Rangareddy News : అనారోగ్యంతో భార్య మృతి, తట్టుకోలేక రైలుకు ఎదురెళ్లిన భర్త!
భార్య మృతిని తట్టుకోలేక మనోవేదనతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రుల మృతితో 9 నెలల చిన్నారి అనాథగా మారింది.
దాంపత్య బంధం ఎంతో ప్రత్యేకమైనది. తల్లిదండ్రులతో కొంత కాలం, కొన్ని సంవత్సరాలు కలిసి ఉంటాం. కానీ జీవిత భాగస్వామితో చితి వరకు వెంటే ఉంటాం. చిన్నప్పటి నుండి పెద్దయ్యే వరకు కష్టాలు, నష్టాలు, సుఖ దుఃఖాలు తల్లిదండ్రులతో, అక్కా చెల్లెల్లతో, అన్నా తమ్ముళ్లతో పంచుకుంటాం. మన జీవితానికి సంబంధించి వారి వద్ద ఎలాంటి సీక్రెటూ దాగి ఉండదు. కానీ ఒక వయస్సుకు వచ్చాక.. కొన్ని విషయాలను తల్లిదండ్రులకు షేర్ చేసుకోలేం. తోబుట్టువులతోనూ కొన్ని విషయాలు చర్చించలేము. అలాంటి విషయాలను సైతం జీవిత భాగస్వామితో పంచుకుంటాం. నవ మాసాలు మోసి కన్న తల్లిదండ్రులు కూడా మన జీవితంలో కొన్ని రోజులు మాత్రమే ఉంటారు. తోడ బుట్టిన వారు కూడా ఒక వయస్సు వచ్చే వరకు మనతోనే ఉంటారు. తర్వాత ఎవరి జీవితాలు వారివే.
తీవ్ర అనారోగ్యంతో మృతి చెందిన భార్య..
కానీ పెళ్లి చేసుకుని దాంపత్య బంధంతో ఒక్కటైన వారు జీవితాంతం కలిసే ఉంటారు. సుఖాలు దుఃఖాలు, కష్టాలు నష్టాలు, ప్రేమ ఆప్యాయత, అన్నీ వారితో పంచుకుంటాం. ఎన్ని కష్టాలు ఎదురు అయినా అన్యోన్యంగా జీవనం సాగిస్తారు. అలాంటి జీవితమే వారిది. పెళ్లి అయినప్పటి నుండి ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఈ క్రమంలో వారికి ఒక పాప జన్మించింది. అంతా సవ్యంగా సాగుతోంది అనుకున్న సమయంలోనే అనుకోని ఉపద్రవం ఆ కుటుంబాన్ని చిదిమేసింది. వారి జీవితాన్ని చూసి విధికి కన్ను కుట్టిందేమో.. అనుకోని సమస్యను తీసుకువచ్చి పెట్టింది. భార్యకు తీవ్ర అనారోగ్యంతో మంచాన పడింది. ఇంటి దీపం అలా మంచాన పడటంతో ఆ ఇంట్లో సంతోషం లేకుండా పోయింది. ఆమెకు మెరుగైన చికిత్స కోసం వివిధ ఆస్పత్రులు తిప్పారు. అనారోగ్యం తీవ్రం కావడంతో చికిత్స పొందుతూ భార్య ప్రాణాలు కోల్పోయింది.
భార్య మృతితో రైలుకు ఎదురెళ్లిన భర్త..
అన్యోన్యంగా ఉన్న వారి బంధం నుండి భార్యను విధి తీసుకెళ్లడంతో ఆ భర్త తట్టుకోలేక పోయాడు. ఎన్నో ఆశలు, కోరికలతో సాగిన ఆ జీవితం నుండి భార్య దూరం కావడంతో అతడి కలలు కల్లోలం అయ్యాయి. జీవితాంతం తోడు ఉంటానన్న వ్యక్తి ఇలా జీవితం మధ్యలో నుండి వెళ్లి పోవడంతో అతడి గుండె పగిలిపోయింది. ఆ ఆవేదన తనని దహించి వేసింది. ఆ మనోవేదనతో రైలుకు ఎదురుగా వెళ్లి ప్రాణాలు తీసుకున్నాడు.
ఇద్దరి మృతితో 9 నెలల చిన్నారి అనాథగా మారింది. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుఫ్రాఖుర్దు గ్రామంలో జరిగింది. మృతిచెందిన దంపతులు భార్య పేరు కసబ్ మమత కాగా, భర్త పేరు బాలకృష్ణ. వీరికి 9 నెలల పాప కూడా ఉంది. అనారోగ్యంతో చని పోయిన మమత మృత దేహానని బంధువులు కారులో తీసుకు వస్తుండగా.. ముందుగా ఇంటికి వెళ్లి అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు చేస్తానని చెప్పాడు బాలకృష్ణ. ఏర్పాట్లు చేస్తానని చెప్పి వెళ్లిన బాలకృష్ణ.. కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. శంషాబాద్ మండలం తొండుపల్లి వద్ద రైలుకు ఎదురుగా వెళ్లి సూసైడ్ చేసుకున్నాడు. ఇద్దరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల మృతితో 9 నెలల చిన్నారి అనాథగా మారింది.