Cyber Crime : క్రెడిట్ కార్డు కోసం కాల్ చేస్తే ఖాతా ఖాళీ, సైబర్ నేరగాళ్ల వలలో పడిన ప్రొఫెసర్!
Cyber Crime : సైబర్ కేటుగాళ్ల వలలో పడి ఓ ప్రొఫెసర్ లక్షల్లో నగదు పోగొట్టుకున్నారు. నకిలీ లింక్ ను పంపించి ఆ లింక్ క్లిక్ చేయగానే నెట్ బ్యాంకింగ్ ను హ్యాక్ చేశారు నేరగాళ్లు.
Cyber Crime : సైబర్ నేరగాళ్ల వలలో ఓ ఇంజినీరింగ్ కాలేజీ ప్రొఫసర్ చిక్కుకున్నారు. క్రెడిట్ కార్డు పేరుతో కాల్ సెంటర్ నుంచి ఫేక్ ఫోన్ కాల్ వచ్చింది. ఆ తరువాత అకౌంట్ లో నాలుగు లక్షల తొంభై వేలు జమ అయినట్టు మెసేజ్ వచ్చింది. తప్పుగా డబ్బులు పడ్డాయి, లింక్ పంపిస్తాం, అది ఓపెన్ చేస్తే వెనక్కి డబ్బులు వచ్చేస్తాయని నమ్మబలికారు. కాల్ సెంటర్ వాళ్లు చెప్పినట్టే చేస్తే తన అకౌంట్ లో దాచుకున్న రెండు లక్షలు కూడా ఊడ్చేసారు ప్రబుద్దులు. ప్రొఫసర్ ఇచ్చిన కంప్లైంట్ పై రాజాం పోలీసులు కేసు నమోదు చేసి యూపీలో ఉన్న సైబర్ కేటుగాళ్లను చాకచక్యంగా పట్టుకుని రాష్ట్రానికి తీసుకొచ్చారు.
అసలేం జరిగింది?
విజయనగరం జిల్లా సంతకటి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ కళాశాలలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న అరుణ్ సోయల్ మూడు నెలల కిందట క్రెడిట్ కార్డ్ కోసం కస్టమర్ కేర్ కు ఫోన్ చేశాడు. అయితే తాను చేసిన కస్టమర్ కేర్ ఒక ఫ్రాడ్ కేర్ సెంటర్ కావడంతో సైబర్ నేరగాళ్లు అతని నెట్ బ్యాంకింగ్ ను హ్యాకింగ్ చేసి అరుణ్ కు తెలియకుండా ఐదు లక్షల రూపాయలు లోన్ పెట్టారు. ప్రొఫెసర్ ఖాతా ఉన్న యాక్సెస్ బ్యాంకు ఆన్లైన్లో లోన్ మంజూరు చేసిన విషయం సైబర్ నేరగాళ్ల దృష్టికి చేరడంతో... ప్రొఫెసర్ ఫోన్ కు వివిధ రకాల ఓటీపీలు పంపిస్తూ లక్షల్లో సొమ్మును కాజేశారు. ఆలస్యంగా తెలుసుకున్న ప్రొఫెసర్ పోలీసులు ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు యూపీలో మకాం వేసిన నేరగాడిని గుర్తించారు. రాజాం రూరల్ సీఐ నవీన్ కుమార్ తన సిబ్బందితో కలిసి ఉత్తర్ ప్రదేశ్ వెళ్లి చాకచక్యంగా వ్యవహరించి సుమిత్ అనే ప్రధాన కేటుగాడిని అదుపులోకి తీసుకున్నారు. అదే ముఠాలో ఉన్న మరికొంత మందిని త్వరలో అరెస్ట్ చేస్తామని సీఐ చెప్పారు.
నెట్ బ్యాంకింగ్ హ్యాక్
"అరుణ్ సోయల్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నారు. ఆయన అకౌంట్ కు తప్పుగా అమౌంట్ క్రిడెట్ అయిందని కస్టమర్ కేర్ కి కాంటాక్ట్ చేశారు. అరుణ్ పొరపాటున నకిలీ కస్టమర్ కి కాల్ చేశారు. నిందితుడు ఒక లింక్ ను పంపించి దానిని క్లిక్ చేయమని చెప్పాడు. వెంటనే రెక్టిఫై చేస్తామని చెప్పాడు. ఆ లింక్ క్లిక్ చేయగానే నెట్ బ్యాంకింగ్ ను హ్యాక్ చేశారు. అరుణ్ అప్లై చేసినట్లు నిందితుడు బ్యాంక్ లో రూ.5 లక్షల లోన్ అప్లై చేశాడు. ఆ తర్వాత నెట్ బ్యాంకింగ్ ద్వారా నగదు కొట్టేశాడు. ఇది యూపీకి గ్యాంగ్. ఈ గ్యాంగ్ లో ఒక ముద్దాయిని అరెస్టు చేశాం. మరో ముగ్గురు ముద్దాయిలు ఉన్నారు. వారినీ అరెస్టు చేస్తాం. ప్రజలు అన్ నోన్ యాప్ లు, లింక్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎట్టిపరిస్థితులో ఓటీపీలను షేర్ చేయకూడదు. ఏ కంపెనీ, బ్యాంక్ ఓటీపీని అడగదు."- సీఐ నవీన్ కుమార్