Visakha News : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు, కార్మిక సంఘాల నేతల అరెస్టులు!
Visakha News : విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తున్నారు. ప్రధాని పర్యటన కారణంగా నిరసనలకు పిలుపునిచ్చిన నేతలను అరెస్టు చేశారు.
Visakha News : విశాఖలో ప్రధానమంత్రి పర్యటనతో కూర్మన్నపాలెం వద్ద నిరసన దీక్ష చేస్తోన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగ కార్మిక సంఘాల నేతలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్మిక సంఘాల నాయకులను ముందస్తు అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, విభజన హామీల సాధన కోసం స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నిలిపేస్తున్నట్లు మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని స్టీల్ ప్లాంట్ కార్మికులు డిమాండ్ చేస్తు్న్నారు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ మెయిన్‌గేటు వద్దకు ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. నిరసనలను అడ్డుకునేందుకు, అరెస్టులు చేసేందుకు పోలీసులు సన్నద్ధంగా ఉన్నారు. ప్రధాని పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు పోలీసులు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఏ క్షణంలోనైనా ఆందోళకారులు ప్రధాని పర్యటనకు ఆటంకం కలిగిస్తారనే సమాచారంతో భారీగా పోలీసులను మోహరించారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ టీడీపీ కార్యాలయంలో నిరసన
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు విశాఖలోని పార్టీ కార్యాలయంలో నిరసన చేపట్టారు. సేవ్ స్టీల్ ప్లాంట్ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. ఈ నిరసనలో విశాఖపట్నం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్, విశాఖ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రెహమతుల్లా ఇతర నేతలు పాల్గొన్నారు. పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జగన్ సర్కార్ సహాయంతోనే స్టీల్ ప్రైవేటీకరణ జరుగుతోందన్నారు. ప్రైవేటీకరణను వైసీపీ నిజంగా వ్యతిరేకిస్తే ప్రధాని దగ్గరకు అఖిలపక్షాన్ని తీసుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై బీజేపీ నేతలను అడగండి అంటూ ఎంపీ విజయ సాయి రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం అన్నారు. ప్రధాని సభలో మూడు రాజధానులపై వైసీపీ స్పష్టత ఇవ్వాలన్నారు. మోదీ సమక్షంలో సీఎం జగన్ మూడు రాజధానులు ప్రకటన చేయాలన్నారు. మూడు రాజధానుల గర్జనలు ప్రధాని ముందు చేసి వైసీపీ నేతలు చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.
మోదీ రాకకు వ్యతిరేకం కాదు, విభజన హామీల మాటేంటి?
ఏపీలో పార్టీలన్నీ కలిసి బీజేపీకి మద్దతుగా ఉంటున్నప్పుడు రాష్ట్రానికి రావాల్సిన హామీలు ఎవరు అడుగుతారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాకను తామేం వ్యతిరేకించడం లేదని.. ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలని మాత్రమే కోరుతున్నట్లు తెలిపారు. ప్రారంభోత్సవాల్లో, మోదీ అనుకూలమైన వారికి చేసిన పనులు ప్రారంభిస్తున్నారని ఆరోపించారు. ఆదానీకి అమ్మడం కోసమే విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తున్నారంటూ చలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే జోన్ ఇవ్వడం కాదు ఇక్కడ డివిజన్ ఎత్తేస్తున్నారని విమర్శించారు. కేకే లైన్, ఒడిశాలో కలుపుతున్నారని చెప్పుకొచ్చారు. అసలు ముఖ్యమంత్రి సభ ఎందుకు నిర్వహిస్తున్నారో చెప్పాలని చలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడిని ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎలా వేధించిందో.. సీఎం జగన్ కు రేపు అదే పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. బెదిరించి మరీ తెలుగు వారి ఆస్తులను గుజరాత్ కు అప్పగించారని.. ఆదానికి కట్టబెట్టారని తెలిపారు. నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం చేశారని సాధన సమితి సభ్యులు అన్నారు. విభజన హామీలు, కేంద్రం ఇచ్చిన హామీలు అమలు జరగలేదని వివరించారు. ఇక్కడ పరిశ్రమలు అమ్మడానికి వస్తున్నారా.. అంటూ ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటించాలన్నారు. ఇచ్చిన హామీలపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడాలన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఆంధ్ర రాష్ట్ర ఆత్మభిమానాన్ని నరేంద్ర మోదీ కాళ్ల దగ్గర దాసోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.