Vijayawada Crime News: పారిపోయిన ప్రేమ జంట - మాట్లాడేందుకు వెళ్లిన మేనమామ హత్య, అసలేం జరిగిందంటే?
Vijayawada Crime News: ప్రియుడితో పారిపోయిన మేనకోడలితో మాట్లాడేందుకు వెళ్లిన మేనమామను ప్రియుడి కుటుంబసభ్యులు హతమార్చారు. ఈ ఘటన విజయవాడలో జరిగింది.
![Vijayawada Crime News: పారిపోయిన ప్రేమ జంట - మాట్లాడేందుకు వెళ్లిన మేనమామ హత్య, అసలేం జరిగిందంటే? Vijayawada Crime News Lover Relatives Killed Woman Maternal Uncle In Vijayawada Vijayawada Crime News: పారిపోయిన ప్రేమ జంట - మాట్లాడేందుకు వెళ్లిన మేనమామ హత్య, అసలేం జరిగిందంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/20/fc7cf19e6fb0ed731111cf74d34c18a01681990490949519_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vijayawada Crime News: కొన్ని వ్యవహారాలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. ఎంతలా అంటే దాంతో ఏమాత్రం సంబంధంలేని వ్యక్తులు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అన్యం పుణ్యం ఎరుగని వారు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. తప్పు చేసింది ఒకరైతే మరొకరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. పెద్దలు చెప్పినట్లుగా పుణ్యం కోసం పోతే పాపం వచ్చినట్లుగా మారుతుంది పరిస్థితి. విజయవాడలో జరిగిన ఓ హత్య కేసును పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది. మధ్యవర్తిగా మాట్లాడదామని, నచ్చచెబుదామని వెళ్లిన వ్యక్తిని చంపేశారు. అసలేం జరిగిందంటే..
విజయవాడ సత్యనారాయణపురంలోని ఖుద్ధూస్ నగర్ కు చెందిన యువకుడు నవీన్ కు, ఒంగోలుకు చెందిన శ్వేతకు మధ్య ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రణయంగా మారింది. పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో.. కొన్ని రోజులు అయ్యాక శ్వేత నవీన్ తో కలిసి ఇంటి నుండి వెళ్లిపోయింది. ఇంటి నుండి వెళ్లిపోయిన శ్వేతతో మాట్లడదామని ఆమె మేనమామ శ్రీనివాస్ సహా పలువురు కుటుంబ సభ్యులు నవీన్ ఇంటికి వెళ్లారు. శ్వేతకు నచ్చజెప్పి తీసుకువద్దామనుకున్నారు. నవీన్ కుటుంబసభ్యులతో కలిసి కూర్చొని మాట్లాడుతూ మంచీ చెడ్డా వివరించే ప్రయత్నం చేశాడు శ్రీనివాస్. మాటా మాటా పెరగడంతో చర్చలు కాస్త గొడవకు దారి తీసింది. ఈ కొట్లాటలో శ్వేతను తనతో పాటు ఒంగోలుకు తీసుకుపోతానని శ్రీనివాస్ అనడంతో నవీన్ అన్న జగదీష్ కోపోద్రిక్తుడయ్యాడు. ఇంట్లో ఉండే కత్తితో శ్రీనివాస్ పై దాడికి దిగాడు. విచక్షణారహితంగా కత్తితో పోట్లు పొడిచాడు.
ఊహించని ఈ ఘటనతో అక్కడ ఉన్న వారు శ్రీనివాస్ తో పాటు వచ్చిన వారు ఒక్కసారిగా కంగు తిన్నారు. వెంటనే తేరుకుని రక్తమోడుతున్న శ్రీనివాస్ ను హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. దవాఖానాకు చేరుకునే లోపే శ్రీనివాస్ దారిలోనే తుది శ్వాస విడిచాడు. శ్రీనివాస్ ను హత్య చేసిన నవీన్ అన్న జగదీష్ పై శ్రీనివాస్ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ ప్రారంభించారు. జగదీష్ పై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. నేర చరిత్ర ఉన్న జగదీష్ తన తీరును మార్చుకోకుండా మరోసారి ఆవేశంలో శ్రీనివాస్ ను హతమార్చాడు. మాట్లాడదామని వెళ్లిన వ్యక్తిని చంపేసి విగతజీవిగా మార్చారని శ్రీనివాస్ కుటుంబసభ్యులు విలపించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది.
ఇటీవలే తిరుపతిలో కూడా ఇలాంటి ఘటనే
నాగరాజు (36) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగరాజు తమ్ముడు పురుషోత్తం. పురుషోత్తం స్వగ్రామంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ మహిళ ఆ ఊరి సర్పంచ్ చాణక్యకు మరదలు (తమ్ముడి భార్య). కరోనా వల్ల లాక్ డౌన్ పెట్టిన సమయంలో వీరిద్దరికీ వివాహేతర సంబంధం ఏర్పడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో మహిళ బంధువులకి పురుషోత్తంకి మధ్య తరచూ గొడవలు అవుతున్నాయి. ఇకపై గొడవలు లేకుండా చేస్తామని నమ్మించి అన్న నాగరాజును మద్యం తాగించటానికి తీసుకువెళ్లి హత్య చేశారు. అయితే, నాగరాజును సర్పంచ్ చాణిక్య హత్య చేసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రామ సర్పంచ్ చాణిక్య నాగరాజుతో మాట్లాడాలని పిలిపించి.. మాటల సందర్భంగా ఆగ్రహంతో ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)