. అయితే ఈ ఏడాద ఫ్రాన్స్ కు వెళ్లి చదవాలి అనుకునే విద్యార్థులకు ఆ దేశ సర్కారు శుభవార్త చెప్పింది. 2030 నాటికి మన దేశం నుంచి దాదాపు 30 వేల మంది విద్యార్థులను తమ దేశానికి ఆహ్వానించేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌లో పర్యటించగా.. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం పెంపొందించుకునే దిశగా అనేక చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ 30 వేల మంది భారతీయ విద్యార్థులను తమ దేశానికి ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు. అయితే అధ్యక్షుడి ఆదేశాలతో ఆ దేశ రాయబార కార్యాలయం కార్యాచరణ కూడా ప్రారంభించింది.
ఐదేళ్ల పరిమితితో కూడిన షెంజన్ వీసాలు
ఎక్కువ మంది విద్యార్థులను ఆకర్షించడానికి ఐదేళ్ల కాల పరిమితితో కూడిన షెంజెన్ వీసాలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. అలాగే భారతీయ విద్యార్థుల కోసం ఫ్రాన్స్ ‘ఇంటర్నేషనల్ క్లాసెస్’ పేరిట ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహించబోతున్నట్లు తెలిపింది. ఇండియన్ విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా ఫ్రెంచ్ భాష, ఇతర విద్యా విభాగాల్లో సమగ్ర శిక్షణ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. పారిస్‌లో మేక్రాన్, మోదీ కలిసి తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి తమ బృందాలు రెట్టింపు కృషి చేస్తున్నాయని ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ తెలిపారు. భారతీయ విద్యార్థులతో తమ సుసంపన్న సాంస్కృతిక వారసత్వం, ప్రపంచ స్థాయి విద్యావకాశాలను పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని వెల్లడించారు. ఫ్రాన్స్ ఎల్లప్పుడూ భారత దేశానికి స్నేహితుడిలా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అద్భుతమైన విద్యా జీవితాన్ని అందించేందుకు కావాల్సినంత సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
అక్టోబర్ లో ఎడ్యుకేషన్ ఫెయిర్
అక్టోబరు నెలలో ఫ్రెంచ్ రాయబార కార్యాలయం చెన్నై, కోల్‌కతా, దిల్లీ, ముంబయి నగరాల్లో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించబోతోంది. అయితే 40కి పైగా ఫ్రెంచ్ ఉన్నత విద్యా సంస్థల ప్రతినిధులు ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ కు హాజరు కాబోతున్నారు. విద్యార్థులు సరైన కోర్సు ఎంచుకోవడానికి, తల్లిదండ్రుల అనుమానాలను నివృత్తి చేయడానికి వీరు కావల్సిన తోడ్పాటును అందిస్తారని ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ప్రకటించింది.