Hyderabad News: పెట్రోల్ బంక్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి, యజమానితో సహా మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
Hyderabad News: సోమవారం బహదూర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని పెట్రోల్ బంక్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. తుపాకీతో బెదిరించి యజమాని సహా ఓ సిబ్బందిపై దాడి చేశారు.
Hyderabad News: హైదరాబాద్ పాతబస్తీలోని పెట్రోల్ బంక్ లో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో హల్ చల్ చేశారు. యజమాని సహా ఓ సిబ్బందిపై దాడి చేసి తీవ్ర గాయలయ్యేలా చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బహదూర్ పురా పోలీసు స్టేషన్ పరిధిలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్దకు సోమవారం అర్ధరాత్రి ఓ యువకుడు వచ్చాడు. పెట్రోల్ కోసం మొదట బంక్ వద్దకు వచ్చిన అతను.. యూపీఐ ద్వారా నగదు చెల్లిస్తానని చెప్పాడు. యూపీఐ ద్వారా నగదు ఖాతాలోకి రాకపోవడంతో.. బంక్ నిర్వాహకులు యువకుడిని డబ్బులు ఇవ్వాలని అడిగారు. ఈ క్రమంలో యువకుడు, నిర్వాహకులు మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో యువకుడు మరో ఇద్దరు యువకులకు ఫోన్ చేసి రప్పించాడు. వచ్చిన వాళ్లలో ఓ వ్యక్తి వద్ద తుపాకీ ఉంది.
అయితే డబ్బులు ఇవ్వమని చెప్తూ ముగ్గురు వ్యకులు సమీపంలోని వాహనాలను ధ్వంసం చేశారు. ఆపై తుపాకీతో భయపెడుతూ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. మేనేజర్ గదిలోకి వెళ్లి అద్దాలన్నీ పగుల గొట్టారు. అనంతరం యజమానిపై కూడా దాడి చేశారు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనలో యజమాని, ఓ సిబ్బందికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసుకున్నారు. అసలు దాడికి పాల్పడింది ఎవరో తెలుసుకునేందుకు సీసీ టీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. నిందితుల ఫొటోలు చేత పట్టుకొని వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇటీవలే జాంబియా కత్తులతో యువకుడి హల్ చల్..
హైదరాబాద్ లో దారుణం జరిగింది. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు జాంబియా కత్తులతో హల్ చల్ చేశాడు. సామాజిక కార్యకర్త అమీర్ జైన్ తమ్ముడు అక్బర్ నహీపై.. నవాజ్ నమీ అనే యువకుడు జాంబియా కత్తులతో దాడికి దిగాడు. అనంతరం కత్తులు చేత పట్టుకొని రోడ్లపై తిరుగుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు. అయితే ఈ ఘటనలో అక్బర్ నహీకి తీవ్ర గాయాలయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు గాయపడిన అక్బర్ నహీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్బర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకున్నారు. అనంతరం నవాజ్ నమీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవలే పాతబస్తీలో దారుణ హత్య..
పదిహేను రోజుల క్రితమే హైదరాబాద్ పాతబస్తీలో అర్ధరాత్రి దారుణమైన హత్య జరిగిన సంగతి తెలిసిందే. స్థానిక కుమార్ వాడి ప్రాంతంలో రైన్ బజార్‌కి చెందిన రౌడీ సీటర్ సయ్యద్ భక్త్యారాగ అలియాస్ మహ్మద్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఎవరో అతడిపై కత్తితో దాడి చేయడంతో అపస్మారక స్థితికిలోకి వెళ్లాడు. రౌడీ షీటర్ మహ్మద్ రక్తపు మడుగులో పడి ఉన్నట్టు గుర్తించిన పోలీసులు, బాధితుడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే, డాక్టర్లు అతణ్ని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు చెప్పారు. గత కొంత కాలంగా విదేశాల్లో ఉన్న మహ్మద్ తాగా హైదరాబాద్‌కి వచ్చాడు. మరో రెండు మూడు రోజుల్లో తిరిగి వెళ్లాల్సి ఉంది. ఈ లోగా ఈ హత్య జరగడం స్థానికంగా కలకలం రేకెత్తిస్తోంది.
ఇది పాత కక్షలకు సంబంధించిన హత్యగా పోలీసులు భావించారు. పోలీసులు కూడా రౌడీ షీటర్లపై చూసీ చూడకుండా వదిలేస్తున్నారని, గట్టి నిఘా ఉండటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ హత్యకు కారకులెవరు? మృతుడు విదేశాలకు వెళ్లడం వెనక దాగిన కారణాలు ఏమయి ఉంటాయనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.