Kakinada Crime News: బంగారం, వెండి లక్ష్యంగా ఇళ్లలో చోరీలు - ఇద్దరి అరెస్ట్, అరకేజీ బంగారం, 11 కిలోల వెండి స్వాధీనం
Kakinada Crime News: ఇళ్లలో ఉండే బంగారం, వెండే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి అరకిలో బంగారం, 11 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు.
Kakinada Crime News: వారి కన్ను పడిందంటే చాలు. ఇంట్లో ఎక్కడో మూలన ఉన్న బంగారం, వెండిని కూడా మటుక్కున్న మాయం చేస్తారు. కేవలం ఇళ్లల్లోని బంగారం, వెండి వస్తువులే లక్ష్యంగా చేసుకుని చెలరేగిపోయే ఈ ఘరానా దొంగలు. ఇప్పటికే 65 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరిపై నిఘా పెట్టిన కాకినాడ జిల్లా పోలీసులు. చివరకు ఘరానా దొంగలుగా ముద్రపడిన ఇద్దరిని ప్లాన్ చేసి పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి అరకేజీకు పైగా బంగారం, 11 కేజీలకు పైగా వెండి, రూ.2 లక్షల విలువగల విదేశీ కరెన్సీను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘరానా దొంగల నుంచి మొత్తం రూ.44 లక్షలు రూపాయలు విలువగల బంగారం, వెండి, విదేశీ కరెన్సీని రికవరీ చేశారు. దొంగలను రిమాండ్‌కు పంపినట్లు ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ తెలిపారు.
ఇద్దరూ ఘరానా దొంగలే..
ఈ కేసులో ఎట్టకేలకు పట్టుబడ్డ నిందితులు ఇద్దరూ గతంలో అనేక కేసుల్లో ఉన్న దొంగలేనని పోలీసులు తెలిపారు. 65 కేసులకుపైగా వీరిపై ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లులో కేసులు ఉన్నాయి అన్నారు. కాకినాడ జిల్లా కాజులూరు గ్రామానికి చెందిన షేక్ అజీజ్ అలియాస్ నాని ప్రస్తుతం బమ్మూరులో ఉంటున్నాడు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి సమీపంలోని కొత్తపేటకు చెందిన యడ్ల ఉమా సూర్య వెంకట రాజేష్ అలియాస్ చిన్ని అలియాస్ రాకేష్ అనే ఈ ఇద్దరూ.. దొంగతనాలకు పాల్పడ్డారని ఎస్పీ వెల్లడిరచారు. వీరిద్దరిపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా ప్రణాళికతో అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వీరిని పెద్దాపురం జెఎఫ్‌సీఎం కోర్టులోని న్యాయమూర్తి ముందు హాజరు పరచగా కోర్టు రిమాండ్ విధించినట్లు తెలిపారు.
మరో రెండు కేసుల్లో ఇద్దరి అరెస్ట్..
కాకినాడ జిల్లా జగ్గంపేట బస్టాండ్ వద్ద ఓ మహిళ మెడలో ఉన్న ఏడు కాసుల బంగారాన్ని అపహరించిన కేసులో నిందితుడు అరెస్టయ్యాడు. అనకాపల్లి జిల్లా కృష్ణాపురంకు చెందిన పారిపల్లి దుర్గ అలియాస్ చిన్న దుర్గ అలియాస్ పొట్టి దుర్గను అరెస్ట్ చేసి ఆమె వద్దనుంచి ఏడు కాసుల బంగారు గొలుసును రికవరీ చేసినట్లు తెలిపారు. అదే విధంగా సామర్ల కోటలోని యూనియన్ బ్యాంకు వద్ద మార్చి 18వ తేదీన స్కూటీ డిక్కీలో ఉంచిన రూ.7 లక్షలు అపహరించిన కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన కావేటిపురంకు చెందిన కుంచవోలు సుబ్రహ్మణ్యం అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.7లక్షలు రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ అన్ని కేసుల్లో నిందితుల్ని పట్టుకోవడంతోపాటు అపహరించిన సొమ్ము, బంగాం, వెండి వస్తువులను రికవరీ చేయించడంలో కీలకంగా పని చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు.
డైకీన్ పరిశ్రమలో దొంగతనం - పలువురి అరెస్ట్
ఇటీవలే తిరుపతి శ్రీసిటీలోని డైకీన్ ఏసీ తయారీ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న నలుగురు, మరో ఐదు మందితో కలిసి కాపర్ వైర్ చోరీకి పాల్పడ్డారు. ఇదే పరిశ్రమలో పని చేస్తున్న కొంత మంది సిబ్బంది వారిని పట్టుకుని, దేహశుద్ది చేసి నివారించే ప్రయత్నం చేయగా వారు తప్పించుకుని పరార్ అయ్యినట్లు ప్రాధమిక విఛారణలో తెలిసిందని ఎస్ఐ తెలిపారు. డైకీన్ పరిశ్రమ యాజమాన్యం ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న నిందితులు 9 మందిని పట్టుకుని, వారి వద్ధ నుంచి 200 మీటర్ల కాపర్ మెటీరియల్, రూ.1.80 వేలు నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా పేర్కోన్నారు.