Hyderabad News: హైదరాబాద్‌లో ‘అత్తిలి సత్తి’ - విక్రమార్కుడు సీన్ రిపీట్!
Hyderabad Crime News: హైదరాబాద్ ఎల్బీనగర్ లో దొంగబాబా హల్ చల్ చేశాడు. మాయ మాటలు చెప్తూ పసుపు, కుంకుమ చల్లాడు. ఆపై ఆమె స్పృహ తప్పి మెడలో ఉన్న చైన్ ని ఇచ్చేయగా.. అతను జారుకున్నాడు.
Hyderabad Crime News: హైదరాబాద్ ఎల్బీ నగర్ లో దొంగ బాబా హల్ చల్ చేశాడు. మాయ మాటలు చెప్తూ ఇంట్లోకి వచ్చిన ఆ బాబా.. సదరు మహిళపై పసుపు, కుంకుమలు చల్లాడు. దీంతో మహిళ స్పృహ తప్పింది. ఈ క్రమంలోనే అతను చెప్పినట్లు నడుచుకుంది. మెడలో ఉన్న బంగారు చైన్ ను ఇచ్చేసింది. ఆ తర్వాత బాబా మెల్లగా అక్కడి నుంచి ఉడాయించాడు.
అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఇంద్రప్రస్థ కాలనీలో వరలక్ష్మి, రాము దంపతులు నివసిస్తున్నారు. రాము ఓ చిన్నపాటి వ్యాపారి. కాషాయ దుస్తులు ధరించిన బాబా వరలక్ష్మి ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెతో మాటలు కలుపుతూ పసుపు, కుంకుమలు చల్లాడు. దీంతో వరలక్ష్మి బాబా చెప్పినట్లు ఆడింది తన మెడలో ఉన్న గొలుసు తీసి బాబాకు ఇచ్చింది. గొలుసు తీసుకున్న బాబా మెళ్లగా బయటకు వెళ్లిపోయాడు. ఇదంతా జరుగుతున్నా ఆమెకు ఏమీ తెలియలేదు. వరలక్ష్మిపై మత్తమందు చల్లిన బాబా బురిడీ కొట్టించాడు. వరుసగా పక్కనే ఉన్న రెండిళ్లలోకి కూడా బాబా వెళ్లాడు. కానీ అక్కడ ఎవరూ దొంగ బాబా చేతిలో మోసపోలేదు. సకాలంలో మహిళ భర్త రావడంతో బాబా అక్కడి నుంచి జారుకున్నాడు. ఇదంతా సీసీ కమెరాల్లో రికార్డు అయింది.
అయితే సదరు మహిళ స్పృహలోకి రాగానే తన మెడలో ఉన్న చైన్ కనిపించట్లేదని చెప్పింది. వెంటనే వాళ్లు సీసీ టీవీ చెక్ చేశారు. జరిగినదంతా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు నేరాలను తగ్గించేందుకు ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. కాగా బురిడీ బాబాను ఎల్బీ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఇంద్ర ప్రసతా కాలనీలో మహిళ మెడలో నుంచి మంగళ సూత్రాన్ని లాక్కెళ్లిన బురిడీ బాబాను నందనవనంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
నెలరోజుల క్రితం ఖమ్మంలోనూ ఇలాంటి ఘటనే..!
ఖమ్మం పట్టణంలో దొంగ బాబా విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజల నమ్మకాలను ఆసరాగా చేసుకుంటూ కొంతమంది కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు సామాన్య ప్రజలను దోచుకున్న ఘటనలు మనం చాలానే చూశాం. కానీ ఓ రాజకీయ నాయకుడినే బోల్తా కొట్టించాడో దొంగబాబా. రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఓ పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు ఇంట్లో చోరీ చేసి ఉడాయించాడు. విషయం గుర్తించిన సదరు రాజకీయ నాయకుడు పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటిన రంగంలోకి దిగి సినిమాటిక్ స్టైల్లో వారిని చేస్ చేసి పోలీసులు పట్టుకున్నారు.
దొంగ స్వాములు పట్టణంలో నివాసం ఉంటున్న ఓ పార్టీ నాయకుని ఇంటికి చేరుకున్నారు. నీకు రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉందని, కానీ అందు కోసం నీవు కొన్ని పూజలు చేస్తే కలిసి వస్తుందని నమ్మబలికాడు. చివరకు పూజ చేయకుండానే అతని ఇంట్లో నుంచి 5 తులాల బంగారం, 35వేల నగదుతో పరారయ్యాడు. దీంతో వెంటనే ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. ఇక వెంటనే రంగంలోకి దిగిన ఖమ్మం టూ టౌన్ పోలీసులు… రెండు జిల్లాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారులో పారిపోతున్న దొంగ స్వాములను కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ దొంగ స్వాములు రాజస్థాన్ కు చెందిన వారిగా గుర్తించారు. కారులో ఉన్న ఇద్దరు స్వాముల్లో ఒకరు పరారు కాగా మరో స్వామి, కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కారులో గంజాయి కూడా లభ్యమైనట్లు సమాచారం. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు… వారిని విచారణ చేస్తున్నారు.