(Source: Poll of Polls)
Visakhapatnam Beach: విశాఖపట్నంలో విషాదం, యారాడ బీచ్‌లో ఇటలీ పర్యాటకుడు మృతి
Yarada Beach In Vizag | విశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. విశాఖలోని యారాడ బీచ్‌లో ఇటలీ పర్యాటకుడు నీళ్లల్లో కొట్టుకుపోయాడు. లైఫ్ గార్డ్స్ కాపాడి తీరానికి తెచ్చినా ప్రయోజనం లేకపోయింది.

Vizag Crime News | విశాఖపట్నం: విశాఖపట్నంలోని యారాడ సముద్ర తీరంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. బీచ్ లో స్నానానికి దిగిన ఇటలీకి చెందిన ఓ పర్యాటకులు మృతిచెందాడు. గాజువాక పరిధిలోని యారాడ బీచ్‌కి సందర్శనకు వచ్చిన 16 మంది ఇటలీ దేశస్థుల్లో ఇద్దరు సముద్రంలో ఈతకు దిగగా, అలలు రావడంతో కొట్టుకుపోయారు. అక్కడ లోతు ఎక్కువగా ఉంటుందని మెరైన్ పోలీసులు, జీవీఎంసీ లైఫ్ గార్డులు ముందుగానే హెచ్చరించినా వారు పట్టించుకోలేదు.
ఇది గమనించిన జీవీఎంసీకి చెందిన లైఫ్ గార్డ్స్ అప్రమత్తమై వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. బీచ్ లో కొట్టుకుపోయిన ఇద్దరినీ సముద్రతీరం నుంచి కాపాడి ఒడ్డుకు చేర్చారు. కాపాడి ఒడ్డుకు తీసుకువచ్చారు. అయితే, వారిలో ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సీపీఆర్ చేసినా ప్రయోనం లేకపోవడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే అతడు చనిపోయినట్లు నిర్ధారించారు. న్యూ పోర్ట్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విదేశీ పర్యాటకుడి మృతితో యారాడ తీరంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరణించిన వ్యక్తి ఇటలీ దేశస్థుడనని అధికారులు తెలిపారు. మరో వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పర్యాటకులు సముద్రంలో ఈతకు దిగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. యారాడ బీచ్‌లో తరచూ అలలు ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉండటంతో, ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.























