RTC ITI: టిఎస్‌ఆర్టీసీ ఐటిఐ కాలేజీకి డీజీటీ అనుమతులు మంజూరు, ప్రవేశాలు షురూ
హకీంపేటలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఐటీఐ కొత్త కళాశాలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ తాజాగా అనుమతి ఇచ్చింది. దీంతో.. ఈ విద్యా సంవత్సరం నుంచే కళాశాలను ప్రారంభించాలని ఆర్టీసీ నిర్ణయించింది.
తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు శుభవార్త తెలిపింది. హైదరాబాద్ శివారు హకీంపేటలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఐటీఐ కొత్త కళాశాలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ తాజాగా అనుమతి ఇచ్చింది. దీంతో.. ఈ విద్యా సంవత్సరం నుంచే కళాశాలను ప్రారంభించాలని ఆర్టీసీ నిర్ణయించింది. 10వ తరగతి విద్యార్హతతో మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డీజిల్ ట్రేడ్లలో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత, ఆసక్తిగల విద్యార్థులు అక్టోబర్ 8లోగా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు ప్రవేశాల కోసం అక్టోబరు 9న వాక్‌ఇన్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అధికారికంగా ప్రకటించారు. తక్కువ వ్యవధిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో వరంగల్, హకీంపేటలో ఐటీఐ కళాశాలలను టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
గత విద్యా సంవత్సరం నుంచే వరంగల్ ఐటీఐని సంస్థ ప్రారంభించిందన్నారు. తాజాగా హాకీంపేట ఐటీఐ కళాశాలకు 'డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్' అనుమతి ఇచ్చిందని, ఈ ఏడాది నుంచి మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డీజిల్ ట్రేడ్ లలో ప్రవేశాలు జరుగుతున్నాయని సజ్జనార్ వెల్లడించారు. నిపుణులైన అధ్యాపకులతోపాటు అపార అనుభవంగల ఆర్టీసీ అధికారుల ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తారని, ప్రవేశాలు పొందిన విద్యార్థులకు వారు కోరుకున్న టీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిస్‌షిప్ సౌకర్యాన్ని కల్పిస్తామని సజ్జనార్ పేర్కొన్నారు.
నిరుద్యోగ యువతకు చక్కటి శిక్షణ, బంగారు భవిష్యత్‌ను అందించాలనే ఉద్దేశంతో ఈ కళాశాలను ఏర్పాటు చేశామన్నారు. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు పూర్తి సమాచారం కోసం 9100664452 ఫోన్ నంబర్‌ని సంప్రదించాలని సూచించారు. విద్యార్థులు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
ALSO READ:
వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు 'స్పాట్' కౌన్సెలింగ్, ఎప్పుడంటే?
గుంటూరులోని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో 2023-24 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి అక్టోబర్ 11న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈమేరకు వర్సిటీ రిజిస్ట్రార్ జి.రామారావు అక్టోబరు 6న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయనున్నారు. గుంటూరులోని లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం లాంఫాం పాలిటెక్నిక్ విభాగంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
కౌన్సెలింగ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
CPGET: సీపీగెట్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభం, పూర్తి షెడ్యూలు ఇలా
తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర పీజీ కోర్సుల్లో సీట్ల భర్తీకి సంబంధించి 'కామన్ పీజీ ప్రవేశ పరీక్ష(సీపీగెట్)-2023' రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబరు 6న ప్రారంభమైంది. సీపీగెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించినవారు, మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీటు పొందనివారు రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజుగా అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..