Road Accidents: తెలంగాణలో రెండు చోట్ల రోడ్డు ప్రమాదాలు - ఐదుగురు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు!
Road Accidents: రాష్ట్రంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఐదుగురు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డిలో ముగ్గురు, సూర్యాపేట ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు.
Road Accidents: రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని డీసీఎం వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కథనం ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ మండలం కడియాల కుంట తండాకు చెందిన గోపాల్ నాయక్(47), అంజలి( 42), స్వాతి(9)లు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని డీసీఎం బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే డీసీఎం వేగంగా రావడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురూ రోడ్డ ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి.
అంతుకు 45 నిమిషాల ముందే ఆరోడ్డుపై సీఎం కేసీఆర్..
అయితే అదే రహదారిపై ప్రమాదం జరగడానికి 45 నిమిషాల ముందు సీఎం కేసీఆర్ వెళ్లడంతో రోడ్డంతా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ క్రమంలోనే వేగంగా వచ్చిన గుర్తు తెలియని డీసీఎం.. అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సూర్యాపేట ప్రమాదంలో తండ్రీ కుమారుల మృతి..
సూర్యాపేట జిల్లాలో కూడా ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కుమారుడితో సహా దంపతులు బైకుపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భర్త, కుమారుడు అక్కడికి అక్కడే చనిపోగా.. భార్య మాత్రం ప్రాణాలతో రక్తపు మడుగులో పడి ఉంది. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు అంటే భార్య, కుమారుడితో కలిసి బైకుపై మిర్యాలగూడకు బయలుదేరారు. ఈ క్రమంలోనే రామగిరి వద్ద గల హుజూర్ నగర్ - మిర్యాల గూడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
తీవ్ర విషాధంలో గ్రామస్థులు..
ఈ ప్రమాదంలో భర్త, కుమారుడు అక్కడి కక్కడే చనిపోయారు. భార్య మాత్రం కొన ఊపిరితో రక్తపు మడుగులో పడి ఉంది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మహిళను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం కోసం సత్య నారాయణ, ఆయన కుమారుడు మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఒకే రోజు మృతి చెందడంతో గ్రామంలో విషాధ ఛాయలు అలముకున్నాయి. ఒకరోజు తండ్రీ, కుమారులు చనిపోవడం, భార్య తీవ్రంగా గాయపడడం దారణం అంటూ గ్రామస్థులు అంతా కంటతడి పెట్టారు.