Visakha News : పెందుర్తి గోవిందపురంలో ఉద్రిక్తత, స్థల వివాదంతో మహిళ ఆత్మహత్య!
Visakha News : పెందుర్తి గోవిందపురంలో ఒకే కుటుంబానికి చెందిన మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. భూమి కోసం సర్పంచ్ అల్లుడి వేధింపుల కారణంగా వీరు బలవన్మరణం చేసుకున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు.
Visakha News :విశాఖ పెందుర్తి గోవిందపురంలో వైసీపీ భూదాహానికి ఒకే కుటుంబానికి చెందిన రెండో వ్యక్తి బలాన్ ఆత్మహత్య చేసుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పెందుర్తి మండలం ముదపాక పంచాయతీ గోవిందపురంలో కడియాల అచ్చియమ్మ(37) సోమవారం రాత్రి నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. తన కుటుంబానికి సంబంధించిన 70 గజాల స్థల వివాదంలో సెప్టెంబర్ 8న సారి పిల్లి సోమేశ్వరరావు వైసీపీ నాయకుల వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి విశాఖ కేజీహెచ్ లో వైద్యం పొందుతూ మరణించాడని బంధువులు ఆరోపించారు. ఆ విషయం మరవకముందే ఆ కుటుంబంలో మరో వ్యక్తి సోమేశ్వరరావు సోదరి మృతురాలికి ఆ స్థలం ఖాళీ చేయాలని ఈ నెల 4న నోటీసులు ఇవ్వడంతో అప్పటి నుంచి తీవ్ర మనస్థాపానికి గురైన అచ్చయమ్మ గత రాత్రి వ్యవసాయ పొలాల మధ్యలో ఉన్న నేలబావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో గోవిందపురంలో విషాదఛాయలు అలముకున్నాయి.
తీవ్ర ఘర్షణ -ఎస్ఐకు గాయాలు
మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు భర్త చినబాబు, బంధువులకు ముఖం చూపించకుండా అంబులెన్స్ ఎక్కించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు గ్రామస్తులకు మధ్య ఒక దశలో తీవ్ర ఘర్షణ నెలకొంది. మృతదేహాన్ని అంబులెన్స్ లో ఎక్కించి వాహనాన్ని వేగంగా తీసుకెళ్లడంతో గ్రామస్తులను కట్టడి చేస్తున్న పెందుర్తి ఎస్ఐ రాంబాబు కింద పడిపోవడంతో కాలు విరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాయపడిన ఎస్ఐను పోలీస్ వాహనంలో హాస్పిటల్ కి తరలించారు.
సర్పంచ్ అల్లుడిపై ఆరోపణలు
మృతురాలి భర్త మాట్లాడుతూ ఈ నెల నాలుగో తేదీన తన భార్యకు సచివాలయం అధికారులు స్థలం ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందన్నారు. తన భార్యను కడసారి చూద్దాం అంటే పోలీసులు దౌర్జన్యంగా మృతదేహాన్ని హాస్పిటల్ కి తరలించడం సరికాదని ఆవేదన చెందారు. మృతురాలి పేరున ఉన్నటువంటి స్థలాన్ని సర్పంచ్ అల్లుడు సారిపిల్లి గణేష్ అమ్మమని అడగ్గా దానికి తాము నిరాకరించడంతో కక్ష పెంచుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబంలో ఇద్దరు చనిపోవడానికి ప్రధాన కారకుడు సర్పంచ్ అల్లుడు సారపిల్ల గణేష్ అంటున్నారు. వైసీపీ నాయకుల అండదండలతో మా స్థలాన్ని అమ్మాలని లేనిపక్షంలో ప్రభుత్వ స్థలంగా నమోదు చేసి వెనక్కి తీసుకుంటామని చెప్పడంతో గతంలో సోమేశ్వరరావు, ఇప్పుడు అచ్చయమ్మ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. వీరి మరణాలకు గణేష్ ప్రధాన కారకుడని బంధువులు అంటున్నారు.
హత్య ఏమోనని అనుమానం- టీడీపీ
సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలి బంధువులను టీడీపీ పెందుర్తి ఇన్ ఛార్జ్ బండారు అప్పలనాయుడు పరామర్శించారు. వైసీపీ నాయకుల మొండి వైఖరితో చిన్న స్థల వివాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం బాధాకరమన్నారు. కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని చూపించకుండా తరలించడం సరికాదన్నారు. ఇది ఆత్మహత్య కాదు హత్య ఏమోనని అనుమానం కలిగేటట్టు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.
Also Read : DGP Rajendranath: ప్రధాని మోదీ ఏపీ పర్యటన, యువ ఎస్పీలకు మంచి అనుభవం - ఏపీ డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి