Crime News : ఏపీసీఐడీ పేరుతో ఐటీ కంపెనీ ఓనర్ కిడ్నాప్ - కర్నూలు ఎస్‌ఐ నిర్వాకం - అరెస్ట్ !
Hyderabad : ఏపీసీఐడీ పేరుతో కిడ్నాపులకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నాయకుడు కర్నూలు డీఐజీ ఆఫీసులో ఎస్‌ఐగా పని చేస్తున్నారు.
APCID : ఏపీ సీఐడీ అధికారులు రాజకీయ నేతల్ని అరెస్ట్ చేసే తీరును ఉపయోగించుకుని కిడ్నాప్‌కు పాల్పడుతున్న ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీసీఐడీ పేరుతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని ఐటీ కంపెనీల యజమానుల్ని కిడ్నాప్ చేసి కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. వీరి పాపం పండి సైబరాబాద్ పోలీసులకు దొరికిపోయారు. ఏపీ పోలీసు వర్గాల్లో సైతం సంచలనం సృష్టిస్తున్నఈ కేసు వివరాలను పోలీులు వెలుగులోకి తెచ్చారు.
హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ప్రారంభంలో జేఏ యాడ్స్ అనే ఐటీ కంపెనీ ఉంది. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంటుంది. రెండు రోజుల కిందట ఈ కంపెనీలోకి ఏపీసీఐడీ అధికారులమంటూ కొంత మంది చొరబడ్డారు. చాలా ఫిర్యాదులు వచ్చాయని చెప్పి యజమానిని అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పి తీసుకెళ్లారు. తర్వాత కిడ్నాప్ చేసినట్లుగా బందువులు, సన్నిహితులకు ఫోన్ చేసి పది కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారు రంగంలోకి దిగారు. కిడ్నాప్ ముఠా గుట్టు బయటకు లాగారు. నిందితుల్ని అరెస్టు చేశారు. వివరాలను మాదాపూర్ డీసీపీ మీడియాకు వెల్లడించారు.
ఐటీ కంపెనీలోకి ఏపీ సీఐడీ అధికారులమంటూ కంపెనీలోకి పది మంది వెళ్లినట్లు మాదాపూర్ డీసీపీ తెలిపారు. ఐటీ కంపెనీ యజమాని దగ్గర నుంచి దాదాపు 10 కోట్ల రూపాయలను నకిలీ ఏపీ సిఐడి అధికారులు డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. రంజీత్ మాజీ ఉద్యోగితో కలిసి ఏపీ సీఐడీ అధికారులుగా వచ్చినట్లు చెప్పారు. అయితే, కర్నూల్ డీఐజీ ఆఫీసులో ఎస్సైగా పని చేస్తున్న సుజన్ తో కలిసి రంజీత్ ఈ కుట్ర చేశాడు. మీరు చాలా మందిని మోసం చేశారంటూ ఐడీ కార్డులను ఐటీ కంపెనీ యజమానికి నకిలీ సీఐడీ టీమ్ చూపించింది.
ఈ ముఠా మొత్తానికి ఎస్ఐ సుజన్ పక్కా ప్లాన్ చేసి దాన్ని అమలు చేసేలా చూశాడు అని మాదాపుర్ డీసీపీ తెలిపారు. డబ్బుల కోసమే ఎస్ఐ సుజన్ ఈ కిడ్నాప్ కేసులో కీలకపాత్ర పోషించాడన్నారు. కంపెనీ మేనేజ్‌మెంట్ కిడ్నాప్ చేసి హోటల్ కి తీసుకెళ్ళారు.. ఆ హోటల్ ల్లోనే పది లక్షల రూపాయలు ట్రాన్సఫర్ చేయించుకున్నారు.. ఏజీఏ యాడ్స్ గత కొన్నేళ్ళుగా ఉద్యోగాలను ఇప్పిస్తుంది. ఏజీఏ యాడ్స్ కు చెందిన దర్శన్, హరిప్రసాద్ లను హోటల్ కు నకిలీ సీఐడీ టీమ్ తీసుకెళ్ళింది. డబ్బులు తీసుకున్న తరువాత ముగ్గురిని సదరు టీమ్ వదిలేసింది. ఫేక్ సీఐడీ అధికారుల మంటూ చెప్పిన నిందితుల దగ్గర నుంచి బయట పడిన తర్వాత దర్శన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏపీసీఐడీ పేరుతో ఏపీ పోలీసు శాఖలోనే పని చేసే పోలీసు ఉద్యోగి ఇలా కిడ్నాప్ ముఠాను నడపడం.. పోలీసు వర్గాల్లోనూ సంచలనాత్మకం అవుతోంది.