(Source: Matrize)
Hyderabad Crime : గాజుల ప్యాక్ మధ్యలో రూ.3 కోట్ల విలువైన డ్రగ్స్, కొరియర్ ద్వారా విదేశాలకు ఎగుమతి!
Hyderabad Crime : హైదరాబాద్ లో ఇద్దరు అంతర్జాతీయ డ్రగ్ ట్రాన్స్ పోర్టర్స్ ను పోలీసులు అరెస్టు చేశారు. గాజుల మధ్యలో డ్రగ్స్ పెట్టి కొరియర్ సర్వీసుల ద్వారా విదేశాలకు డ్రగ్స్ ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు.
Hyderabad Crime : హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఇద్దరు అంతర్జాతీయ డ్రగ్ ట్రాన్స్ పోర్టర్స్ ను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్ మెంట్, బేగంపేట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.3 కోట్ల విలువైన 3.1 కేజీల సూడో ఎఫెన్డ్రిన్, 23 సిమ్ లు, 12 ఫేక్ ఆధార్ కార్డులు, 6 మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు.ఇప్పటి వరకు దాదాపు రూ.100 కోట్ల డ్రగ్స్ విదేశాలకు ఎగుమతి జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ డ్రగ్స్ ముఠా చెన్నై నుంచి హైదరాబాద్ మీదుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లకు డ్రగ్స్ ఎగుమతి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
గాజుల మధ్యలో డ్రగ్స్
"హైదరాబాద్ లోని కొరియర్స్ ద్వారా ఇతర దేశాలకు డ్రగ్స్ పంపిస్తున్నారు. ప్రతి కొరియర్ సర్వీస్ వద్ద ఫేక్ ఆధార్ కార్డులు ఇస్తున్నారు. ప్యాక్ చేసిన గాజుల మధ్యలో డ్రగ్స్ పెట్టి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ముఠా చెన్నై నుంచి హైదరాబాద్ మీదుగా విదేశాలకు డ్రగ్స్ పంపిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇద్దరు డ్రగ్స్ ట్రాన్స్ పోర్టర్స్ ను పట్టుకున్నాం. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్, న్యూజిలాండ్ లో ఆక్లాండ్ కు ఈ డ్రగ్స్ ఎగుమతి చేస్తున్నారు. అంతర్జాతీయ కొరియర్ సర్వీసుల్లో అయితే దొరికిపోతామని స్థానికంగా ఉన్న కొన్ని కొరియర్ సర్వీసుల ద్వారా డ్రగ్స్ ట్రాన్స్ పోర్టు చేస్తున్నారు. " - పోలీసులు
9 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్
హైదరాబాద్ లో ఇటీవల భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. న్యూ ఇయర్ వేడుకలే లక్ష్యంగా డ్రగ్స్ రవాణా చేస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్జాతీయ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మల్కాజిగిరిలో ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లను అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 8.5 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.9 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విదేశాలకు డ్రగ్స్ తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. న్యూ ఇయర్ వేడుకలకు భారీగా డ్రగ్స్ అమ్మకాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. డ్రగ్స్ ముఠా వెనుక కీలక సూత్రధారులున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల విచారణలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు. మరికొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ఇద్దరు స్మగ్లర్లపై పీడీ యాక్ట్
గంజాయి స్మగ్లింగ్ కి పాల్పడిన ఇద్దరు గంజాయి స్మగ్లర్లపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి రంగనాథ్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన జావీద్ భగవాన్, ఏజాజ్ ఖాన్ పై వరంగల్ పోలీస్ కమిషనర్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను రఘునాథపల్లి సర్కిల్ ఇన్స్స్పెక్టర్ సంతోష్ నిందితులకు చర్లపల్లి కారాగారంలో అందజేశారు. పీడీ యాక్ట్ అందుకున్న నిందితులు ఇద్దరు మరో ఇద్దరితో కలిసి జూలై 22న ఆంధ్రప్రదేశ్ నుంచి హైదాబాద్ కు మినీ ట్రక్కులో రహస్యంగా 400 కిలోల గంజాయిని రహస్యంగా తరలిస్తుండగా రఘునాథపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వనపర్తి గ్రామ శివారులో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. పోలీస్ కమిషనర్ మాట్లాడూతూ చట్టవ్యతిరేక కార్య కలపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారిపై పీడీయాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.