E-cigarettes In Vizag: విశాఖలో ఈ సిగరెట్ల మాఫియా, మత్తు ఇచ్చే రూ.22 లక్షల సిగరెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
Visakhapatnam News: మత్తు కలిగించే ఈ సిగరెట్లను అక్రమంగా తరలించి ఏపీలో విక్రయిస్తున్న ముఠాను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.22 లక్షల విలువైన ఈ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు.
CTF raids two shops, seize 734 banned e-cigarettes: విశాఖపట్నం: అసలే ఓ వైపు ఏపీ గంజాయి, డ్రగ్స్ లాంటి సమస్యల్ని ఎదుర్కుంటోంది. మరోవైపు విశాఖలో ఈ సిగరెట్ల దందాను గుర్తించారు. మత్తు కలిగిస్తున్న ఈ సిగరెట్లను విక్రయించే ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. మీరా కలెక్షన్, డేజావు క్లాత్ షో రూంలో రూ. 22 లక్షల విలువ చేసే 743 ఈ సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ సిగరెట్ (e-cigarettes)ను ముంబై నుంచి ఏపీకి తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు.
విశాఖ జాయింట్ సీపీ ఫకిరప్ప మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో పెద్ద మొత్తం లో ఈ సిగరెట్లు సీజ్ చేశామన్నారు. ప్రస్తుతం సీజ్ చేసిన ఈ సిగరెట్లను 2019 లో బ్యాన్ చేశారని తెలిపారు. మీరా కలెక్షన్, డేజావు క్లాత్ షో రూంలో 743 ఈ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సీజ్ చేసిన ఈ సిగరెట్ల విలువ మార్కెట్ లో 22 లక్షల రూపాయల వరకు ఉంటుంది. రెగ్యూలర్ గా స్మోకర్లు వాడే సిగరేట్లలా కాదని, ఈ ఈ-సిగరెట్ లలో నికోటిన్ ఉంటుందని, స్మోకింగ్ చేస్తే మత్తు కలిగిస్తాయి. ఈ కేసులో పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ సిగరెట్లను ముంబై నుంచి విశాఖకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ముంబైలో వెంటిలేటర్ పై ఉన్నాడని ఫకీరప్ప తెలిపారు.