AICTE: ఇంజినీరింగ్ కాలేజీల్లో బీబీఏ, బీసీఏ కోర్సులు, ఏఐసీటీఈ అనుమతులు తప్పనిసరి
ఇంజినీరింగ్ కాలేజీల్లో బీబీఏ, బీసీఏ కోర్సులు అందించాలనుకుంటున్న కళాశాలలు తప్పనిసరిగా ఏఐసీటీఈ అనుమతికి దరఖాస్తు చేసుకోవాలని ఏఐసీటీఈ వైస్ ఛైర్మన్ అభయ్ జెరే స్పష్టం చేశారు.
BBA, BCA Courses in Engineering Colleges: వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో రెగ్యులర్ కోర్సులతో పాటు బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ ఆడ్మినిస్ట్రేషన్(BBA), బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(BCA) కోర్సులు తప్పనిసరి చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ వీటిని ప్రవేశపెట్టనుంది. అయితే కోర్సుల అనుమతులకు యూజీసీ నిబంధనలే వర్తిస్తాయని, ఆయా కోర్సులు అందించే కళాశాలలు తప్పనిసరిగా ఏఐసీటీఈ అనుమతికి దరఖాస్తు చేసుకోవాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) వైస్ ఛైర్మన్ అభయ్ జెరే స్పష్టం చేశారు.
ఏఐసీటీఈ అనుమతులపై ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, పాలిటెక్నిక్ కళాశాలల ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు జనవరి 9న ఓయూలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. బీబీఏ, బీసీఏ కోర్సులకు ఏఐసీటీఈ అనుమతి తీసుకోవాలని, ఇక వారి పరిధిలో ఉండదని జనవరి 8న యూజీసీ నోటిఫికేషన్ జారీ చేసిందని పేర్కొన్నారు. ఇకనుంచి మంచి పనితీరు కనబరిచే కళాశాలలకు కూడా ఆఫ్ క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఇచ్చామని, సీట్ల సంఖ్యపై కూడా పరిమితి ఎత్తివేశామని తెలిపారు. ఈసారి నుంచి కళాశాలల ప్రతినిధులు ఏఐసీటీఈ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని, తామే కళాశాలల వద్దకు వస్తామని పేర్కొన్నారు.
సాంకేతిక విద్యా ప్రమాణాల పెంపుపై దృష్టి - విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి
విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ సాంకేతిక విద్యా ప్రమాణాల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, టెక్నాలజీ అంటే తెలంగాణ గుర్తుకు రావాలన్నది తమ లక్ష్యమన్నారు. ఏఐసీటీఈ చీఫ్ కోఆర్డినేటింగ్ అధికారి డాక్టర్ బుద్దా చంద్రశేఖర్ వివిధ భాషల్లోకి అనువాదం చేసేందుకు కేంద్రం తీసుకొచ్చిన అనువాదిని గురించి సదస్సులో వివరించారు.
కోర్సులకు డిమాండ్..
ఈ రెండు కోర్సులకు మార్కెట్‌లో గణనీయమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయి. ఏళ్లుగా ఈ కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ అవగాహన లేమితో బీఏ, బీకాం, బీఎస్‌సీ, బీజెడ్‌సీ, ఇతర రెగ్యులర్ కోర్సులనే ఎక్కువ మంది అభ్యసిస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని డిగ్రీ కళాశాలల్లో మాత్రమే బీబీఏ, బీసీఏ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆయా కళాశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు పోటీపడుతున్నారు. ఒక్కో కోర్సులో 60 మంది ప్రవేశం పొందవచ్చు. పీజీ స్థాయిలో ఎంబీఏ చేయాలనుకునేవారు బీబీఏ, ఎంసీఏ అభ్యసించాలనుకునేవారు బీసీఏను ఎంపిక చేసుకుంటున్నారు.
బీబీఏ అభ్యసిస్తే..
వ్యాపార నిర్ణయాలు తీసుకోవటం, నాయకులుగా మారేందుకు బీబీఏ కోర్సు ఉపకరిస్తుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ వ్యాపారాల్లో అద్భుతమైన కెరీర్ పురోగతికి బాటలు వేస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే ట్రైనీ మేనేజర్, ఇతర అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాల్లో ప్రవేశించే వెసులుబాటు ఉంటుంది. సంస్థలు ఎలా పనిచేస్తాయనే అంశంపై బీబీఏ విద్యార్థులకు సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. పరిశ్రమను అర్థం చేసుకోవటానికి కావాల్సిన నైపుణ్యాలనూ ఈ కోర్సు అందిస్తుంది. స్వయం నిర్ణయానికి అవకాశం కల్పిస్తుంది.
బీసీఏ చదివితే..
కంప్యూటర్ అప్లికేషన్ల చుట్టూ సిలబస్ తిరుగుతుంది. బీసీఏ కోర్సు విద్యార్థులకు కంప్యూటర్ ఇన్నోవేషన్ పరిశ్రమల్లో అధిక డిమాండ్ ఉంటుంది. డిగ్రీ పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కంప్యూటర్ సైన్సు రంగంలో సాంకేతిక మార్పులతో బీసీఏ డిగ్రీ ముందంజలో ఉంది.