Kolkata: కోల్‌కతా కేసులో మరో మలుపు, హత్యాచారానికి ముందు రోజు డాక్టర్‌ని వేధించిన నిందితుడు - సీసీటీవీ ఫుటేజ్ సంచలనం
Kolkata Case: కోల్‌కతా కేసులో మరో కీలక విషయం బయట పడింది. అత్యాచారానికి పాల్పడే ముందు రోజు డాక్టర్‌ని వేధించినట్టు నిందితుడు పోలీసుల ఎదుట అంగీకరించాడు.
Kolkata Doctor Case Updates: కోల్‌కతా కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 9వ తేదీన హత్యాచారం జరిగే ముందు రోజు అంటే ఆగస్టు 8వ తేదీన ట్రైనీ డాక్టర్‌ని నిందితుడి సంజయ్ రాయ్ వేధించినట్టు తేలింది. చెస్ట్ మెడిసిన్ వార్డ్‌లో ఆమె పని చేస్తూ ఉండగా వేధించినట్టు వెల్లడైంది. ఈ విషయాన్ని నిందితుడు అంగీకరించాడు. కోల్‌కతా పోలీసులకు ఇదంతా వివరించాడు. నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం ఆగస్టు 8వ తేదీన చెస్ట్ వార్డ్ వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్‌ని పోలీసులు పరిశీలించారు. బాధితురాలితో పాటు మరో నలుగురు జూనియర్ డాక్టర్‌లను నిందితుడు గుచ్చిగుచ్చి చూసినట్టు అందులో రికార్డ్ అయింది. వాళ్లు ఇబ్బంది పడేలా పదేపదే చూసినట్టు గుర్తించారు. మరుసటి రోజు ఆగస్టు 9వ తేదీన సంజయ్ రాయ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆగస్టు 9వ తేదీన అర్ధరాత్రి 1 గంటకు డిన్నర్ కోసం బాధితురాలు సెమినార్ హాల్‌కి వెళ్లింది. 2.30 గంటలకు ఓ డాక్టర్‌తో మాట్లాడింది. ఆ తరవాత అక్కడే విశ్రాంతి తీసుకుంది. ఆమె ఒంటరిగా ఉన్న సమయం చూసి నిందితుడు హత్యాచారం చేశాడు. తెల్లవారుజామున 4 గంటలకు సంజయ్ రాయ్ హాస్పిటల్‌లోకి వచ్చినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు.
ఇక సీబీఐ విచారణలో సంజయ్ రాయ్ గురించి మరి కొన్ని సంచలన విషయాలు తెలిశాయి. అతని బుర్రంతా కామంతో నిండిపోయిందని, మొబైల్ నిండా బూతు వీడియోలున్నాయని అధికారులు వెల్లడించారు. సైకో అనాలసిస్ టెస్ట్ రిపోర్ట్‌లోనూ ఇదే ప్రస్తావించారు. అశ్లీల వీడియోలు చూడడానికి బాగా అలవాటు పడిపోయాడని, అదో వ్యసనంగా మారిందని పేర్కొన్నారు. మనిషిలా కాకుండా మృగంలా ప్రవర్తిస్తున్నాడని రిపోర్ట్ వెల్లడించింది. ఇంత దారుణం చేసినా ఎక్కడా తనలో పశ్చాత్తాపం కనిపించ లేదని,అసలు అతనికి ఎలాంటి ఎమోషన్స్ లేవని స్పష్టం చేసింది. ఎక్కడా తడుముకోకుండా తాను ఏం చేశాడన్నది మొత్తం వివరించినట్టు అధికారులు తెలిపారు. ఆగస్టు 9వ తేదీన ఈ ఘటన జరగ్గా సీసీటీవీ ఫుటేజ్, బ్లూటూత్ డివైజ్ ఆధారంగా పోలీసులు సంజయ్ రాయ్‌ని అరెస్ట్ చేశారు. చనిపోయే ముందు బాధితురాలి అత్యాచారానికి గురైనట్టు అటాప్సీ రిపోర్ట్ వెల్లడించింది. శరీరంపై మొత్తం 16 లోతైన గాయాలు కనిపించాయి. లోపల మరో 9 గాయాలయ్యాయి.