Vijayawada Crime : ఒంటరి మహిళలే టార్గెట్, మత్తు మందు ఇచ్చి ఆపై దారుణాలు
Vijayawada Crime : బస్ స్టాండ్ చుట్టుపక్కల ఒంటరిగా ఉన్న మహిళలే అతడి టార్గెట్. మాయమాటలు చెప్పి మత్తు మందు ఇచ్చి బంగారం దోచేస్తాడు. ఇలా 30కి పైగా చోరీలకు పాల్పడిన నిందితుడ్ని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు.
Vijayawada Crime : మహిళలను నమ్మించి మోసం చేస్తున్న వ్యక్తిని బెజవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి సుమారు ఐదు లక్షల విలువైన 97.5 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడు నెల్లూరు జిల్లా కోట మండలానికి చెందిన చేవూరి చంద్ర అలియాస్ వెందేటి చంద్ర( 50) అని గుర్తించారు. చిన్నతనంలోనే ఇంట్లోంచి వచ్చేసిన చంద్ర ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. కొంతకాలం గూడూరులో ఉన్న చంద్ర... అక్కడ నుంచి తిరుపతికి మకాం మార్చాడు. జల్సాలకు అలవాటుపడిన చంద్ర ఏదో విధంగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో బస్టాండ్ చుట్టుపక్కల ఒంటరిగా ఉన్న మహిళలతో తాను చాలా డబ్బు ఉన్నవాడినని బిల్డప్ ఇచ్చి బురిడీ కొట్టించేవాడు. బంగారం వ్యాపారం చేస్తున్నానని పరిచయం చేసుకుని, మహిళలకు మాయమాటలు చెప్పి సన్నిహితంగా ఉంటూ సమీపంలోని హోటల్, లాడ్జికి తీసుకువెళ్లేవాడు. అక్కడ మహిళలకు మత్తు మందు ఇచ్చి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదుతో పరారీ అయ్యేవాడు.
మత్తు మందు ఇచ్చి అఘాయిత్యాలు
అంతే కాదు కొందరు మహిళలు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తరువాత వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు నిందితుడు చంద్ర. బాధిత మహిళలు బయటకు వచ్చి ఫిర్యాదు చేయకపోవడంతో నిందితుడు మోసాలు వెలుగులోకి రాలేదు. దీంతో నిందితుడు చంద్ర ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని నేరాలు చేసి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. ఇలా 12 సంవత్సరాలుగా మహిళలను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నాడు. 2010 సంవత్సరం నుంచి మహిళలను మోసం చేస్తూ కార్యకలాపాలు సాగిస్తున్న నిందితుడు చంద్రపై తిరుపతి, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, ఏలూరులోని పలు పోలీస్ స్టేషన్లలో సుమారు 20కి పైగా కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులలో నిందితుడు పలుమార్లు అరెస్ట్ అయ్యి, జైలు శిక్షను అనుభవించాడు. ఈ ఏడాది జనవరిలో జైలు నుంచి విడుదల అయిన తరువాత కూడా తన పద్ధతి మార్చుకోకుండా విజయవాడ బస్ స్టాండ్ సమీపంలో జూన్ నెలలో విజయవాడ భవానిపురానికి చెందిన మహిళను మోసం చేసి 32 గ్రాముల నాను తాడు ,04 గ్రాముల చెవి దిద్దులు మొత్తం 36 గ్రాముల బంగారం ఆభరణాలు చోరీ చేశాడు.
30కి పైగా కేసులు
జులైలో కూడా మరో మహిళను మోసం చేసి 24 గ్రాముల నాను తాడు, 8 గ్రాముల పూసల దండ, 20 గ్రాముల చైను, 3 ఉంగరాలు, చెవి దిద్దులు మొత్తం 61.5 గ్రాముల బంగారు ఆభరణాలను చంద్ర చోరీ చేశాడు. ఈ రెండు కేసులలో కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ లో మరొక మహిళను ఏమర్చడానికి వచ్చిన నిందితుడు చంద్రని పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారించి అతని వద్ద నుంచి సుమారు ఐదు లక్షల రూపాయల విలువైన 97.5 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. 30కి పైగా కేసుల్లో చంద్ర నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.