Hyderabad News: ప్రియుడితో కలిసి భర్తను చంపించి గుండెపోటని నమ్మించింది - నిందితుడి పశ్చాత్తాపంతో ఆలస్యంగా వెలుగులోకి!
Telangana News: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చి గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది ఓ భార్య. చివరకు నిందితుడు పశ్చాత్తాపంతో పోలీసులకు లొంగిపోగా.. విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
Wife Killed Husband: ప్రియుడి మోజులో పడి ఓ మహిళ కట్టుకున్న భర్తనే కడతేర్చింది. భర్తను చంపి ఆస్తి అమ్ముకొని ఆ డబ్బుతో ఎంజాయ్ చేద్దామని అనుకొంది. అనుకున్నట్లుగానే ప్లాన్ ప్రకారం ప్రియుడితో కలిసి రౌడీ షీటర్లకు సుపారీ ఇచ్చి భర్తను దారుణంగా హతమార్చింది. బాత్ రూంలో గుండెపోటుతో కుప్పకూలి తలకు తీవ్ర గాయాలై చనిపోయినట్లు బంధువులు సహా అందరినీ నమ్మించింది. దహన సంస్కారాలు సైతం పూర్తి చేసింది. 3 నెలల కిందట ఈ ఘటన జరగ్గా.. నిందితుల్లో ఒకడు పశ్చాత్తాపంతో పోలీసులకు లొంగిపోవడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఈ దారుణ ఘటన నగరంలోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
భర్త అడ్డుగా ఉన్నాడని భావించి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిగూడ జయప్రకాశ్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉండే సీసీ కెమెరా టెక్నీషియన్ విజయ్ కుమార్ (40)కు భార్య శ్రీలక్ష్మి (33), ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. అయితే, బోరబండకు చెందిన రాజేశ్ (30)తో శ్రీలక్ష్మి పెళ్లికి ముందు నుంచే ప్రేమలో ఉంది. వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. తమ మధ్య భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన శ్రీలక్ష్మి.. అతన్ని చంపాలని ప్లాన్ చేసింది. భర్త పేరిట మేడ్చల్, ఎల్లారెడ్డిగూడలో సొంత ఇళ్లు ఉన్నాయి. భర్తను హతమార్చి.. ఆస్తిని అమ్ముకుని ఆ డబ్బుతో ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసింది. ఇదే విషయం రాజేశ్ కు చెప్పడంతో అతను సరేనన్నాడు. ఇందుకోసం తనకు పరిచయం ఉన్న సనత్ నగర్ కు చెందిన పటోళ్ల రాజేశ్వర్ రెడ్డితో సుపారీ మాట్లాడాడు. రాజేశ్వర్ రెడ్డి సూచనతో మహ్మత్ మెహ్తాబ్ అలియాస్ బబ్బన్ ను సైతం హత్య కోసం సంప్రదించి సుపారీ ఇచ్చాడు.
చంపొద్దని ప్రాథేయపడినా..
ఎల్లారెడ్డిగూడలో ఉంటున్న ఇల్లు వాస్తు బాగోలేదని చెప్పి అపార్ట్ మెంట్ కు మకాం మార్చి భార్య శ్రీలక్ష్మి భర్త విజయ్ కుమార్ హత్యకు ప్లాన్ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న విజయ్ కుమార్ తన పిల్లల్ని పాఠశాలలో దింపేందుకు వెళ్లాడు. అప్పటికే ఇంటి సమీపంలో మాటు వేసి ఉన్న రాజేశ్, పటోళ్ల రాజేశ్వర్ రెడ్డి, మైతాబ్ ను ఇంటికి పిలిపించిన శ్రీలక్ష్మి వారిని బాత్ రూంలో దాచింది. పిల్లల్ని స్కూల్లో దింపి ఇంటికి రాగానే శ్రీలక్ష్మి లోపలి నుంచి గడియపెట్టింది. అప్పటికే బాత్ రూంలో ఉన్న ముగ్గురూ.. డంబెళ్లు, ఇనుప రాడ్లతో విజయ్ పై దాడికి పాల్పడ్డారు. దీంతో తనను చంపొద్దని.. కావాలంటే కొట్టి వదిలేయాలని ప్రాథేయపడ్డాడు. అయినా వాటిని పట్టించుకోకుండా ముగ్గురూ అతన్ని దారుణంగా హతమార్చి మృతదేహాన్ని బాత్ రూంలో పడేసి వెళ్లిపోయారు.
గుండెపోటని నమ్మించి..
అనంతరం, శ్రీలక్ష్మి ఇంట్లో రక్తపు మరకలను తుడిచేసి, భర్త మృతదేహంపై దుస్తులు మార్చి.. తన భర్త బాత్ రూంలో గుండెపోటుతో కుప్పకూలి గోడకు తగిలి పడిపోయి చనిపోయాడని అందరినీ నమ్మించింది. అదే రోజు కుటుంబ సభ్యులు, బంధువులను పిలిపించి అంత్యక్రియలు సైతం పూర్తి చేయించింది. మృతుడి కుటుంబంలో చనిపోయిన వారిని పూడ్చిపెట్టి అంత్యక్రియలు చేయాల్సి ఉండగా.. విజయ్ మృతదేహానికి మాత్రం దహన సంస్కారాలు చేసింది. పథకంలో భాగంగానే ఆధారాలు చిక్కకుండానే ఇలా చేసినట్లు తెలుస్తోంది.
నిందితుడి పశ్చాత్తాపంతో..
అయితే, విజయ్ గుండెపోటుతో చనిపోలేదని.. తామే హత్య చేశామని నిందితుడు రాజేశ్వర్ రెడ్డి గురువారం మధురానగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. జరిగిన విషయమంతా వారికి చెప్పాడు. మూడున్నర నెలలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయానని.. విజయ్ ను కొడుతుండగా తనను చంపొద్దని వేడుకోవడం పదే పదే గుర్తొచ్చి పశ్చాత్తాపంతో కుంగిపోతున్నట్లు తెలిపాడు. విజయ్ ను హత్య చేసినప్పటి నుంచి తమకు మనశ్శాంతి లేకుండా పోయిందని.. అందుకే నేరాన్ని అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నాడు. అతను ఇచ్చిన సమాచారంతో శ్రీలక్ష్మి, రాజేష్, బబ్బన్ లను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. హత్య కేసుతో పాటు సాక్ష్యాలు లేకుండా చేసినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, సుపారీ పంపకాల్లో తేడాలు ఏమైనా వచ్చాయా.? అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.