UPSC Topper: కోహ్లీ యాటిట్యూడ్ ఉపయోగపడింది - సివిల్స్ టాపర్ అనన్య రెడ్డి విన్నింగ్ సీక్రెట్
Civils Results: ఛాంపియన్ యాటిట్యూడ్ లేకుంటే విజయాలు అంత ఈజీగా సిద్ధించవు. ఈ యాటిట్యూట్ అంటే ముందుగా కొహ్లీ గుర్తుకు వస్తాడు. అదే స్ఫూర్తితో సివిల్స్‌లో ర్యాంక్ సాధించిందో తెలుగు తేజం
UPSC Civils Final Results: ప్రపంచంలోనే అత్యంత టఫెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ యూపీఎస్సీ. అలాంటి పరీక్షలో టాపర్‌గా నిలిచి ఉద్యోగం సాధించాలంటే... తెలివి ఒక్కటి ఉంటే సరిపోదు. అంతకు మించిన ఛాంపియన్ యాటిట్యూడ్ ఉండాలి. ప్రతి క్షణం అదే జీవితంగా బతకాలి. తపస్సు చేయాలి. అలాంటి తప్పు చేసిన దోనూరు అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ సాధించారు.
పుట్టింది పెరిగింది మారుమూల గ్రామం
మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన అనన్య రెడ్డి లోక్ స్కూల్‌లోనే పదో తరగతి వరకు చదివారు. అప్పుడే తనకంటూ ఓ లక్ష్యాన్ని సెట్ చేసుకున్నారు. ఆ లక్ష్యం దిశగానే హైదరాబాద్‌లో ఇంటర్, ఢిల్లీలో డిగ్రీ పూర్తి చేశారు.
ఇంటర్ నుంచి పుస్తకాలతో కుస్తీ
గమ్యం తెలిసిన వాడి ప్రయాణం క్లియర్‌గా ఉంటుంది. అదే అనన్య రెడ్డి విషయంలో జరిగింది. సివిల్స్ కొట్టాలని టార్గెట్ ఫిక్స్ చేసుకున్న ఆమె దీక్ష పూనారు. రోజుకు 12 గంటల నుంచి 14 గంటలు పుస్తకాలతో కుస్తీ పట్టారు. మన టార్గెట్ ఏంటో క్లియర్‌గా ఉండటంతోపాటు లోపాలు కూడా తెలిసి ఉండాలంటారు అనన్యం. వాటిని అధిగమించేందుకు ఏం చేయాలనేది తెలిస్తే ఎంతటి పెద్ద లక్ష్యమైనా చిన్నగా అయిపోతుందని అంటారు.
కొహ్లీ స్ఫూర్తితో వేట
ఊహ తెలిసినప్పటి నుంచి విరాట్ కొహ్లీ ఆట తీరు అంటే అనన్యకు చాలా ఇష్టం. తన గమ్యానికి చేరడానికి ఆ యాటిట్యూడ్ అవసరమని గ్రహించారు. విజయం సాధించడానికి కోహ్లీ పెట్టే ఎఫర్ట్ ఆమెకు చాలా నచ్చుతుంది. పోరాడే తత్వం... ప్రిపరేషన్ ఇలా కొహ్లీలో ఉన్న ప్రతి లక్షణాన్ని తనలోకి నింపుకున్నారు. చివరకు తనే కొహ్లీలా మారిపోయారు.
కోచింగ్ తీసుకోకుండానే ర్యాంక్
ప్రిపరేషన్ పూర్తిగా విభిన్నంగా సాగిందని చెబుతారు అనన్య. ఎక్కడా కోచింగ్ తీసుకునే ఉద్దేశం లేకపోవడం ఒక్క ఎత్తుతై... విరివిగా లభించే సమాచారాన్ని ఫిల్టర్ చేసుకోవడం మరో ఎత్తుగా భావించారు. ముందుగా ఎగ్జామ్ సోల్‌ను గుర్తించారు. 2022 వరకు ఉన్న ఎగ్జామ్ పేపర్స్ పరిశీలించారు. ఎగ్జామ్ మైండ్ సెట్‌ను గమనించారు. ఆ దిశగానే ప్రిపేర్ అయ్యారు. ఈ క్రమంలో తనలో ఉన్న లోపాలు సవరించుకున్నారు.
స్మార్ట్‌గా ప్లానింగ్
స్మార్ట్‌గా ప్లాన్ చేయాలి... కూల్‌గా చదవాలి... అనేది అనన్య ప్లానింగ్. అదే స్టైల్‌ను ఆఖరి అంకం వరకు చదివి టాపర్‌గా నిలిచారు. పరీక్షల ఒత్తిడి పడకుండా ఉండేందుకు క్రికెట్ మ్యాచ్‌లు ఉంటే వదలకుండా చూసేవాళ్లు. క్రికెట్ మ్యాచ్‌లు లేనప్పుడు నవలలు చదివేవాళ్లు.