(Source: ECI/ABP News/ABP Majha)
Kondapur Suicide: మంత్రి పీఏ కొడుకు ఉరేసుకొని ఆత్మహత్య! ఇటీవలే బెయిల్‌పై బయటకు?
మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వద్ద పర్సనల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న దేవేంద్ర కుమారుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు.
తెలంగాణలో ఓ మంత్రి వద్ద పీఏగా పని చేస్తున్న వ్యక్తి కుమారుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర అనుమానాలకు తావిచ్చింది. క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వద్ద పర్సనల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న దేవేంద్ర కుమారుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నగరంలోని కొండాపూర్ సెంటర్ కాలనీలో ఇతను ఉరి వేసుకోవడం కలకలం సృష్టించింది. మృతి చెందిన వ్యక్తిని అక్షయ్ అని పోలీసులు గుర్తించారు. తెలంగాణ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ వద్ద పీఏగా పని చేస్తున్న దేవేంద్ర కుమారుడిగా పోలీసులు గుర్తించారు.
అయితే, అక్షయ్ ఓ కేసు విషయంలో అరెస్టు అయి జైలుకు వెళ్లి ఇటీవలే బెయిల్ మీద విడుదల అయ్యాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కొండాపూర్ లోని పార్క్ కాలనీలోని శ్రీ వెంకటసాయి నిలయంలో 23 ఏళ్ల అక్షయ్ నివాసం ఉంటున్నాడు. అక్షయ్ ఇటీవలే మహబూబ్ నగర్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల అక్రమ వసూళ్ల కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే, సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో అక్షయ్ తన రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్షయ్ వల్ల తన తండ్రికి చెడ్డ పేరు వచ్చిందనే కారణంగా మనస్తాపంతో ఉరి వేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. డబ్బుల వ్యవహరం కూడా కారణమని సమాచారం. పోస్టుమార్టం నిమిత్తం అక్షయ్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.