News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Kamareddy News: చీప్‌ లిక్కర్‌ కొరతతో గ్రామాల్లో గుప్పుమంటున్న గుడుంబా!

Kamareddy News: కామారెడ్డి జిల్లాలో చీప్ లిక్కర్ దొరకడం లేదు. దీంతో ప్రజలంతా నాటుసారా వైపు మళ్లారు. ఎక్కడికక్కడ గుడుంబా, దేశిదారును జిల్లాల్లోకి డంప్ చేస్తున్నారు. 

FOLLOW US: 
Share:

Kamareddy News: కామారెడ్డి జిల్లాలోని పల్లెల్లో, మారుమూల తండాల్లో మళ్లీ గుడుంబా కిక్కు మొదలైంది. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న నాటుసారా తయారీ మళ్లీ జోరందుకుంది.. గుడుంబా తయారీదారులు గుట్టుచప్పుడు కాకుండా రెడీ చేసి రహస్యంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ దందా సాగిస్తున్నారు.

చీప్‌ లిక్కర్‌ కొరత, మద్యం ధరలు  పెరగడంతో... పేద, మధ్య తరగతి ప్రజలు నాటుసారా వైపు మళ్లుతున్నారు. గుడుంబా కేవలం పల్లెలు, తండాలకే పరిమితం కాకుండా ఇప్పుడు పట్టణాలకు సైతం పాకింది. పొరుగు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటకలో మద్యం ధరలు తక్కువగా ఉండడం, దేశిదారును సరిహద్దులు దాటి జిల్లాలోకి భారీగా డంప్ చేస్తూ... అమ్మకాలు జరుపుతున్నారు.

ఇదంతా ఎక్సైజ్‌, పోలీసు శాఖలోని కొందరు అధికారులు, సిబ్బంది కనుసన్నల్లోనే దందా నడుస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాలే కాకుండా జిల్లా నలుమూలాల గుడుంబా, దేశిదారు అమ్మకాలు జోరుగా సాగుతుండడంతో జిల్లాలో మద్యం అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడుతుందని మద్యం వ్యాపారులు చెబుతున్నారు. గుడుంబా, దేశిదారు సరఫరాపై సంబంధిత ఎక్సైజ్‌ అధికారులు మూలాలపై దృష్టి పెట్టకుండా అడపాదడప దాడులు చేస్తూ అమ్మకం దారులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

జిల్లాలో నాటుసారా తయారీ...

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సారా విచ్చలవిడిగా తయారవుతోంది. గుట్టుచప్పుడు కాకుండా ప్లాస్టిక్‌ కవర్లలో నింపి రవాణా చేస్తున్నారు. ఎల్లారెడ్డి, గాంధారి, మాచారెడ్డి, రామారెడ్డి, రాజంపేట, జుక్కల్‌, పిట్లం, పెద్ద కొడప్‌గల్‌, మద్నూర్‌, బిచ్కుంద, బాన్సువాడ తదితర మండలాల్లోని మారుమూల గ్రామాల్లో, అటవీ ప్రాంతాల్లో గుడుంబా తయారీ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ద్విచక్ర వాహనాలపై ఇతర గ్రామాలు, పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. కొందరు సారా తయారీనే వృత్తిగా మలుచుకొని పెద్ద ఎత్తున తయారు చేసి అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు తమ కోసం ఇప్ప పువ్వుతో మేలిరకం సారా తయారు చేసుకుని తాగుతుండగా మరికొందరు ఇప్పపువ్వుతో పాటు బెల్లం, కుళ్లిన అరటి పండ్లు, ఇతర మత్తు పదార్థాలతో గుడుంబా తయారు చేసి దందా సాగిస్తున్నారు. 

జిల్లాలోని ఆయా వైన్స్‌లలో చీప్‌ లిక్కర్‌ కొరత ఏర్పడుతోంది. గత నెలరోజులుగా వైన్స్‌లలో చీప్‌ లిక్కర్‌ దొరకడం లేదు. నిజామాబాద్‌ జిల్లాలో ఉండే ఐఎంఎల్‌ డిపో నుంచి జిల్లాలోని 49 వైన్స్‌లతోపాటు 8 బార్లకు సరఫరా అవుతోంది. అయితే గత నెలన్నరగా ఐఎంఎల్‌ డిపోలో చీప్‌ లిక్కర్‌ కొరత ఏర్పడుతోంది. గత రెండు నెలల నుంచి డిస్ట్రిలరీస్‌ ద్వారా చీప్‌ లిక్కర్‌ సరఫరా పూర్తిస్థాయిలో జరగకపోవడంతో డిపోలో కొరత ఏర్పడుతుందని సంబంధిత శాఖ అధికారులు, మద్యం వ్యాపారులు చెబుతున్నారు. దీంతో పాటు దూర ప్రాంతాలకు సరఫరా చేసే దగ్గర రవాణా చార్జీల పరంగా గిట్టుబాటు కావడం లేదని మద్యం వ్యాపారులు వెనకంజ వేస్తున్నారు. ఈ ప్రభావం కారణంగా ప్రస్తుతం క్షేత్రస్థాయిలో చీప్‌ లిక్కర్‌ కొరత కనిపిస్తోంది. 

