Hyderabad News: మత్తు ఇంజెక్షన్లు, మాత్రలు సప్లై చేస్తున్న వ్యక్తి అరెస్ట్ 3 లక్షల విలువ చేసే మందులు స్వాధీనం
Hyderabad News: జిమ్ములు, క్లినిక్ లే ప్రధాన లక్ష్యంగా చేసుకొని మత్తు ఇంజెక్షన్లు, మాత్రలు సప్లై చేస్తున్న ఓ వ్యక్తిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Hyderabad News: జిమ్ములు, క్లినిక్ లే లక్ష్యంగా చేసుకొని అవసరం ఉన్న వారికి మత్తు ఇంజక్షన్లు, మాత్రలు సప్లై చేస్తున్న ఓ నిందితుడిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈక్రమంలోనే మరో నిందితుడు పరారయ్యాడు. ప్రస్తుతం అతడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అదుపులోకి తీసుకున్న నిందితుడి వద్ద నుంచి 3 లక్షల రూపాయల విలువ చేసే మత్తు ఇంజెక్షన్లు, మాత్రలను స్వాధీనం చేసుకున్నారు.
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ శాపూర్ నగర్ లోని బాలానగర్ డీసీపీ కార్యాలయంలో.. డీసీపీ శ్రీనివాస్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మత్తు ఇంజెక్షన్స్, మాత్రలు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని బాలానగర్ ఎస్ఓటీ, సనత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసారని తెలిపారు. పక్కా సమాచారంతో హైదరాబాద్ ఫతేనగర్ లో హరిసేనాపతి అనే నిందుతుడిని అరెష్ట్ చేసామని చెప్పారు. అలాగే నిందితుడి వద్ద నుంచి 33 రకాల మాత్రలు, ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు 3 లక్షల వరకు ఉంటుందని వివరించారు. చెన్నైకు చెందిన శ్రీనివాస్ తో కలిసి హరి దందా చేస్తున్నాడని డీసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. అక్కడి నుండి తెచ్చి నగరంలోని సనత్ నగర్ పరిసరాలలో విక్రయిస్తుంటాడని, హరిసేనాపతిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని వెల్లడించారు. అయితే హరిసేనాపతిని పట్టుకునే క్రమంలోనే మరో నింధితుడు శ్రీనివాస్ తప్పించుకున్నాడని.. త్వరలోనే అతడిని కూడా పట్టుకుంటామని స్పష్టం చేశారు. స్టెరాయిడ్స్ వల్ల ప్రమాదకరమైన కేన్సర్ లాంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుందని, ప్రజలు వీటి భారిన పడి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని డ్రగ్ అధికారి రవికాంత్ సూచించారు.
గత నెలలో హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. మాదకద్రవ్యాలు నగరంలోకి రాకముందే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ పట్టివేశారు. దీని విలువ దాదాపు రూ.41.3 కోట్ల రూపాయలు అని తెలిపారు. హెరాయిన్ బరువు 5.9 కిలోలను ఓ మహిళ వద్ద డీఆర్ఐ అధికారులు గుర్తించారు. ఓ మహిళా ప్రయాణికురాలు మాలావి నుంచి దోహ మీదుగా హైదరాబాద్ చేరుకుంది. అనుమానాస్పదంగా కనిపించడంతో ప్రయాణికురాలిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆమె ఏకంగా సూట్ కేసులో హెరాయిన్ పెట్టుకొని వచ్చినట్లుగా అధికారులు తెలిపారు.
Also Read: Crime News : డ్రగ్స్ కేసులో కబాలి నిర్మాత అరెస్ట్ - అసలు గోవా కేంద్రంగానే !
వారం రోజుల వ్యవధిలోనే సైబరాబాద్ లో అక్రమంగా భారీగా మత్తు పదార్థాలు రవాణా చేస్తున్న డ్రగ్స్ ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే కొకైన్ ను సీజ్ చేశారు. డ్రగ్స్ సరఫరాలో కింగ్ పిన్ గా ఉన్న చింతా రాకేష్ ను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ముఠా.. ఇంజినీరింగ్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇంది ఎంత కాలం నుంచి సాగుతుంది, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఏయే ప్రాంతాల్లో డ్రగ్స్ అక్రమా రవాణా చేస్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్ కింగ్ పిన్ తో పాటు మరో నలుగురు అరెస్ట్ అవ్వడంతో.. త్వరలోనే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.