శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 5.9 కేజీల హెరాయిన్ పట్టివేత, ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
Shamshabad airport: విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలిపై అనుమానం వచ్చి తనిఖీ చేయగా ఆమె వద్ద నుంచి భారీ స్థాయిలో 5.92 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రతిరోజూ డ్రగ్స్, స్మగ్లింగ్ చేస్తున్న బంగారం పట్టుబడుతున్నాయని తెలిసిందే. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను తనిఖీ చేసి కస్టమ్స్ అధికారులు వీటిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో భారీ మొత్తంలో డ్రగ్స్ దొరికాయి. విదేశాల నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలిపై అనుమానం వచ్చి తనిఖీ చేయగా ఆమె వద్ద నుంచి భారీ స్థాయిలో 5.92 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు రూ.41 కోట్ల విలువ చేస్తుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితురాలిని జాంబియాకు చెందిన లుసాకా అని అధికారులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా హెరాయిన్‌ను డాక్యుమెంట్ ఫోల్డర్‌లో దాచిపెట్టి స్మగ్లింగ్ చేస్తుందని గుర్తించారు. నిందితురాలిపై ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
వేరే రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్..
రెండు రోజుల కిందట రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు ప్రైవేట్ బస్సులో డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. దుస్తుల చాటున మాదకద్రవ్యాలను హైదరాబాద్ తరలించి, నగరంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముఠా ఆట కట్టించారు పోలీసులు. నిందితుల వద్ద నుంచి దాదాపు కోటి రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లో ఎక్కువ రేటు వస్తుందని ఆశతో..
రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ సుధీర్‌బాబు వివరాలను వెల్లడించారు. హైదరాబాద్ లో ఎక్కువ ధరలకు డ్రగ్స్ విక్రయించవచ్చునని భావించిన నిందితులు రాజస్థాన్ నుంచి నగరానికి తెచ్చి విక్రయిస్తున్నారు. రాజస్థాన్‌లో హెరాయిన్ రూ. 5, 6 వేలకు కొని హైదరాబాద్‌లో రూ. 10 వేల నుంచి రూ. 12 వేల చొప్పున అమ్మాలని డ్రగ్స్ గ్యాంగ్ భావించింది. ఎండీఎంఏ గ్రాము రూ. 2 వేల నుంచి రూ. 4 వేలకు కొని.. ఇక్కడ డబుల్ రేట్‌లకు విక్రయించాలని ప్లాన్ చేశారు. రాజస్థాన్ నుంచి 150.3 గ్రాముల హెరాయిన్, 32.1 గ్రాముల ఎండీఎంఏను కొని దుస్తుల్లో దాచిపెట్టి, ప్రైవేట్ బస్సులో హైదరాబాద్ కు తెచ్చారు. కానీ విక్రయాలను యత్నిస్తూ రాజస్థాన్ గ్యాంగ్ పోలీసులకు దొరికిపోయింది.