నాటు సారా, దేశీ దారు కు మొగ్గు..

చీప్‌ లిక్కర్‌ కొరత ఏర్పడడం, మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన కొందరు మత్తు కోసం సారాకు అలవాటు పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మద్యం తాగాలంటే వందల రూపాయలు వెచించాల్సి వస్తోంది. క్వాటర్‌ మద్యం కొనాలన్నా రూ.100కు పైగానే ఖర్చవుతోంది. ఇలాంటి సమయంలో తక్కువ ధరలో దొరుకుతున్న గుడుంబా తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో పేదలు, కూలీలు నివసించే పలు కాలనీల్లో గుడుంబా, సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అలాగే ఎల్లారెడ్డి, బాన్సువాడ పట్టణాలతో పాటు పలు మండలాల్లోనూ గుడుంబా అమ్మకాలు గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో మద్యం ధరలు చాలా తక్కువగా ఉండడంతో అక్కడి నుంచి దేశిదారును అక్రమంగా జిల్లా సరిహద్దులకు సరఫరా చేస్తున్నారు.

ప్రధానంగా జుక్కల్‌, మద్నూర్‌, పిట్లం, బిచ్కుంద, నిజాంసాగర్‌ మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దేశిదారు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మండలాలకు చెందిన గ్రామీణ ప్రాంత ప్రజలు కర్ణాటక, మహారాష్ట్ర ఏదో ఒక పనిమీద వెళుతూ అక్కడి నుంచి దేశిదారు మద్యాన్ని గుట్టుగా తీసుకువచ్చి తాగుతుండడమే కాకుండా అమ్మకాలు జరుపుతున్నట్లు ఎక్సైజ్‌ శాఖలోని కొందరు సిబ్బంది చెబుతున్నారు. 

నాటు సారా తయారిపై నిఘా కరవు..

జిల్లాలో నిషేధిత గుడుంబా, దేశిదారుపై ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక నిఘా పెట్టలేకపోతుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా నాటుసారా తయారు చేసే మూలాలపై సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించకపోవడంతో విచ్చల విడిగా నాటుసారా తయారవుతుందనే వాదన వినిపిస్తోంది. సారా అమ్మకాలు ఆగాలంటే తయారీ మూలాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

గుట్టుగా తయారీ చేస్తూ వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. కొందరు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో గుడుంబాను పెద్దఎత్తున తయారు చేస్తు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వర్షాకాలం సీజన్‌ కావడంతో పంట చేన్ల వద్ద గుట్టుగా తయారు చేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు ఎక్సైజ్‌ అధికారులు తండాలపై దాడులు నిర్వహించి సారా అమ్మకాలను వెతుకుతున్నారు. మూలాలను వెతక‌్కుండా ఎక్కడో ఒకచోట దాడులు నిర్వహిస్తున్నారు. సారా ఎక్కడ తయారు చేస్తున్నారో గుర్తించి పక్కా వ్యూహంతో దాడులు చేస్తే అసలు నిందితులు దొరికే అవకాశం ఉంది.

అదేవిధంగా సరిహద్దు ప్రాంతాలపై నిఘాపెట్టి దేశిదారు జిల్లాకు సరఫరా కాకుండా అడ్డుకట్ట వేయాలని మద్యం వ్యాపారులు సైతం కోరుతున్నారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర లో దేశిదారు విచ్చల విడిగా అమ్ముతారు. మహారాష్ట్ర నుంచి ఇటీవల దేశిదారు ఎక్కువగా దిగుమతి చేస్తున్నారు. మరోవైపు కల్తీ కల్లు విక్రయాలు కూడా పెరిగిపోయాయి.

Published at : 06 Oct 2022 04:54 PM (IST) Tags: Kamareddy District Gudumba News Kamareddy District News Gudumba Sales High Kamareddy Cirme News

ఇవి కూడా చూడండి

Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ

Mobiles hunt by Nellore Police: నెల్లూరులో మొబైల్ హంట్, రూ.1.25 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ

మణిపూర్‌ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం

మణిపూర్‌ జంటపై దుండగులు దాడి, అర్ధరాత్రి నడివీధిలోకి లాక్కొచ్చి దారుణం

ఆన్‌లైన్‌లో మెక్సికన్‌ మహిళతో పరిచయం,ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం - నిందితుడు అరెస్ట్

ఆన్‌లైన్‌లో మెక్సికన్‌ మహిళతో పరిచయం,ఇంటికి వెళ్లి పలుమార్లు అత్యాచారం - నిందితుడు అరెస్ట్

Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో

Hanamkonda News: సీఐ కొడుకు ర్యాష్ డ్రైవింగ్, స్పాట్‌లో మహిళ మృతి, షాకింగ్ వీడియో

Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య

Andhra News: బ్యాంకులో రూ.4 కోట్ల విలువైన బంగారం మాయం - మహిళా అధికారి ఆత్మహత్య

టాప్ స్టోరీస్

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Dil Raju : 'యానిమల్' లాంటి సినిమాల్ని మేమూ తీస్తాం - ‘గేమ్ ఛేంజర్’ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Yash 19: కొత్త సినిమాపై హింట్ ఇచ్చిన రాకీ భాయ్ - ఫ్యాన్స్‌కు పూనకాలే

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?

Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
×