Vemulavada Crime News: రాజన్న దర్శనానికి వచ్చి ప్రాణాలు విడిచిన భక్తుడు, ఏం జరిగిందంటే?
Vemulavada Crime News: వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు కుటుంబంతో కలిసి వచ్చిన ఓ వ్యక్తి ఫిట్స్ తో మృతి చెందాడు. సరైన సమయంలో చికిత్స అందకపోవడం వల్లే అతడు చనిపోయినట్లు తెలుస్తోంది.
Vemulavada Crime News: కుటుంబ సభ్యులందరినీ తీసుకొని సంతోషంగా వేమలవాడ రాజన్న దర్శనం కోసం వచ్చాడు. కానీ దురదృష్టవశాత్తు ఫిట్స్ వచ్చి అక్కడికక్కడే చనిపోయాడు. ఏం చేయాలో పాలుపోని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చివరకు మృతదేహాన్ని తీసుకొని సొంత గ్రామానికి వెళ్లిపోయారు.
అసలేం జరిగిందంటే..?
వేములవాడ శ్రీరాజ రాజేశ్వర స్వామి వారి దర్శనార్థం సోమవారం నిజాంసాగర్ గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తి కుటుంబ సమేతంగా వచ్చాడు. అయితే వేములవాడకు చేరుకున్న తర్వాత అతనికి ఫిట్స్ వచ్చింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఏం చేయాలో పాలుపోని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈవో కార్యాలయం ముందు పడిపోయి 30 నిమిషాల పాటు అలాగే ఉన్నాడు. వైద్యుల కోసం కుటుంబ సభ్యులు ఎంతగా వెతికినా లాభం లేకపోయింది ఈ క్రమంలోనే సాయిలు అక్కడే చనిపోయాడు. దీంతో చేసేదేం లేక మృతదేహాన్ని తీసుకొని కుటుంబ సభ్యులు తమ సొంత గ్రామానికి వెళ్లిపోయారు. వైద్యులు త్వరగా రాకపోవడం వల్ల సాయిలు చనిపోయినట్లు తెలుస్తోంది. అతనికి ఫిట్స్ వచ్చిన అరగంటకు కూడా వైద్యులు రాకపోవడంతో అతను మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే గతంలో ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం ప్రథమ చికిత్స కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసింది. కానీ ఎప్పుడూ అది మూసివేసే దర్శనమిస్తుందని స్థానిక భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆలయ ఉన్నత అధికారులు స్పందించి ప్రాథమిక చికిత్స కేంద్రం భక్తులకు ఉపయోగపడేలా అందుబాటులో తీసుకురావాలని కోరుతున్నారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో వైద్యుల సాయం చాలా అవసరమని చెబుతున్నారు.
నిన్నటికి నిన్న చైనా మాంజా కోసుకొని తీవ్ర గాయాలపాలైన చిన్నారి
హైదరాబాద్ వనస్థలిపురం సమీపంలోని కమలానగర్ లో నివసించే వినయ్ కుమార్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అతని భార్య స్నేహలత కూడా ఉద్యోగం చేస్తోంది. వీరికి ఐదున్నరేళ్ల వయసున్న పాప కీర్తి కూడా ఉంది. శుక్రవారం సాయంత్రం భార్యను ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి పికప్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చేందుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే తన పాపను కూడా వెంట తీసుకెళ్లాడు. ఇద్దరూ బైకుపై ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ రూట్లో వెళ్లారు. నాగోల్ వంతెనపై వారు ప్రయాణిస్తుండగా... ఎగురుతున్న గాలి పటానికి ఉన్న చైనా మాంజా పక్కన ఉన్న కరెంటు స్తంభానికి చిక్కుకొ ఉంది. దాన్ని గమనించిన వినయ్ బైక్ పోనిచ్చాడు. బైకుపై ముందు కూర్చున్న చిన్నారి మెడకు కోసుకుపోయింది. లోతుగా గాయమైంది. తండ్రి విషయం గుర్తించే లోపు వినయ్ కుమార్ ముక్కును కూడా ఆ మాంజా దారం కోసేసింది.
కీర్తి మెడ నుంచి తీవ్ర రక్తస్రావం అవడంతో స్థానికులంతా పరిగెత్తుకొచ్చారు. తండ్రీకూతుళ్లిద్దరినీ... సమీపంలోని సుప్రజ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం చింతల్ కుంట రెయిన్ బో ఆస్పత్రిలో చేర్పించారు. పాపకు శనివారం శస్త్ర చికిత్స చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. తమకిద్దరికీ తీవ్ర గాయాలు అయ్యేందుకు కారణం అయిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వినయ్ కుమార్ పోలీసులను ఆశ్రయించారు. వినయ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న చైతన్యపురి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.