Private Travels Accident: శ్రీకాకుళం జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం, 22 మందికి గాయాలు, కొందరి పరిస్థితి విషమం
Srikakulam Road Accident: శ్రీకాకుళం జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.
Srikakulam Road Accident: శ్రీకాకుళం జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 22 మంది వరకు ప్రయాణికులు గాయపడ్డారని సమాచారం. నందిగాం మండలం గొల్లవూరు సమీపంలో ఈ ఘటన జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం..
ఒడిశా రాష్ట్రం కటక్ నుంచి బెంగుళూరుకు కొందరు వలస కూలీలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు. మార్గం మధ్యలో వీరు ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా (Private Travels Overturns at Nandigam in Srikakulam District) పడింది. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం గొల్లవూరు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇరవై రెండు మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు, 8 మంది మహిళలు, 12మంది పురుషులు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 39 మంది వరకు ఉన్నట్లు సమాచారం.
అతివేగమే కారణమా.. ?
రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఐదు అంబులెన్స్ లలో టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నందిగాం పోలీసులు, హైవే సిబ్బంది ఈ సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిద్ర మత్తు, అతివేగం ప్రమాదానికి కారణం కావొచ్చునని ప్రాథమికంగా భావిస్తున్నారు. టెక్కలిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి పోలీసులు తరలించారు.
Also Read: Alluri District News : అల్లూరి జిల్లాలో విషాదం, వాలమూరు వాగులో ఇద్దరు యువకులు గల్లంతు