Hyderabad Fraud: మేనమామ, మేనల్లుళ్ల బొగ్గు బిజినెస్.. చిల్లిగవ్వ లేకపోయినా లక్షల్లో పెట్టుబడులు, చివరికి..
మేనమామ, ముగ్గురు అల్లుళ్లు నిజామాబాద్ నుంచి వచ్చారు. తాము బొగ్గు వ్యాపారం చేస్తుంటామని.. తమ బిజినెస్‌లో పెట్టుబడి పెడితే ప్రతి నెల 5 శాతం లాభం ఇస్తామని జనాలను నమ్మించారు.
నిజామాబాద్ నుంచి నగరానికి వచ్చిన మామా అల్లుళ్లు హైదరాబాద్‌లో అనేక మందిని ముంచారు. అధిక లాభాలంటూ జనాలను నమ్మించి వారిని దోచుకున్నారు. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాము వ్యాపారం చేస్తున్నామని పెట్టుబడి పెడితే మరిన్ని లాభాలు పొందవచ్చంటూ జనాలను నమ్మించారు. వారి మాటలు నమ్మేసిన పలువురు డబ్బులు వారి చేతికి అప్పగించగా.. చివరికి మొహం చాటేశారు. తొలుత లాభాలు అందించడం ద్వారా మరింత మందికి నమ్మకం కలిగించి ఈ ముఠా చివరికి అందినకాడికి దోచుకొని పత్తా లేకుండా పోయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మేనమామ, ముగ్గురు అల్లుళ్లు నిజామాబాద్ నుంచి వచ్చారు. తాము బొగ్గు వ్యాపారం చేస్తుంటామని.. తమ బిజినెస్‌లో పెట్టుబడి పెడితే ప్రతి నెల 5 శాతం లాభం ఇస్తామని జనాలను నమ్మించారు. ఈ క్రమంలోనే వివిధ వ్యక్తుల నుంచి ఏకంగా రూ.61.90 లక్షలు కూడగట్టారు. లాభాలు ఇవ్వకపోడంతో ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను బంజారాహిల్స్ పోలీసులు శనివారం విలేకరులకు వివరించారు.
నిజామాబాద్ జిల్లా ముస్తయిద్ పురకు చెందిన సొహైల్ సలామ్‌తో పాటు అతని మేనల్లుళ్లు హైదరాబాద్‌కు వచ్చారు. ఎంటెక్ చదివిన మహ్మద్ అబ్దుల్ అహద్ సయీఫ్, బీటెక్ చదివిన మహ్మద్ అబ్దుల్ వాహబ్ సుబూర్ నిరుద్యోగులుగా ఉన్నారు. మరో మేనల్లుడు అనాస్ డిగ్రీ చదువుతున్నాడు. నలుగురు బొగ్గు వ్యాపారం పేరుతో గత ఫిబ్రవరిలో హైదరాబాద్‌లోని హకీంపేటకు వచ్చారు. ముంతాజ్ ట్రేడర్ చార్‌కోల్ పేరుతో వ్యాపారం మొదలుపెట్టారు. అయితే, పెట్టుబడి కోసం ఇతరులను ఆశ్రయించారు. పెట్టిన పెట్టుబడిపై ప్రతి నెల 5 శాతం లాభాలు ఇస్తామంటూ అందర్నీ నమ్మించారు. స్థానికులైన మీర్ ఫరాసత్ అలీ, అతని సోదరి నుంచి దాదాపు రూ.17.90 లక్షలు, ఎంఎ.నయీం రూ.15 లక్షలు, మహ్మద్ అబ్దుల్ రహీం ఖురేషీ రూ.7 లక్షలు, షేక్ అమీర్ రూ.5 లక్షలు, ఖమర్ ఖాన్ రూ.10 లక్షలు, షేక్ అజీజ్ రూ.2.5లక్షలు, మహ్మద్ హబీబ్‌ల నుంచి రూ.4.5లక్షలు వసూలు చేశారు.
తన వ్యాపార కార్యకలాపాల నిమిత్తం కటికం శ్రీకాంత్ అనే వ్యక్తి నుంచి స్విఫ్ట్ కారు, సయీద్ సిద్దిఖీ నుంచి యాక్టివా వాహనాన్ని సేకరించారు. కొద్ది నెలలు వారు ఇచ్చిన మాట ప్రకారమే మీర్ ఫరాసత్ అలీకి 5 శాతం లాభాలను ఇచ్చారు. దీంతో అందరికీ నమ్మకం కలిగింది. దీంతో ఇది చూసి మిగతా వారు కూడా వీరి దగ్గర పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు. చాలా మంది వీరి వద్ద డబ్బులు పెట్టుబడి పెట్టారు. కానీ, కొద్ది రోజుల తర్వాత దుకాణం తెరవకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో అందరికీ అనుమానం వచ్చింది. మోసపోయామని తెలుసుకొని పెట్టుబడిదారులంతా ఈ నెల 4వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో విచారణ జరిపిన పోలీసులు శనివారం మహ్మద్ అబ్దుల్ వాహబ్ సుబూర్‌ను అరెస్ట్ చేశారు. కారు, బైక్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. సయీఫ్ ఈ కేసులో ప్రధాన నిందితుడని, పెళ్లి పేరుతో ఓ యువతికి దగ్గరై, వ్యాపారం కోసమని రూ.10 లక్షలు తీసుకొని మోసానికి పాల్పడ్డాడని నిజామాబాద్‌లో మరో ఫిర్యాదు నమోదైంది. ఆమె కుటుంబ సభ్యులు నిజామాబాద్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు.