Jagityal Murder: సుపారీ ఇచ్చి భర్తను చంపించిన భార్య.. రెండో భర్త కొడుకు, మొదటి భర్త కుమారుడి సహకారంతోనే..
మెడలో పుస్తె కట్టిన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆగ్రహించిన భార్య అతణ్ని హత్య చేయించింది. అందుకోసం కొడుకు, మొదటి భర్త కొడుకు సహకారం తీసుకుంది.
తాళి కట్టించుకున్న భార్యను కాదని పరాయి స్త్రీతో ఓ వ్యక్తి నెరిపిన వివాహేతర సంబంధం చివరికి విషాదాంతమయింది. ఇలాంటి అక్రమ సంబంధాలు కడకు ఎంతటి అనర్థాలకు దారి తీస్తాయే చాటే మరో ఘటన ఇది. తన మెడలో పుస్తె కట్టిన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఆగ్రహించిన భార్య అతణ్ని హత్య చేయించింది. అందుకోసం కొడుకు, మొదటి భర్త కొడుకు సహకారం తీసుకుంది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది.
నిర్మల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి సమీపంలోని తిరుచానూరు ప్రాంతానికి చెందిన కంచికట్ల శ్రీనివాస్ అనే 42 ఏళ్ల వ్యక్తి ఓ అనాథ. ఇతను ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వచ్చాడు. అలా బతుకుదెరువు కోసం ఆటో నడిపేవాడు. ఆ క్రమంలోనే ఉప్పల్ ప్రాంతంలోని ఓ బట్టల షాపులో పని చేసే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె జగిత్యాల జిల్లా మెట్‌పెల్లి మండలం వేంపేట్‌కు చెందిన స్వప్న. ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.
అయితే, స్వప్న అనే మహిళకు గతంలో ఓ పెళ్లి జరిగింది. వారికి ఒక కొడుకు పుట్టాక భర్త నుంచి విడిపోయి విడాకులు తీసుకుంది. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్న శ్రీనివాస్, స్వప్నలకు ఒక కుమారుడు, కూతురు జన్మించారు. ఆటో నడుపుతుండే శ్రీనివాస్ క్రమంగా స్నేహితుల సాయంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. అలా ఉప్పల్, వేంపేట్ ప్రాంతాలలో ఇళ్లు నిర్మించి అమ్మేవాడు. ఈ క్రమంలోనే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్య ప్రశ్నించడంతో.. ముగ్గురం కలిసి ఒకేచోట ఉందామంటూ భార్యను వేధించేవాడు. దీంతో విసిగిపోయిన భార్య స్వప్న అతణ్ని చంపడమే సమస్యకు పరిష్కారమని నమ్మింది.
ఈ క్రమంలోనే ఇటీవల కుటుంబసభ్యులంతా వేంపేటకు వచ్చారు. ఇదే అదనుగా భావించిన స్వప్న కొడుకులు తరుణ్, మొదటి భర్త కొడుకు రాజ్ కుమార్‌లతోపాటు నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన తన అక్క కుమారుడు పోశెట్టిలతో కలిసి శ్రీనివాస్‌ను చంపాలనుకుంది. సుపారీ గ్యాంగ్‌ను ఆశ్రయిద్దామని పోశెట్టి తన తమ్ముడు చిక్కా అలియాస్ ప్రవీణ్ కుమార్‌ను వేంపేట్‌కు పిలిపించాడు. ఈ నెల 22న రాత్రి మెదక్, జగిత్యాల జిల్లాలకు చెందిన బాణాల అనిల్, కంచర్ల మహవీర్, మ్యాతరి మధు, కొలనురి సునీల్, పొన్నం శ్రీకాంత్, పూసల రాజేందర్‌లతో రూ.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం.. రాత్రి 11 గంటల సమయంలో నిద్రపోతున్న శ్రీనివాస్‌పై రోకలి బండతో దాడి చేసి చంపేశారు. మృతుడి ఒంటిపై ఉన్న బంగారు నగలను లాక్కొని వారు వెళ్లిపోయారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం కనకాపూర్ సమీపంలోని వాగులో మృత దేహాన్ని పోశెట్టి, రాజ్‌కుమార్, చిక్కాలు పడేశారు. ఈ కేసును ఛేదించిన లక్ష్మణచాంద పోలీసులు మొత్తం 13 మందిని నిందితులుగా గుర్తించారు. వారిలో 10 మందిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పారిపోయారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 73 గ్రాముల బంగారు ఆభరణాలు, హత్యకు ఉపయోగించిన రోకలి బండను స్వాధీనం చేసుకున్నారు.