(Source: ECI/ABP News/ABP Majha)
Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు
చిత్తూరు జిల్లాలో ఇంటర్ విద్యార్థిని మృతి కలకలం రేపుతుంది. ఆత్మహత్యా? హత్యా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను అత్యాచారం అంటూ చంపారంటూ కుల సంఘాలు ఆందోళనకు దిగాయి.
Chittoor Inter Student Death:
ఇంటర్ విద్యార్ధిని అనుమానాస్పద మృతి చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ కుల సంఘాల నేతలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. అత్యాచారం చేసి చంపేశారంటూ కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. మరి పోలీసులు ఏమంటున్నారు..? ఇంతకీ ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందా? అనే ఇంకేమైనా జరిగిందా? పోస్టుమార్టంలో రిపోర్టులో తేలిన వివరాలిలా ఉన్నాయి.
అసలు ఏం జరిగిందంటే..!
చిత్తూరు జిల్లా వేణుగోపాలపురం గ్రామంలో ఈ విషాదం జరిగింది. పెనుమూరు మండలం కావూరివారిపల్లె పంచాయతీలోని వేణుగోపాలపురం గ్రామానికి చెందిన 16ఏళ్ల బాలిక పెనుమూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈనెల 16వ తేదీన ఇంటి నుండి వెళ్లిన విద్యార్థిని మళ్లీ తిరిగి రాలేదు. కూతురు కనిపించక పోవడంతో బంధుమిత్రులతో కలిసి చుట్టుపక్క ప్రాంతాల్లో గాలించాడు ఆమె తండ్రి. కుమార్తె కనిపించడం లేదని పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ క్రమంలో వేణుగోపాలపురంలో వినాయక నిమర్జనం జరుగుతోంది. గ్రామంలోని గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు కొందరు యువకులు.. ఊరి సమీపంలోని ఓ బావి వద్దకు వెళ్లారు. ఆ బావిలో బాలిక మృతదేహం చూసి కేకలు పెట్టారు. గ్రామనికి చేరుకుని విషయం చెప్పగా... అందరూ బావి దగ్గరకు పరుగుపెట్టారు. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. అందరూ కలిసి బావిలోని విద్యార్థిని డెడ్ బాడీని బయటకు తీశారు. ఆ మృతదేహం మిస్సింగ్ అయిన బాలికదేనని గుర్తించారు. కుమార్తె చనిపోయిందని తెలిసి... విద్యార్థిని కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆమెది ఆత్మహత్య అని తేలింది.
బావిలో నుంచి బాలిక మృతదేహం బయటకు తీసినప్పుడు... తలపై వెంట్రుకలు పూర్తిగా రాలిపోయి గుండులా కనిపించడంతో అనుమానం మొదలైంది. బాలిక ధరించిన లెగ్గిన్ సైతం లేదు అని, నాలుక కూడా కోసినట్టు ఉండటంతో గ్రామస్తులతో పాటు బాలిక తల్లిదండ్రులు ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని... ఎవరో రేప్ చేసి చంపేశారని ఆరోపించారు. పోలీసులు నిందితులతో చేతులు కలిసి.. తమకు అన్యాయం చేస్తున్నారని గ్రామస్తులతో కలిసి పోలీస్‌స్టేసన్‌ను ముట్టడించిచారు. తమకు న్యాయం చేయాలని... కుమార్తెను చంపిన నిందితులను గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
మైనర్ బాలిక మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని, రాజకీయ నాయకుల ప్రోద్భలంతోనే తమ కులానికి చెందిన యువతి మృతి కేసును పోలీసులు నీరుగారుస్తున్నారంటూ వడ్డెర సంఘ నాయకులు పెనుమూరు పోలీసు స్టేషను ముట్టడించారు. ఆమె చదివే కళాశాలో నలుగురు విద్యార్ధులు తరచూ బాలికను ఇబ్బంది పెట్టేవారని ఆరోపించారు. ఆ నలుగురు యువకులే అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానితులపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని మండిపడుతున్నారు. పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని... ఎస్పీ, కలెక్టర్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని డిమండ్ చేశారు. చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి వడ్డెర సంఘం నాయకులను నచ్చజెప్పి శాంతింపజేశారు.
ఇక, పోస్టుమార్టం రిపోర్టులో మూడ్రోజులుగా నీటిలోనే ఉన్నందున జుట్టు ఊడిపోయిందని, ప్రాథమికంగా ఎలాంటి గాయాలు లేవని వచ్చిందని చెప్తున్నారు పోలీసులు. కుటుంబసభ్యులు మాత్రం అందులో నిజం లేదని రేప్ చేసి కళ్లు పీకి దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. అనుమానితులను వేంటనే అదుపులోకి తీసుకుని విచారణ జరపాలని డీఎస్పీ ఆదేశించడంతో వడ్డెర సంఘం నాయకులు శాంతించారు. వడ్డెర సంఘం నాయకులతో పాటు బాలిక మృతదేహం లభించిన బావి వద్దకు వెళ్లి.. సంఘటనాస్థలిని పరిశించారు చిత్తూరు డీఎస్పీ. ఇద్దరు యువకులను అమానితులుగా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. తిరుపతి ల్యాబ్ నుండి రిపోర్ట్ వస్తే.. బాలిక మృతిపై క్లారిటీ వస్తుందని చెప్తున్నారు పోలీసులు.