Visakha Crime News: తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య - ప్రేమ వ్యవహారమే కారణం
Visakha Crime News: నువ్వు నాతో ఉంటే నాకెవరూ వద్దనిపిస్తోంది.. కానీ నువ్వు నా పక్కన లేకపోతే ఒంటరిననిపిస్తోందంటూ సూసైడ్ నోట్ రాసి పెట్టి మరీ తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
Visakha Crime News: నువ్వు నాతో ఉన్నప్పుడు నాకెవరూ వద్దనిపిస్తోంది.. కానీ నువ్వు నాతో లేనప్పుడు నాకంటూ ఎవరూ లేరనిపిస్తోందంటూ తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సూసైడ్ నోట్ చూస్తుంటేనే అతడేదో ప్రేమ వ్యవహారం వల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కానీ అతడి వయసు 16 ఏళ్లే ఉండడం, అందులోనూ తొమ్మిదో తరగతే చదవడం మరింత బాధాకరం
విశాఖ పట్టణంలోని గాజువాకలోని కైలాస్ నగర్ కు చెందిన 16 ఏళ్ల బాలుడు అఖిల్ తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అయితే ఆ బాలుడు తొమ్మిదో తరగతి చదువుతుండగా.. ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయాన్ని వెంటనే పోలీసులకు తెలిపారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు. ఈక్రమంలోనే అఖిల్ మృతదేహం వద్ద ఓ సూసైడ్ నోట్ లభించింది. నువ్వు నాతో ఉన్నప్పుడు నాకు ఇంకెవరూ వద్దనిపిస్తోందని.. నువ్వు నాతో లేనప్పుడు నాకంటూ ఎవరూ లేరనిపిస్తోందని రాసి పెట్టాడు. ఇది చూసిన పోలీసులు ప్రేమ వ్యవహారమే బాలుడి ఆత్మహత్యకు కారణం అని తెలుస్తోందని అంటున్నారు.
ఇటీవలే విశాఖ బీచ్ లో దూకి తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య
తెలంగాణ విద్యార్థి అదృశ్యం కేసు విషాందగా మారింది. వైజాగ్ లో కనిపించకుండా పోయిన విద్యార్థి కథ దుఃఖాంతమైంది. హైదరాబాద్ ఐఐటీలో చదువుకుంటున్న కార్తీక్.. ఈనెల 17వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. అతడి ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ కావడంతో స్నేహితులు, తల్లిదండ్రులు ఇలా ఎవరు ఫోన్ చేసిన స్పందన లేదు. రెండు, మూడు రోజుల పాటు చూసిన తల్లిదండ్రులు కాలేజీకి, అతను ఉండే హాస్టల్ కు ఫోన్ చేశారు. ఎక్కడా అతడి సమాచారం లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాలేజీతోపాటు అతని స్నేహితులను కూడా విచారించారు. అయినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో.. అతడి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించారు. ఇలా కార్తీక్ విశాఖపట్నం వెళ్లినట్లు తెలుసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కార్తీక్ విశాఖ బీచ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. అయితే కార్తీక్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం ఇంకా తెలియరాలేదు. మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
నిన్నటికి నిన్న యూట్యూబ్ చూస్తూ బాలుడి ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన 11 ఏళ్ల ఉదయ్ కుమార్ అనే బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. అయితే బాలుడికి తల్లిదండ్రుల సెల్ ఫోన్ లో వీడియోలు చూసే అలవాటు ఉంది. రోజూలాగే శనివారం రోజు రాత్రిపూట భోజనం చేశాడు. అనంతరం ఫోన్ తీసుకొని ఓ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. విషయం గుర్తించని తల్లిదండ్రులు భోజనం చేసి ఇతర పనులు చేసుకున్నారు. బాలుడు చాలా సేపు అవుతున్నా బయటకు రాకపోవడంతో.. తల్లిదండ్రులు చాలా సేపు పిలిచారు. అయినప్పటికీ చడీచప్పుడు లేకపోవడంతో తలుపులు పగులగొట్టారు. అప్పటికే ఉదయ్ ఉరి వేసుకొని ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు. అది చూసిన తల్లిదండ్రులకు అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. గట్టిగా కేకలు వేస్తూ ఏడ్వడంతో స్థానికులంతా వచ్చారు. తలుపులు పగులగొట్టి బాలుడిని నేరుగా ఆస్పత్రికి తరలించారు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా... అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. అలాగే స్థానికులు పోలీసులకు కూడా సమాచారం అందించగా.. హుటాహుటాన రంగంలోకి దిగారు. పోస్టుమార్టం నిమిత్తం ఉదయ్ మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.