TS MBBS Seats: ఎంబీబీఎస్ బి-కేటగిరీలో స్థానికులకే ప్రాధాన్యం - 8,78,280 ర్యాంకు వచ్చినా ఎంబీబీఎస్ సీటు!
ఈసారి 8,78,280 ర్యాంకు వచ్చిన తెలంగాణ స్థానిక విద్యార్థికి కూడా బి-కేటగిరీ సీటు వచ్చింది. ఎంబీబీఎస్ సీట్లు, ప్రవేశాలపై వైద్య ఆరోగ్యశాఖ డిసెంబరు 28న విడుదల చేసిన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలతో వైద్యవిద్య అభ్యసించాలనుకునే విద్యార్థుల కల నెరవేరుతోంది. మరోవైపు స్థానిక రిజర్వేషన్, గిరిజన విద్యార్థుల రిజర్వేషన్ శాతం పెంపు వంటి పరిణామాలు కూడా ఎంబీబీఎస్ బి-కేటగిరీ సీట్ల సంఖ్య పెరిగేందుకు ఉపకరిస్తున్నాయి. రాష్ట్రంలో 2021-22 వైద్యవిద్యా సంవత్సరంలో మైనారిటీ వైద్య కళాశాలలు కలుపుకొని బి-కేటగిరీలో 1214 సీట్లు ఉండేవి. వీటికి రిజర్వేషన్ విధానం లేకపోవడం వల్ల తెలంగాణ విద్యార్థులకు 495 సీట్లు మాత్రమే దక్కాయి. ఆ ఏడాది గరిష్ఠంగా 2,71,272 ర్యాంకు వచ్చిన స్థానిక విద్యార్థికి ఎంబీబీఎస్ సీటు లభించింది. మిగతా 719 సీట్లలో నాన్ లోకల్ కింద ఇతర రాష్ట్రాల విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ నివేదిక విడుదల చేసింది.
రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్యంతో పాటు, వైద్యవిద్యను పటిష్ఠం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తున్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో మారుమూల జిల్లాల్లోని ప్రజలకు సైతం స్పెషాలిటీ వైద్యం చేరువవుతోందని కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, బి-కేటగిరీలో స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్ కల్పించడం, ఎస్టీ రిజర్వేషన్ 6 నుంచి 10 శాతానికి పెంచడం వంటి విప్లవాత్మకమైన చర్యలను ముఖ్యమంత్రి చేపట్టడం వల్ల ఎంబీబీఎస్ చదవాలనే తెలంగాణ విద్యార్థుల కల సాకారమవుతోందన్నారు. చైనా, ఉక్రెయిన్, రష్యా, ఫిలిప్పైన్స్ వంటి దేశాలకు వెళ్లి, వ్యయప్రయాసలకు గురై.. ఎంబీబీఎస్ చదవాల్సిన అగత్యం తప్పిందని, తల్లిదండ్రులకు ఆర్థికభారం నుంచి ఉపశమనం లభిస్తోందని మంత్రి అన్నారు.
Also Read: తెలంగాణలో భారీగా పెరిగిన మెడికల్ సీట్లు, దేశంలో ఆరో స్థానం!
8,78,280 ర్యాంకు వచ్చినా ఎంబీబీఎస్ సీటు..
తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన ప్రభుత్వం 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి బి-కేటగిరీ సీట్లలో 85 శాతం స్థానిక విద్యార్థులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తూ జీవోను విడుదల చేసింది. దీంతో 2022-23 విద్యాసంవత్సరంలో రాష్ట్ర విద్యార్థులకు 1071 సీట్లు లభించాయి. దీంతో ఈసారి 8,78,280 ర్యాంకు వచ్చిన తెలంగాణ స్థానిక విద్యార్థికి కూడా బి-కేటగిరీ సీటు వచ్చింది. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు, ప్రవేశాలపై వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసిన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.
వైద్యసీట్లలో అగ్రస్థానం..
రాష్ట్రంలో ప్రతి లక్ష మంది జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లుండగా, దేశంలో మిగతా ఏ రాష్ట్రంలో ఇన్ని సీట్లు లేకపోవడం గమనార్హం. జనాభా నిష్పత్తి ప్రాతిపదికన ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలు తర్వాత స్థానాల్లో నిలిచాయి. పీజీ సీట్లలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో మొత్తం 6690 ఎంబీబీఎస్, 2544 పీజీ సీట్లున్నాయి. అఖిలభారత కోటా సీట్లు పోను.. రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్లు 2021-22లో 3038 ఉండగా, ఈ ఏడాది 4094కు పెరిగాయి. దీంతో అన్ని కేటగిరీల్లో కటాఫ్ తగ్గి, ఎక్కువ మందికి అవకాశం లభించింది. ఎస్టీ రిజర్వేషన్ కోటాను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచడంతో మరింత మందికి వైద్యవిద్య చేరువవుతోంది. గత ఏడాది ఎస్టీ కోటాలో 223 సీట్లు ఉండగా, ఈ ఏడాది అవి 429కి పెరిగాయి. ఈ కేటగిరీలో గత ఏడాది 1,46,391 ర్యాంకు వచ్చిన విద్యార్థికి సీటు రాగా, ఈసారి 2,09,646 ర్యాంకు వచ్చిన విద్యార్థికి కూడా ప్రవేశం లభించింది.
అమ్మాయిలదే హవా..!
ఇక ఎంబీబీఎస్ సి-కేటగిరీలో గతేడాది 556 సీట్లుండగా; 9,23,789 ర్యాంకు వచ్చిన విద్యార్థికి కూడా ఎంబీబీఎస్ సీటు వచ్చింది. ఈ ఏడాది 578 సీట్లు ఉండగా, గరిష్ఠంగా 10,55,181 ర్యాంకు వచ్చిన అభ్యర్థికి సైతం సీటు లభించడం విశేషం. ఎంబీబీఎస్ ప్రవేశాలకు సంబంధించి అమ్మాయిలే ముందువరుసలో నిలుస్తున్నారు. 2021-22లో కన్వీనర్ కోటాలో 63.36 శాతం, యాజమాన్య కోటాలో 55.76 శాతం.. మొత్తంగా 5095 సీట్లలో 60.79 శాతం మంది మహిళలు సీట్లు పొందగా.. ఈ ఏడాది కన్వీనర్ కోటాలో 62.68 శాతం, యాజమాన్య కోటాలో 63.73 శాతం.. మొత్తంగా 6,186 సీట్లతో 62.98 శాతం సీట్లు పొందారు.