Hyderabad Crime: తండ్రిని బెల్టుతో, కర్రతో కొట్టిన కొడుకు, నేచురల్ డెత్‌గా నమ్మించేందుకు ప్రయత్నం! గుట్టు బయటికి ఇలా
Jeedimetla: జీడిమెట్లలో జరిగిన ఘటనలో ఏకంగా తండ్రిని చంపేశాడు.. ఓ కుమారుడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇవీ..
కన్న పిల్లల్ని పెంచి పెద్ద చేసేందుకు, వారికి అన్ని వసతులు సమకూర్చేందుకు ఓ తండ్రి తన జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తుంటాడు. పిల్లలు పెద్దయ్యాక తల్లిదండ్రులకు చేతగాని స్థితిలో కాస్త చేదోడుగా ఉంటే చాలని కోరుకుంటారు. కానీ, పెద్దయ్యాక తల్లిదండ్రుల్ని భారంగా భావించే వారు ఎందరో! ఎంతో మంది తల్లిదండ్రులను ఆశ్రమాల్లో చేరుస్తున్నారు. కానీ, తాజాగా జీడిమెట్లలో జరిగిన ఘటనలో మాత్రం ఏకంగా తండ్రిని చంపేశాడు.. ఓ కుమారుడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇవీ..
పక్షవాతంతో మంచానికి పరిమితమైన తండ్రికి సేవలు చేయలేని ఓ కొడుకు కర్కశంగా ప్రవర్తించాడు. తండ్రిని కొట్టి చంపేశాడు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. స్థానికులు వెల్లడించిన వివరాల మేరకు.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన సత్యనారాయణ (70) కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. చిన్నాచితకా పనులు చేసుకుంటూ కుత్బుల్లాపూర్‌లో నివాసం ఉంటున్నారు.
ఆయనకు భార్య, ఓ కొడుకు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తన జీవితంలో ఎంతో కష్టపడి తన స్తోమతకు తగ్గట్లు అందరికీ పెళ్లిళ్లు చేశారు. తర్వాత అనారోగ్యంతో పక్షవాతం బారినపడ్డారు. కొంతకాలంగా మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. కొడుకు సురేశ్ బాబు పెయింటర్‌గా స్థిరపడ్డాడు. 38 ఏళ్ల సురేష్ బాబుకు గతంలోనే పెళ్లి జరిగింది. విభేదాలు రావడం వల్ల భార్యతో విడిపోయాడు. ఆమె కొన్నాళ్లకే పుట్టింటికి వెళ్లిపోయింది. తండ్రికి పక్షవాతం కారణంగా మంచానికే పరిమితం కావడంతో తల్లితోపాటు సురేష్ బాబు కూడా అతనికి సపర్యలు చేస్తుంటాడు.
ఈ విషయంలో సోమవారం తండ్రి, కొడుకుల మధ్య గొడవ జరిగింది. సురేశ్ బాబు బాగా తాగి రావడంతో తల్లి భయపడిపోయి పక్కనే ఉన్న కూతురి ఇంటికి వెళ్లింది. ఇదే సమయంలో సురేశ్ కత్తితో తండ్రి మెడపై పొడిచేందుకు ప్రయత్నించాడు. కానీ, తండ్రి తప్పించుకున్నాడు. తర్వాత బెల్టుతో, కర్రతో దారుణంగా కొట్టాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేని సత్యనారాయణ చనిపోయాడు. దాన్ని సురేశ్ సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ, పక్కింటి వ్యక్తి అనుమానించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా గాయాలు కనిపించాయి. తమదైన శైలిలో విచారణ జరపగా, తానే కొట్టి చంపినట్లు సురేశ్ ఒప్పుకున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నారు.